Asaduddin Owaisi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ చేస్తున్న పనులను ఆయన తప్పుబట్టారు. ప్రస్తుతం మోదీ సర్కార్ చేస్తున్న వైఖరిని దుయ్యబట్టారు. ఇంతకీ అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే..
ప్రధాని నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. దశాబ్దంపైగా మసీదులు ధ్వంసం చేయాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. ముస్లింల ఇళ్లను కూల్చుతున్నారని వ్యాఖ్యానించారు. వక్ఫ్ బిల్లు వల్ల ముస్లింలకు మేలు జరుగుతుందని ప్రధాని చెబుతున్నా, ఇది ముమ్మాటికీ అది నిజం కాదన్నారు.
బట్ట తలకు జుట్టు వచ్చే మందు అని చెప్పినట్టేనంటూ సెటైర్లు వేశారు. ఓల్డ్ సిటీలో ఓ వ్యక్తి బట్టతలకు మందు పెట్టిస్తే జుట్టు వస్తుందని చెప్పడంతో జనాలు నమ్మి క్యూ కట్టారంటూ ఇటీవల జరిగిన ఓ సన్నివేశాన్ని ఉదాహరణగా చెప్పారు. ప్రధాని మాటలు అలాంటివేనని వ్యాఖ్యానించారు. వక్ఫ్ బిల్లు వల్ల ముస్లింలకు మేలు జరుగుతుందని ప్రధాని పైకి మాటలు చెబుతున్నారని, అది ముమ్మాటికీ నిజం కాదన్నారు.
హైదరాబాద్‌లో ఏఐఎంపీఎల్‌బీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారీ సమావేశం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, బీజేపీ న్యాయవ్యవస్థ ను బెదిరిస్తోందన్నారు. బీజేపీకి చెందిన కొందరు ఎంపీలు సుప్రీంకోర్టు గురించి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
ALSO READ: జపాన్ మోడల్, సీఎం రేవంత్ సరికొత్త ప్లాన్
నేతల వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్య నిర్మాణానికే ప్రమాదం కలిగిస్తాయన్నారు. ఇదే సమయంలో ప్రధానికి కఠినమైన సందేశం ఇచ్చారు ఓవైసీ. సహచరులు కోర్టులను బెదిరిస్తున్నారని, వ్యక్తులను అదుపులో పెట్టకపోతే దేశం బలహీనపడుతుందన్నారు.
మత యుద్ధ భయాలు కలిగిస్తోందని ఆరోపించారు ఓవైసీ. ముస్లింల ఆస్తులను రక్షించుకోవడమే తమ లక్ష్యమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న కుట్ర మాత్రమేనని, దేశ ప్రజలంతా ఐక్యంగా రాజ్యాంగాన్ని కాపాడాలన్నారు. న్యాయ పరంగా మా పోరాటం కొనసాగుతుందన్నారు. అందరూ మీ ఫోన్‌లలో లైట్లు ఆన్ చేయండి.. మీరు వెలిగించినది ఫోన్ లైట్ కాదన్నారు.
బీజేపీ నాయకుల మెదళ్లలో వెలిగించిన తెలివని చెప్పుకొచ్చారు. వక్ఫ్ బిల్లును తిప్పి పంపే వరకు మా పోరాటం దేశవ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. పార్లమెంట్ సెషన్‌లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతానన్నారు ఓవైసీ. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు నేపథ్యంలో దేశవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. దేశంలో ముస్లింల హక్కుల కోసం, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామన్నారు అసదుద్దీన్ ఒవైసీ.