Newlywed Couple Dies: యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి–ఆలేరు రైల్వే మార్గంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి చెందడం అందరినీ కలచివేసింది. పెళ్లై ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాకముందే ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను, బంధువులను తీరని దుఃఖంలో ముంచింది.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన కోరాడ సింహాచలం (25)కు అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవానీ (19)తో రెండు నెలల క్రితం వివాహమైంది.
సింహాచలం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ రసాయన పరిశ్రమలో ఉద్యోగం చేస్తుండగా, దంపతులు నగరంలోని జగద్గిరిగుట్ట గాంధీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. విజయవాడలో బంధువుల ఇంటికి వెళ్లేందుకు దంపతులు మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ రైలులో సికింద్రాబాద్ నుంచి గురువారం రాత్రి బయలు దేరారు.
రైలు వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన అనంతరం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు డోర్ వద్ద నిలబడి ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఇద్దరూ రైలు నుంచి జారిపడి ట్రాక్ పక్కన పడిపోయారు. రైలు వేగంగా ప్రయాణిస్తుండటంతో తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరగడంతో ఎవరికీ వెంటనే విషయం తెలియలేదు. శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ట్రాక్ మెన్ రైల్వే పట్టాల పక్కన రెండు మృతదేహాలను గమనించారు. వెంటనే వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, గుర్తింపు వివరాలు సేకరించిన అనంతరం పోస్టుమార్టం కోసం తరలించారు.
Also Read: క్షుద్రపూజలు.. మహిళ కేసు పెట్టిందని గుండెపోటుతో వ్యక్తి మృతి, అసలు ఏం జరిగిందంటే..?
ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైలు డోర్ వద్ద నిలబడటమే ప్రమాదానికి కారణమా? రద్దీ కారణంగా అక్కడ నిలబడాల్సి వచ్చిందా? లేదా ఇతర సాంకేతిక కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. రైలులో భద్రతా నిబంధనలు పాటించకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.