Mailardevpally Theft case : సులువుగా డబ్బులు సంపాదించేందుకు ప్రణాళికలు రచించిన దుండగులు.. రూ.20 లక్షలను దారి దోపిడి చేసి పరారైయ్యారు దుండగులు. హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ కేసును ప్రత్యేకంగా టేకప్ చేసిన తెలంగాణ పోలీసులు.. నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రాలు దాటిపోయిన దుండగుల్ని గుర్తించి, సొమ్ముల్ని రికవరీ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాల్ని రాజేంద్ర నగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ నెల మార్చి 4న ఓ ప్రైవేట్ సంస్థను నడిపిస్తున్న జితేందర్ బజాజ్ అనే వ్యక్తి బ్యాంకు నుంచి సంస్థకు చెందిన రూ.20 లక్షలు విత్ డ్రా చేసుకుని వస్తున్నాడు. కొంత దూరం అతన్ని ఫాలో అయిన కొందరు దుండగులు.. వెనుక నుంచి కారుతో ఢీ కొట్టించి, నగదును దోచుకునిపోయారు. దాంతో.. వెంటనే బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సంఘటనా స్థలం నుంచి కారు ప్రయాణించిన మార్గాన్ని జల్లెడ పట్టారు. నిందితులు ప్రయాణించిన మార్గాన్ని కనుక్కున్నారు.
దొంగిలించిన డబ్బుతో నిందితులు ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించినట్లుగా గుర్తించారు. అక్కడ పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. కారు దిగి బస్సులోకి మారిపోతారు. బస్సులోనే రాజస్థాన్ చేరుకున్నారు. హైదరాబాద్ లో దోపిడి చేసి.. దర్జాగా రాజస్థాన్ కు చేరుకున్న దుండగులు, ఇత తమని ఎవరూ పట్టుకోలేరనే ధైర్యం తెచ్చుకునే సమయానికి పోలీసులు అనూహ్యంగా విరుచుకుపడ్డారు.
ఎంత దూరం పారిపోయినా వెనుకే వస్తాం అన్నట్లుగా రాజస్థాన్ చేరుకున్న పోలీసులు.. డబ్బును దోచుకున్న నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిని.. సచిన్, సీతారాం స్వామి, హేమంత్ శర్మలగా గుర్తించారు. మరో యువకుడు ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడని, అతన్ని త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. రాజస్థాన్ నుంచి నిందితుల్ని హైదరాబాద్ తీసుకువచ్చిన పోలీసులు.. నిందితుల నుంచి రూ.18 లక్షల మేరకు రికవరీ సాధించారు
పని చేస్తున్న వారే ప్రథకం వేశారు
బాధితుడైన జితేందర్ బజాజ్ కి చెందిన SRM ప్రొడక్ట్ పరిశ్రమలో గతంలో పనిచేసిన సచిన్ స్వామి, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రశాంత్ లు ఈ దారి దోపిడికి ప్రణాళికలు రచించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందుతులకు జితేందర్ గురించి అతని ఆదాయంతో పాటుగా డబ్బులు తెచ్చే మార్గం సైతం తెలిసి ఉండడంతో.. దారి దోపిడికి ప్లాన్ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బు కాజేసేందుకు ముందుగా.. రెక్కీ నిర్వహించిన నిందితులు ఎలా దోపిడి చేయాలో ముందే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : Child Trafficking gang : అక్కడ కొని.. ఇక్కడ అమ్మేస్తున్నారట.. శిశువుల అక్రమ రవాణాలో షాకింగ్ విషయాలు వెల్లడి
నిందితులను రోజుల వ్యవధిలోనే పట్టుకున్న పోలీసులు.. నిందితుల్ని పట్టుకోవడం, వారి నుంచి రికవరీ సాధించడంతో హైదరాబాద్ పోలీసుల సేవలపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసు చేధనలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి డీసీపీ శ్రీనివాస్ క్యాష్ రివార్డులను అందించారు. వారి విశేష కృషి కారణంగానే కేసు ఓ కొలిక్కి వచ్చిందని అభినందించారు. కాగా.. నిందితుల పట్టివేత, నగదు స్వాధీనంతో బాధితుడు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.