మితంగా తింటే ఆహారమే మన శరీరానికి బలం. అదే అతిగా తింటే అదే మనకు ప్రమాదకరంగా మారుతుంది. బరువు పెరిగేలా చేసి అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. ఒకరోజు భోజనం తినడం ద్వారా శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చని వాదన ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఇది శరీరంలోని కొవ్వును కాల్చడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుందని కూడా ఎంతోమంది నమ్ముతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
పోషకాహార నిపుణులు అప్పుడప్పుడు ఉపవాసం చేయమని చెబుతారు. ఉపవాసం వల్ల శరీరం తనను తాను క్లీన్ చేసుకుంటుంది. కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. మితంగా ఆహారం తింటే మీరు తినే ఆహారం మీకు ఎంతో శక్తినిస్తుంది. కార్బోహైడ్రేట్లను అధికంగా తీసుకున్నప్పుడు శరీరం వాటిని చక్కెరలుగా విచ్చిన్నం చేస్తుంది. రక్తంలో మీకు అవసరమైన దానికంటే ఎక్కువ చక్కెర చేరితే ఇన్సులిన్ అనే రసాయనం అదనపు చక్కెరను కొవ్వుగా మార్చేస్తుంది. ఆ కొవ్వును కణాలలో పేరుకుపోయేలా చేస్తుంది. కాబట్టి అధికంగా తినడం అనేది కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. కాబట్టి కార్బోహైడ్రేట్లను తక్కువగానే తినాలి.
ఉపవాసం ఆరోగ్యానికి ఎంత మంచిది?
అడపాదడపా ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిదని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. అలాగే ఒకపూట భోజనం తినడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే ఒక పూట తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. లేకపోతే శరీరం పోషకాహార లోపం బారిన పడుతుంది. ఒకపూట భోజనం అనగానే రోజు మొత్తంలో కేవలం ఒకసారి ఆహారాన్ని తినడం కాదు, ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్‌ను తిని, మధ్యాహ్నం భోజనాన్ని కూడా తినాలి. రాత్రిపూట భోజనం మానేయాలి. ఒకపూట భోజనం తినడం అంటే చాలామంది రాత్రిపూట తిని మధ్యాహ్నం మానేస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రిపూట మానేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు రావు.
అధ్యయనంలో చెబుతున్న ప్రకారం ఒక పూట భోజనం తినేవారికి శరీరంలోని కొవ్వు చాలా వరకు తగ్గుతుంది. 10 వారాలలో వీరు మూడు కిలోల వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
ఒక అధ్యయనం ప్రకారం ప్రీ డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు, ఊబకాయంతో ఉన్నవారు భోజనం చేశాక 18 గంటల పాటు ఉపవాసం ఉండడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నట్టు బయటపడింది. ఒకపూట భోజనం తినడం వల్ల శరీరంపై ఇంకా ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవడానికి లోతైన పరిశోధనలు అవసరం.
రాత్రిపూట ఉపవాసమే మంచిది
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం పగటిపూట ఉపవాసం ఉండడం కన్నా రాత్రిపూట ఉపవాసం ఉండడమే ఎక్కువ ప్రయోజనం. ఉదయం తిని, రాత్రి ఉపవాసం ఉండడం వల్ల బరువు చాలా సులువుగా తగ్గవచ్చు. రాత్రిపూట ఉపవాసం ఉండి, ఉదయం పుష్టిగా భోజనం చేసే వ్యక్తులు ఎక్కువగా బరువు తగ్గే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్‌తో నిండిన ఆహారాన్ని తింటే ఆ రోజంతా మీకు తక్కువగా ఆకలి వేస్తుంది. అలాగే మధ్యాహ్న భోజనంలో కూడా అన్ని రకాల పోషకాలు కలిసేలా పదార్థాలను తయారు చేసుకోవాలి. లేకుంటే పోషకాహార లోపం వచ్చేస్తుంది. రాత్రిపూట ఆహారం తీసుకోకపోయినా ఎలాంటి ప్రమాదం లేదు. అయితే ఒకపూట భోజనం చేయడం వల్ల మీకు ఎక్కువగా ఆకలిగా అనిపిస్తుంది. మీ శరీరం గ్రెలిన్ అనే హార్మోన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఆకలి పెరిగినట్టు అనిపిస్తుంది. ఆకలి అనిపించినప్పుడల్లా ఆహారాన్ని తింటే బరువు పెరిగిపోతారు.
వీరికి మంచిది కాదు
గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్‌తో ఉన్నవారు మాత్రం ఒకపూట భోజనం చేయడం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రోజుకు ఒక పూట భోజనం చేయడం వల్ల మీ రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి. కాబట్టి వీరు ఒక పూటే భోజనం చేయడం సురక్షితం కాకపోవచ్చు. చిన్న చిన్న భోజనాలుగా విభజించుకొని ప్రతి మూడు నాలుగు గంటలకు ఒకసారి కొంచెం కొంచెంగా తింటే మంచిది.
Also Read: తులసి ఆకులు తింటే.. బోలెడు ప్రయోజనాలు !
టైప్2 డయాబెటిస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉపవాసం తరచూ ఉండడం వల్ల వారిలో రక్తంలోని చక్కెర ప్రమాదకర స్థాయికి పడిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని హైపో గ్లైసిమియా అని పిలుస్తారు. కాబట్టి వీరు వైద్యుడితో సలహా తీసుకున్నాకే ఒకపూట భోజనానికి మారడం ఉత్తమం. పూర్తిగా రాత్రిపూట భోజనం మానేస్తే డయాబెటిస్ పేషెంట్లు ఇబ్బంది పడతారు. కాబట్టి తేలికపాటి ఆహారాన్ని తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.