Husband Kills Wife: హైదరాబాద్ లోని నల్లకుంట ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఇంట్లోనే పిల్లల కళ్లముందు భార్యను అమానుషంగా హత్య చేయడం సంచలనం రేపింది. పెట్రోల్ పోసి నిప్పంటించడమే కాకుండా అడ్డుకునేందుకు వచ్చిన కూతురిని కూడా మంటల్లోకి తోసేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా హుజురాబాద్‌కు చెందిన వెంకటేష్, త్రివేణి కొన్నేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.. ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. మొదట కుటుంబ జీవితం ప్రశాంతంగానే సాగినప్పటికీ, కాలక్రమేణా వెంకటేష్‌కు భార్యపై అనుమానం పెరిగినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు, వేధింపులు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు.
భర్త వేధింపులు తాళలేక ఇటీవల త్రివేణి తన పిల్లలతో కలిసి.. తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కొంతకాలం విడిగా ఉన్న అనంతరం ఇప్పటినుంచి మారిపోతాను అంటూ వెంకటేష్ ఆమెను నమ్మబలికి.. మళ్లీ హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం.
హైదరాబాద్ వచ్చిన కొద్ది రోజులకే.. కుటుంబ కలహం మళ్లీ చెలరేగడంతో వెంకటేష్ తీవ్ర కోపానికి లోనయ్యాడు. ఇంట్లో ఉన్న సమయంలో భార్య త్రివేణిపై అకస్మాత్తుగా దాడి చేసిన అతడు, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న పిల్లలు భయంతో కేకలు వేయగా, తల్లి ప్రాణాలు కాపాడేందుకు కూతురు ముందుకు వచ్చింది.
అడ్డుకునేందుకు ప్రయత్నించిన కూతురిని కూడా వెంకటేష్ మంటల్లోకి తోసేశాడు. ఈ ఘటనలో త్రివేణి తీవ్రంగా కాలిపోగా, కూతురు స్వల్ప గాయాలతో బయటపడింది.
ఇంట్లో నుంచి వస్తున్న అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు. తక్షణమే త్రివేణి, ఆమె కూతురిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే త్రివేణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కూతురికి స్వల్ప గాయాలే కావడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమాచారం.
సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. హత్య అనంతరం పరారైన వెంకటేష్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడి కదలికలను ట్రాక్ చేసిన పోలీసులు 12 గంటల్లోనే వెంకటేష్‌ను అరెస్ట్ చేశారు.
Also Read: అన్నమయ్య జిల్లాలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
వెంకటేష్‌పై హత్యాయత్నం, హత్య, బాలికపై దాడి వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.