Kamareddy Crime: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను భర్త అత్యంత క్రూరంగా హత్య చేశాడు. నాలుక కోసి రోకలి బండతో తలపై బాది భార్యను హతమార్చాడు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ మండలం విఠల్‌వాడీతండాలో గురువారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది.
తండాకు చెందిన పవార్ కిషన్, పవార్ సవిత(42) ఉపాధి కోసం పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ కు వలస వచ్చారు. లింగంపల్లిలో టీకొట్టు పెట్టుకొని దంపతులు జీవనం సాగిస్తున్నారు. తండాలో గుడి పండగ ఉండటంతో 5 రోజుల క్రితం కిషన్, సవిత ఊరుకు వెళ్లారు. అయితే గత కొద్దిరోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కిషన్ గురువారం రాత్రి ఆమెతో గొడవకు దిగాడు.
మద్యం మత్తులో భార్యతో ఘర్షణపడి కత్తెరతో ఆమె నాలుక కత్తిరించాడు. అనంతరం రోకలి బండతో భార్య తలపై బలంగా కొట్టాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఆమెను రక్షించేందుకు రాగా.. వారిపైనా కిషన్ దాడికి దిగాడు. అతడిని బంధించి సవితను ఆసుపత్రికి తరలిస్తుండంగా, మార్గం మధ్యలో ఆమె మృతి చెందింది. సవిత అన్న జాదవ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కిషన్ ను అదుపులోకి తీసుకున్నారు.