Shreyas Iyer Injury: భారత్ – ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరిగిన మూడవ వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో క్యాచ్ పట్టిన సందర్భంలో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అదే సమయంలో గాయం కారణంగా అతడు మైదానాన్ని విడాల్సి వచ్చింది. ఈ మూడవ వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
Also Read: Brock Lesnar: బీఫ్ దుకాణం పెట్టుకున్న బ్రాక్ లెస్నర్… షాకింగ్ వీడియో ఇదిగో
ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్లు మంచి శుభారంభం అందించినా.. మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లు రాణించడంతో సీన్ రివర్స్ అయ్యింది. అదే సమయంలో ఆస్ట్రేలియా నమ్మకమైన బ్యాటర్ అలెక్స్ క్యారీ క్యాచ్ ని అద్భుతంగా అందుకని శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ని మలుపు తిప్పాడు. హర్షిత్ రానా బౌలింగ్ లో అలెక్స్ క్యారీ పాయింట్ మీదుగా గాల్లోకి లేపిన బంతిని శ్రేయస్ అయ్యర్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ అందుకున్నాడు.
అయ్యర్ పక్కటెముకలకు గాయం:
క్యాచ్ పట్టే సమయంలో శ్రేయస్ అయ్యర్ డైవ్ చేయడంతో.. బంతి అతడి పక్కటెముకలకు బలంగా తాకింది. ఈ క్రమంలో అయ్యర్ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. దీంతో వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ అతడికి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో ఫిజియో సాయంతో అతడు మైదానాన్ని వీడి వెళ్ళాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లోని 34వ ఓవర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ తిరిగి ఫీల్డ్ లోకి రాలేదు. ఇక బ్యాటింగ్ సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టార్గెట్ ని పూర్తి చేయడంతో.. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కి దిగాల్సిన అవసరం రాలేదు. ఒకవేళ అతడి బ్యాటింగ్ వరకు వచ్చినా.. అతడు డ్రెస్సింగ్ రూమ్ కి పరిమితమయ్యేవాడు. అయితే తాజాగా శ్రేయస్ అయ్యర్ గాయం పై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది.
శ్రేయస్ అయ్యర్ గాయంపై బీసీసీఐ అప్డేట్:
“ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అయ్యర్ ఎడమ పక్కటెముకకు గాయమైంది. అతడు ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని గాయం పరిస్థితి పూర్తిగా అంచనా వేయాల్సి ఉంది” అని బిసిసిఐ తెలిపింది. అయితే అతడు కోలుకునేందుకు కొన్ని వారాలపాటు సమయం పడుతుందని సమాచారం. బీసీసీఐ ప్రత్యేక వైద్యుడిని అతడి పర్యవేక్షణకు నియమించారని.. జట్టు వైద్యునితో పాటు ఆస్ట్రేలియాలో ఉన్న కొంతమంది స్నేహితులు కూడా అతని వద్ద ఉన్నారని సమాచారం.
అతడు తిరిగి భారత్ కి ఎప్పుడు వస్తాడు అన్నదానిపై క్లారిటీ లేదు. ఇక అతడు భారత్ కి వచ్చిన తరువాత బెంగుళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మరింత వైద్య పరీక్షలు చేసుకోవలసి ఉండవచ్చు. త్వరలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతుంది. శ్రేయస్ అయ్యర్ ఆ సమయానికి తిరిగి జట్టులో చేరతాడా..? లేదా..? అన్నది వేచి చూడాలి. మరోవైపు శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. శ్రేయస్ అయ్యర్ ఇటీవల వైస్ కెప్టెన్ గా కూడా ప్రమోట్ అయ్యాడు. అలాగే అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు త్వరగా కోలుకోవాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.