Mahabubabad Crime:పెళ్లయిన కొత్తలో ఎంతో అన్యోన్యంగా, ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా గడిపే జంటలు.. కాలక్రమేణా ఆ ప్రేమను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో. అప్పటివరకు ప్రాణంగా చూసుకున్న వ్యక్తుల మధ్య ఒక్కసారిగా మనస్పర్దాలు రావడం.. దానిని పరిష్కరించడానికి బదులు పంతాలకు పోయి పచ్చని సంసారాన్ని పాడుచేసుకుంటున్నారు.
కాపురంలో తలెత్తిన మనస్పర్ధుల ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. భార్య పుట్టింటి నుంచి తిరిగి రావడం లేదన్న వేదనతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తాళ్ల ఊకల్లు గ్రామంలో చోటుచేసుకుంది.
తాళ్ల ఊకల్లు గ్రామానికి చెందిన కళ్ళం నవీన్‌కు మానస అనే యువతితో ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది. పెళ్లయిన కొత్తలో సజావుగానే సాగిన వీరి సంసారంలో గత కొన్ని రోజులుగా గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో మానస తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తిరిగి కాపురానికి తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో నవీన్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే నవీన్ ప్రాణాలు విడిచాడు. వివాహమైన కొద్ది కాలానికే నవీన్ ఇలా ప్రాణాలు తీసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.