Mahesh Kumar Goud: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలోని పలు అంశాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. డీసీసీ నియామకాల ప్రక్రియ గురించి ప్రస్తావిస్తూ.. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, తాను ముగ్గురి నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపారు. సమగ్రంగా డీసీసీలను ఏర్పాటు చేయడమే లక్ష్యం అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పార్టీ బలోపేతం కావాలి అని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో అందరి సలహాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, దీని ద్వారా కాంగ్రెస్ మరింత స్థాయిలో బలపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో ఆన్ టు వన్ మీటింగ్ జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో డీసీసీ నియామకాలే ప్రధానంగా చర్చించామని తెలిపారు. వేణుగోపాల్ ఈ జాబితాను ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తమ అభిప్రాయాన్ని నేరుగా ఏఐసీసీకి పంపుతారని స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాన్ని నేరుగా హైకమాండ్‌కు పంపుతారని ఆయన అన్నారు.
మంత్రుల మధ్య ఉన్న విభేదాలు, లాబీయింగ్‌లు ఇక కొనసాగవని, ఇప్పుడు అందరూ పాలన, ప్రజాసంక్షేమంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై మహేష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలా మాట్లాడి ఉండకూడదు. ముఖ్యంగా వేరే కులాల గురించి మాట్లాడటం సరికాదు అని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులపై విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ అంతర్గత విషయాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లోని చిన్న వివాదాలను రాజకీయంగా ఆసరాగా మలుచుకుంటున్నారని, దీన్ని అరికట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
పీసీసీ అధ్యక్షుడిగా తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించానని ఆయన చెప్పారు. ఎంత ఒడిగితే అంత మంచిది. వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరమని, కులాల గురించి చర్చించే హక్కును దుర్వినియోగం చేయరాదని ఆయన హితవు పలికారు.
Also Read: మన చుట్టూ టెర్రరిస్టులు, మానవ బాంబులు.. సీపీ సజ్జనార్ సంచలన పోస్ట్
కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లిన సంఘటన గురించి మాట్లాడుతూ.. అది కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. సుమంత్ అనే వ్యక్తిని ఫాలో అవుతూ పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇది ముగిసిన అధ్యాయం అని ఆయన చెప్పి, దాన్ని రాజకీయం చేయవద్దని కోరారు.