Pregnant Stabbed over Pizza Tip| రాను రాను మనుషుల్లో సహనం నశిస్తోంది. చిన్న చిన్న విషయాలకే హింసాత్మకంగా మారుతున్నారు. పురుషులే కాదు మహిళలు కూడా వయెలెంట్ గా తయారవుతున్నారు. కేవలం చిల్లర విషయంలో ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. గర్భవతి అని కూడా చూడకుండా ఒక యువతి ఆ గర్భవతి మహిళను పగబట్టి మరీ కత్తితో 14 సార్లు పొడిచేసింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓసియోలా కౌంటీలో ఒక బ్రియాన్నా అల్వేలో అనే 22 ఏళ్ల యువతి మార్కోస్ పిజ్జా రెస్టారెంట్ లో పిజ్జా డెలివరీ వర్కర్ గా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంల ఓసియోలా కౌంటీలోని ఓ మొటేల్ (లాడ్జింగ్) లో ఒక మహిళ పిజ్జా ఆర్డర్ చేసింది. దీంతో బ్రియాన్నా పిజ్జా డెలివరీ కోసం వెళ్లింది. మొటేల్ వెళ్లాక చూస్తే.. పిజ్జా ఆర్డర్ చేసిన మహిళ ఓ గర్భవతి. అందుకే మొటేల్ పై ఫోర్ వరకు డెలివరీ కోసం వెళ్లాల్సి వచ్చింది.
పిజ్జా బిల్ మొత్తం 33 డాలర్లు (రూ.2800) అయింది. దీంతో ఆ గర్భవతి కస్టమర్ బ్రియాన్నాకు 50 డాలర్లు ఇచ్చింది. దీంతో బ్రియాన్నా తనకు ఆమె 17 డాలర్లు టిప్ ఇచ్చిందని సంతోషపడి థ్యాంక్స్ అని చెబుతూ వెనుదిరిగి వెళ్లిపోవడం మొదలు పెట్టింది. కానీ అంతలోన ఆ గర్భవతి కస్టమర్ తనకు బ్యాలెన్స్ ఇచ్చి వెళ్లాలని అడిగింది. ఆమె మాటలకు బ్రియాన్నా ఖంగు తింది. అయినా తెలివిగా తన వద్ద 50 డాలర్లకు చిల్లర లేదని సమాధానం చెప్పింది. దీంతో ఆ గర్భవతి.. “అయినంత మాత్రాన.. నువ్వు మొత్తం 50 డాలర్లు ఎలా తీసేసుకుంటావ్?” అని బ్రియన్నాని ప్రశ్నించింది. అందుకే 50 డాలర్లు వెనక్కు తీసుకొని లోపలికి వెళ్లి 33 డాలర్లు సరిపడ నోట్లు తీసుకువచ్చి బ్రియాన్నా చేతిలో పెట్టింది.
Also Read: 40 ఏళ్లుగా ఒకే భర్త నుంచి 12 సార్లు విడాకులు తీసుకున్న మహిళ.. తలలు పట్టుకున్న అధికారులు!
కానీ బ్రియాన్నా సంతృప్తి చెందలేదు. తాను ఎంతో కష్టపడి పిజ్జా తీసుకువచ్చానని పై ఫ్లోర్ వరకు పిజ్జా తెచ్చినందుకు టిప్ ఇవ్వాలని మరీ అడిగింది. బ్రియాన్నా ప్రవర్తన నచ్చకపోయినా ఆ గర్భవతి కస్టమర్ 2 డాలర్లు టిప్ గా ఇచ్చింది. అది చూసి బ్రియాన్నాకు పట్టరాని కోపం వచ్చింది. కేవలం 2 డాలర్లు (రూ.170) టిప్ ఏంటి? అని ప్రశ్నించింది. దీంతో ఆ కస్టమర్.. బ్రియాన్నాను తిట్టిపోసింది. టిప్ అడిగి మరీ తీసుకుంటునావు. ఇచ్చాక ఇంతేనా అని అడుగుతున్నావు. నీ వ్యవహారం బాగోలేదు. నీ పనితనం సరిగా లేదని ఫిర్యాదు చేస్తానని చెప్పింది.
గర్భవతి కస్టమర్ అంత మాట అనే సరికి. బ్రియాన్నా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాసేపు తరువాత మళ్లీ తన బాయ్ ఫ్రెండ్ తో ఒక కారులో వచ్చింది. ఆ బాయ్ ఫ్రెండ్ ముఖానికి ముసుగు వేసుకొని చేతిలో తుపాకీ (రివాల్వర్) పట్టుకొని వచ్చాడు. బ్రియాన్నా కూడా తన చేతిలో ఒక కత్తి పట్టుకొని వచ్చింది. ఇద్దరూ కలిసి ఆ గర్భవతి కస్టమర్ రూమ్ కు వెళ్లి తలుపులు బాదారు. ఆ సమయంలో రూమ్ లో ఆ గర్భవతి కస్టమర్ తో పాటు మరో యువకుడు, ఒక నాలుగేళ్ల పాప ఉన్నారు.
వారందరినీ బ్రియాన్నా బాయ్ ఫ్రెండ్ తుపాకీతో బెదిరించాడు. మరోవైపు బ్రియాన్నా మాత్రం తనపై ఫిర్యాదు చేస్తానని బెదిరించినందుకు కత్తితో ఆ గర్భవతి మహిళను 14 సార్లు పొడిచేసింది. రూంలో ఉన్న మరో యువకుడు పోలీసులకు ఫోన్ చేయబోతే అతడిని కూడా చితకబాదారు. అతని వద్ద నుంచి ఫోన్ లాగేసుకొని దాన్ని తొక్కి పగలకొట్టారు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయారు. మొటేల్ యజమాన్యం ఈ ఘటన గురించి తెలుసుకొని పోలీసులకు ఫోన్ చేశాడు.
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ గర్భవతి కస్టమర్ ని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. మార్కోస్ పిజ్జాలో పనిచేసే బ్రియాన్నా, ఆమె బాయ్ ఫ్రెండ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.