Kurnool Bus Accident: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డుపై పడి ఉన్న బైక్ ను ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు చెబుతున్నారు. బస్సు ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకులోకి బైకర్ శివశంకర్ వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ సమయంలో శివశంకర్ పాటు బైక్‌పై మరో యువకుడు ఉన్నాడు. శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు సీసీ కెమెరాల్లో తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందిన విషయం తెలిసిందే.
కర్నూలు ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సును నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. 5వ తరగతి వరకే చదువుకున్న లక్ష్యయ్య నకిలీ 10వ తరగతి సర్టిఫికెట్ తో హెవీ లైసెన్స్ పొందారు. లక్ష్యయ్య స్వస్థలం పల్నాడు జిల్లా ఒప్పిచర్ల అని సమాచారం.
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
కర్నూలు బస్సు ప్రమాదంతో తెలంగాణ రవాణా శాఖ అలర్ట్ అయింది. ప్రైవేటు బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజయవాడ హైవే, బెంగళూరు హైవేపై ఆర్టీఏ బృందాలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. రాజేంద్రనగర్ పరిధిలోని గగన్ పహాడ్ వద్ద అధికారులు పలు బస్సుల్లో సోదాలు చేశారు. ఏపీ నుంచి వస్తున్న పలు ట్రావెల్స్ బస్సులను చెక్ చేశారు.
Also Read : Kurnool Bus Accident: కర్నూలు బస్సు దగ్ధం ఘటన.. 16 బృందాలతో దర్యాప్తు.. రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటన
బస్సుల్లో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన 5 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సు అద్దం పగిలినా నిర్లక్ష్యంగా నడుపుతున్న ఓ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. జడ్చర్ల వద్ద బస్సు రోడ్డు ప్రమాదానికి గురైందని ప్రయాణికులు తెలిపారు. ఎల్బీనగర్ చింతలకుంట వద్ద ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఓ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. అలాగే నిబంధనలను ఉల్లంఘించిన మరో 4 బస్సులపై కేసులు నమోదు చేశారు.