Visakhapatnam: విశాఖపట్నం జిల్లా దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్లపూడిలో శుక్రవారం ఒక్కసారిగా కలకలం రేగింది. జనసంచారం ఉన్న ప్రాంతంలో ఓ ఇల్లు మంటల్లో చిక్కుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక మహిళ నివసిస్తున్న ఇంటికి, తన ప్రియుడే నిప్పు పెట్టాడని ఆరోపణలు.. అయితే అగ్నిప్రమాద తీవ్రతకు ఇంట్లోని సామాగ్రి మొత్తం కాలి బూడిదవ్వగా, బాధితురాలు కట్టుబట్టలతో మిగిలిపోయింది.
విభేదాలే మంటలకు కారణమా?
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఆ మహిళ గత కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామంలో ఒక వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసిందని తెలుస్తోంది. అయితే, గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య తీవ్రమైన మనస్పర్థలు తలెత్తాయి. ఈ విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారి, ఒకరిపై ఒకరు కోపంతో ఊగిపోయారు. ఈ క్రమంలోనే ఆ మహిళపై పగ పెంచుకున్న వ్యక్తి, ఆమెను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీయాలని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.
పెట్రోల్ పోసి ఘాతుకం.. క్షణాల్లో బూడిదైన ఇల్లు
గొడవ ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రియుడు, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పుష్ప ఇంటిపై పోసి నిప్పు అంటించాడు. ఎండ తీవ్రతకు తోడు పెట్రోల్ కావడంతో మంటలు క్షణాల్లో ఇల్లంతా వ్యాపించాయి. ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, బీరువాలోని బట్టలు, ఇతర విలువైన వస్తువులు మంటలకు ఆహుతయ్యాయి. ఆ సమయంలో బాధితురాలు అప్రమత్తమై బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఆకాశానికి ఎగసిపడుతున్న మంటలను చూసి స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది
సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంటి పైకప్పు సైతం మంటల వేడికి బీటలు వారింది. మంటలు పక్క ఇళ్లకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో వడ్లపూడి పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read: ఫ్రెండ్ అని నమ్మితే.. రూ.2.36 కోట్లు హాంఫట్.. కొండాపూర్ టెక్కీకి భారీ టోకరా!
కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. నిందితుడు పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వ్యక్తిగత కక్షల కారణంగా సామాన్య ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
బ్రేకింగ్ న్యూస్
విశాఖజిల్లా దువ్వాడ పిఎస్ పరిధి వడ్లపూడిలో దారుణం
పుష్ప అనే మహిళ ఇంటికి నిప్పుపెట్టిన సాయికృష్ణ అనే వ్యక్తి
భారీగా ఎగసిపడిన మంటలు.. కాలి బూడిదైన వస్తువులు..
ఒంటరిగా ఉన్న మహిళతో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న సాయికృష్ణ
ఇద్దరి మధ్య విభేదాల కారణంగా ఇంటికి… pic.twitter.com/sB1mepYyy2
— Telugu Feed (@Telugufeedsite) April 5, 2026