Sajjanar On Bus Accident: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బస్సు దగ్ధమైన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడేలా చేసింది. నిర్లక్ష్యం నిండు ప్రాణాలను తీసింది. ఈ ప్రమాదానికి కారణమైన బైకర్ మద్యం తాగినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. అలాగే బైకర్ మద్యం కొనుగోలు చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెట్రోల్ బంక్ లో బైకర్ ప్రవర్తించిన తీరు మద్యం సేవించినట్లు స్పష్టం చేస్తుంది.
కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన సంచలన పోస్టు పెట్టారు.
‘ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మంది ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి. వాళ్లు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? సమాజంలో మన చుట్టూ తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండండి. వీరి కదలికలపై వెంటనే డయల్ 100కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వండి. చూస్తూ చూస్తూ వాళ్లను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది’ అని సీపీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు.
కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై ఒక్కో విషయం వెలుగులోకి వస్తుంది. చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరి బస్సు ఘటనపై ఎక్సైజ్ శాఖ ప్రాథమిక విచారణ చేపట్టింది. పెద్దటేకూరు గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ వైన్స్ నుంచి బైకర్ శివశంకర్, అతడి స్నేహితుడు ఎర్రిస్వామి మద్యం కొనుగోలు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. శివశంకర్ రెండుసార్లు మద్యం కొనుగోళ్లు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ రికార్డు అయింది. సాయంత్రం గురువారం సాయంత్రం 7:00 గంటలకు, మళ్లీ రాత్రి 8:25 గంటలకు మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీలో రికార్డు అయింది. వీళ్లు ఓ పెట్రోల్ బంక్ లోకి వెళ్లిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.
కర్నూలు దుర్ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శివ శంకర్ మద్యం సేవించినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో నిర్థారణ అయిందన్నారు. బస్సు డ్రైవర్ మద్యం తీసుకోలేదన్నారు. మద్యం మత్తులో బైక్ నడుపుతూ శివ శంకర్, ఎర్రిస్వామి ప్రమాదానికి గురయ్యారన్నారు. ఈ ప్రమాదంలో శివశంకర్ మృతి చెందగా, ఎర్రిస్వామికి స్వల్పగాయాలు అయ్యాయి. వీరి బైక్ ను కావేరి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి 19 మంది మృతి చెందారు.