AP News: నంద్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరినీ కలచివేస్తోంది. ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామానికి చెందిన 25 ఏళ్ల చిరంజీవి అనే యువకుడు తీసుకున్న కఠిన నిర్ణయం, అతను రాసిన ఆఖరి ఉత్తరం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పుట్టినప్పటి నుండి ఒక వైపు అనారోగ్యం, మరోవైపు తన వల్ల కుటుంబం పడుతున్న ఆర్థిక ఇబ్బందులను చూడలేక, ఆ యువకుడు రైలు కింద పడి తనువు చాలించాడు. చనిపోతూ అతను కోరుకున్న ఆఖరి కోరిక వింటే ఎవరికైనా గుండె తరుక్కుపోక మానదు.
తల్లిదండ్రుల కష్టం చూడలేక.. కన్నకొడుకు ఆవేదన
చిరంజీవి పుట్టుకతోనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కొడుకుని ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని ఆ తల్లిదండ్రులు తమ శక్తికి మించి ప్రయత్నించారు. అప్పులు చేసి, ఉన్నదంతా ఊడ్చి లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయితే, తన కోసం తల్లిదండ్రులు పడుతున్న శ్రమను, వారి ఆర్థిక స్థితిగతులను గమనిస్తూ పెరిగిన చిరంజీవిలో ఒక రకమైన అపరాధ భావం పెరిగిపోయింది. తను వారికి ఆసరాగా ఉండాల్సింది పోయి, భారంగా మారానేమో అన్న ఆలోచన అతడిని కుంగదీసింది.
“నా శవాన్ని అమ్మానాన్నలకు చూపించకండి”
ఆత్మహత్యకు ముందు చిరంజీవి రాసిన సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. “ఉరిశిక్ష పడే ఖైదీకి కూడా ఆఖరి కోరిక తీర్చుకునే అవకాశం ఇస్తారు.. అలాగే నాకో కోరిక ఉంది” అంటూ తన లేఖను ప్రారంభించాడు. “నేను చనిపోయాక నా శవాన్ని అమ్మానాన్నలకు చూపించకండి. నా మృతదేహాన్ని చూసి వారు తట్టుకోలేరు, ఆ బాధను నేను ఊహించలేను. నా శవాన్ని కుక్కలకు ఆహారంగా వేయండి లేదా ఎక్కడైనా చెత్తకుప్పలో పారేయండి” అని కోరడం అతడి మనసులోని ఆవేదనకు అద్దం పడుతోంది.
కన్నీరు మున్నీరవుతున్న పడకండ్ల గ్రామం
చిరంజీవి తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో పడకండ్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తన చావుతోనైనా తల్లిదండ్రులపై భారం తగ్గాలని ఆ యువకుడు భావించినా, కన్నబిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఆఖరి నిమిషం వరకు తన తల్లిదండ్రుల క్షేమం కోసమే ఆలోచించిన చిరంజీవి, ఆ కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు
ఈ ఘటన సమాజానికి ఒక హెచ్చరిక. శారీరక లేదా మానసిక ఇబ్బందులతో బాధపడే వారు తమను తాము భారంగా భావించకూడదు. తల్లిదండ్రులకు బిడ్డల ఆరోగ్యం కంటే వారి ప్రాణం ముఖ్యం. ఏ సమస్యకైనా ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదు. చిరంజీవి లేఖలోని మాటలు కన్నీళ్లు తెప్పించినా, ఇలాంటి విషాదాలు మరే కుటుంబంలోనూ జరగకూడదని కోరుకుందాం.
Also Read: తమిళనాడు పాలిటిక్స్‌లో హాట్ టాపిక్.. జోస్యం నిజమైంది.. జ్యోతిష్యుడికి సీఎం విజయ్ భారీ ఆఫర్!