Mother kills Daughter: ప్రపంచంలో తల్లి ప్రేమను మించినది మరొకటి ఉండదు అంటారు. కన్న బిడ్డల కోసం తల్లి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. పిల్లల ప్రాణం ప్రమాదంలో ఉందంటే.. తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. తన ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా.. బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తుంటుంది. పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకుంటుంది. కానీ ప్రస్తుత కాలంలో తల్లి ప్రేమకు నిర్వచనమే మారిపోతుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు.. కన్న బిడ్డల పాలిట యమపాశాలుగా మారుతున్నారు.
ఇటీవల అమీన్‌పూర్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపేసింది. నిన్నటి నిన్న గాజులరామారంలో కన్న తల్లే కసాయిలా మారింది. ఇద్దరు బిడ్డలను పొట్టనపెట్టుకుంది. వేటకొడవలితో నిర్ధాక్షణ్యంగా నరికి చంపింది. ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోతున్న పిల్లలను వెంటాడి మరీ గొంతుకోసింది. ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై తాను ఆత్మ హత్య చేసుకుంది.
తాజాగా ఇలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. కుత్బుల్లాపూర్ బాచుపల్లి పీఎస్ పరిధి ప్రగతినగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురు జశ్వికకు ఎలుకల మందు కూల్‌డ్రింక్‌లో కలిపి చంపేసింది. అయితే తర్వాత తల్లి క్రిష్ణపావని కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 18న సాయంత్రం ఈ ఘటన జరిగితే.. 19 ఉదయం తెల్లవారుజామున ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఇవాళ తెల్లవారుజామున చిన్నారి జశ్విక చికిత్స పొందుతూ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు తల్లికి కూకట్‌పల్లిలోని ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే కృష్ణపావనికి ఆరోగ్య సమస్యల వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో వైపు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎల్ కొట్టాలలో విషాదం చోటుచేసుకుంది. రసాయన ద్రావణం తాగి.. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ ఘటనలో తల్లి సుభాషిణి చనిపోగా.. ఇద్దరు పిల్లల పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఎల్ కొట్టాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, సుభాషిణి దంపతులకు మాన్యశ్రీ, విలక్షన్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుభాషిణి తనతో పాటు తన ఇద్దరు పిల్లలను రసాయన ద్రావణం తాగించింది.
Also Read: అంతా మిడ్ నైట్ మసాలా.. కూతురి మామతో జెండా ఎత్తేసిన తల్లి
గమనించిన స్థానికులు వారిని వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తల్లి చనిపోగా.. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఇద్దరు చిన్నారులను కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తమ బంధువుల పెళ్లికి వెళ్లాలని భర్తతో సుభాషిని చెప్పారని…వెంకటేశ్వర్లు నో చెప్పడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. గతంలో తరుచూ ఆర్థిక సమస్యలతో గొడవలు అయ్యేవని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.