CM Revanth: ఈవారం సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీబిజీగా సాగింది. ఆకస్మిక తనిఖీలు, కీలక రివ్యూలు చేశారు. మున్సిపాలిటీలకు భారీగా నిధుల మంజూరు, క్యాబినెట్ మీటింగ్ లో SLBC పనులపై కీలక నిర్ణయం, అలాగే స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల రూల్ తొలగింపు ఆర్డినెన్స్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త ఇలాంటి ఫుడ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం.
మున్సిపాలిటీలకు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాలను గ్రోత్ హబ్ గా మార్చే విషయంపై రోడ్ మ్యాప్ తో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా మున్సిపాలిటీలకు 2780 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2432 పనులకు సర్కారు ఆమోదం తెలిపింది. ఈ పనులకు సంబంధించి వెంటనే టెండర్లు పలిచి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రతి కొత్త మున్సిపాలిటీకి 15 కోట్లు, విలీన గ్రామాలతో ఉన్న మున్సిపాలిటీలకు 20 కోట్ల చొప్పున ఇవ్వాలని ఆదేశించారు.
పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త:
జీ+1 తరహాలో ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ కోర్ అర్బన్ సిటీని మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు వెంటనే నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాలను గ్రోత్ హబ్ గా తీర్చి దిద్దాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అటు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ పరిధిలో 2020 నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 10 లక్షల రూపాయలలోపు పనులకు సంబంధించిన బిల్లులు 100 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామాలు, మండలాలు, పట్ణణాల్లో రోడ్ల మెయింటెనెన్స్ కోసం చేసిన పనులు, ఇతర వర్క్‌లకు సంబంధించి 3,610 బిల్స్ పెండింగ్‌లో ఉంటే వాటిని క్లియర్ చేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పెట్ అండ్ ప్లే పార్క్ పనులను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రోజున ఆకస్మికంగా పరిశీలించారు. పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వచ్చే టైంలో పార్క్ వద్ద ఆగి అక్కడ జరుగుతున్న పనులను అబ్జర్వ్ చేశారు. చెత్తా చెదారంతో నిండిన ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా, పార్క్ నిర్మాణం చేయాలని సీఎం గతంలో జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. దీంతో ఆ స్థలానికి ఓ రూపం వచ్చింది. నిర్మాణ పనులు ఫైనల్ స్టేజ్ కు చేరుకోవడంతో పార్క్‌లో జరుగుతున్న పనులను సీఎం ఆకస్మికంగా పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కూలీలను సీఎం రేవంత్ ఆప్యాయంగా పలకరించారు. పనులకు సంబంధించిన వివరాలతో పాటు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కర్నూలు బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు గాయపడ్డవారికి 2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మృతిచెందిన తెలంగాణ వాసులకు ఎక్స్‌గ్రేషియాను ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం చెప్పారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన చాలా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఇందులో తెలంగాణ వాసులు కూడా ఉండడంతో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు జెన్‌కో సీఎండీ హరీష్‌ను వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు హెల్ప్‌లైన్ వ్యవస్థను సమన్వయం చేశారు.
ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు కేరాఫ్ గా నిలుస్తున్న హైదరాబాద్ మరో కీలక సంస్థ పెట్టుబడులను ఆకర్షించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత విమానయాన సంస్థ సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ తన గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి బృందం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రపంచ పెట్టుబడులకు, సాంకేతిక ఆవిష్కరణలకూ కేంద్రంగా నిలుస్తోన్న హైదరాబాద్ సిటీలో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ స్థాపించాలన్న నిర్ణయాన్ని సీఎం రేవంత్ స్వాగతించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అభివృద్ధి లక్ష్యాలను సీఎం వారికి వివరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో భాగంగా, 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమన్నారు.
ఈనెల 23న జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తి వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం – 2018 లోని సెక్షన్ 21లోని థర్డ్ క్లాజ్ ని తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని తీర్మానించింది. ఇక ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభం నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలను ఫ్లోరైడ్ రహిత ప్రాంతాలుగా చేయడానికి సంకల్పించిన ఈ ప్రాజెక్టు 44 కిలోమీటర్ల సొరంగంలో ఇప్పటికే దాదాపు 35 కిలోమీటర్లు పూర్తయింది. మిగిలిన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని క్యాబినెట్ తీర్మానించింది. ఇప్పటివరకు పనులు చేపట్టిన ఏజెన్సీ ద్వారానే పూర్తి చేయించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం అదనంగా ఆర్థిక భారం లేకుండా ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా కాకుండా అత్యాధునిక డ్రిల్లింగ్ పద్ధతిలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి క్యాబినెట్ ఆమోదించింది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసిందని మంత్రిమండలి అభిప్రాయపడుతూ, ఈ అంశంపై హైకోర్టు తీర్పును అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ చేశారు. అటు వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యంగా ఎల్బీనగర్, సనత్‌నగర్, అల్వాల్, వరంగల్‌లలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా వారికి మరో ఆప్షన్ కల్పించింది. ఇప్పుడు పట్టణ ప్రాంత పేదల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణాలు, నగరాల్లో జి ప్లస్ 1 తరహాలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే అవకాశం కల్పించాలని డిసైడ్ చేశారు. దీంతో మురికి వాడల రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల సొంతింటి కలను నిజం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించిన సర్కారు.. కనీసం 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జి ప్లస్ 1 తరహాలో ఇంటిని నిర్మించుకునేందుకు జీవో నెంబంర్ 69 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
భూముల వేలంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం రాబడుతున్న ప్రభుత్వం మరిన్ని ప్రభుత్వ భూముల వేలానికి సిద్ధమవుతోంది. ఈ చర్యతో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ సెక్టార్ లో రియల్ బూమ్ ఎలా ఉందో బాహ్య ప్రపంచానికి తెలియడంతో పాటు ఖజానాకు ఆదాయం కూడా సమకూరుతోంది. నియోపోలిస్ లే అవుట్‌లో మూడో దశ భూముల విక్రయానికి సన్నాహాలు చేపట్టింది. ఇటీవల రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలానికి అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో రాయదుర్గం, కోకాపేట్ ప్రాంతాల్లోని డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని సుమారు 25 ఎకరాలకు పైగా భూములను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో టీజీఐఐసీ భూములకు లభించినట్లుగానే కోకాపేట్ నియోపోలిస్ భూములకు కూడా భారీ స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో నియోపోలిస్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో ఒక ఎకరా అత్యధికంగా 100.75 కోట్లకు విక్రయించారు. ఈసారి అంతకంటే ఎక్కువకే అమ్ముడు పోతుందని భావిస్తున్నారు. దీంతో 25 ఎకరాలపై సుమారు 3 వేల కోట్ల వరకు రావచ్చన్న అంచనాలున్నాయి.
Story by Vidyasagar, Big tv