Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్‌లో రెండో అంకం ముగిసిందా? పార్టీలు పంపకాల్లో నిమగ్నమయ్యాయా? 2 లక్షల ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయా? నేరుగా మహిళల చేతికి డబ్బులు ముట్టజెప్పుతున్నారా? డబ్బులు అందలేదని కొందరు ఓటర్లు వివిధ ప్రాంతాల్లో గగ్గోలు పెడుతున్నారా? ఓటుకు రెండు వేల చొప్పున పంపిణీ చేస్తున్నారా? ఒక్కో దగ్గర చీరలు, వెండి ఆభరణాలు కూడానా? అవుననే సమాధానం వస్తోంది.
ప్రచారంలో పంపిణీ చేశారా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రెండో అంకం ముగిసింది. ఈ ఎన్నికను అధికార కాంగ్రెస్-బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చివర రోజు సైతం పార్టీలు వదల్లేదు. ప్రచారం చేయకపోయినా మీడియా సమావేశాలతో ప్రజలకు స్పష్టమైన మెసేజ్‌ను ఇచ్చాయి.
నార్మల్‌గా ప్రచారం ముగిసిన తర్వాత ప్రలోభాల పర్వం మొదలు అవుతుంది. ఈసీ నిఘా కఠినతరం చేయడంతో ప్రచారం సమయంలో దాదాపు 50 శాతం ఓటర్లకు పార్టీలు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. ఓటర్లకు ఫోన్ పే, గూగుల్ పే, ఇతర యాప్స్ ద్వారా డబ్బులు పంపిణీ చేస్తారని భావించిన ఎన్నికల అధికారులు ముందుగానే వాటిపై నిఘా పెట్టాయి.
కొన్నిచోట్ల డబ్బుల కోసం ఓటర్లు పడిగాపులు
ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు ముందు చాలా పార్టీలు నిధులు రెడీ చేసినట్టు తెలుస్తోంది. ప్రచారం సమయంలో సగానికి పైగానే పంపిణీ చేసినట్టు సమాచారం. మిగతాది పోలింగ్ కు ముందు పంపిణీ చేయాలని లెక్కలు వేసుకున్నట్లు సమాచారం. ఏరియాల స్థానిక నేతల ఆధ్వర్యంలో ఓటర్లకు డబ్బులను అందజేస్తున్నారు.
ముఖ్యంగా బూత్‌ల వారీగా ఓట్ల లెక్క చూసుకుని పంపిణీ మొదలుపెట్టినట్టు సమాచారం. మొదట్లో ఓటు రూ. 1000 చొప్పున ఇచ్చినట్టు వార్తలు వచ్చినా, ప్రస్తుతం ఓటుకు రూ.2500 చొప్పున ఇచ్చినట్టు గుసగుసలు లేకపోలేదు. కొన్ని ప్రాంతాల్లో మరింత ఎక్కుగా చెల్లిస్తున్నట్లు సమాచారం.
ALSO READ: సామాజిక సమస్య మారిన సైబర్ నేరాలు, ఉద్యమంగా మారాలన్న డీజీపీ
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 4 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నాయి. వాటిలో సగానికి పైగా ఆయా పార్టీలు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఓటర్లకు పంపిణీ విషయంలో ప్రధాన పార్టీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. స్థానిక నేతలతో ఇతర ప్రాంతాలకు చెందిన వారిని జతచేసి డబ్బు పంపిణీ జరిగేలా చూసుకుంటున్నారు.
మహిళల చేతికే ఆ నగదును అందజేస్తున్నాయి పార్టీలు. ఇంట్లో ఉన్న ఓటర్ల సంఖ్య అడిగి మరీ చేతిలో డబ్బులు పెడుతున్నారట. ఆడబిడ్డలకు కానుకగా కొన్ని బహుమతులు అందజేస్తున్నారట. పట్టు చీరలు, వెండి ఆభరణాలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలు పంచుతున్న డబ్బులు తమకు అందలేదని కొందరు ఓటర్లు అంటున్నారు.
డబ్బులిచ్చే వారి కోసం ఇళ్ల ముందు పడిగాపులు కాశారు. నాయకులు వచ్చి డబ్బులు ఇస్తారని ఆదివారం మధ్యాహ్నం నుంచి గంటల తరబడి నిరీక్షించారు. ఓటరు జాబితా పట్టుకుని నలుగైదుగురు కలిపిస్తే వారి వద్దకు వెళ్లి డబ్బులు అడగడం ఆదివారం కనిపించింది. బోరబండ ప్రాంతంలో ఓ కుటుంబానికి అన్ని పార్టీలు కలిసి ఏకంగా 25 నుంచి 30 వేలు వరకు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ లెక్కన పోలింగ్ పూర్తయ్యే నాటికి పార్టీ అభ్యర్థుల అంతర్గత ఖర్చు వంద కోట్లకు పైగానే చేరుకోవచ్చని భావిస్తున్నారు. గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 47 నుంచి 52 శాతం నమోదైంది. తాజా బైపోల్‌లో పోలింగ్ 50 శాతం పైనే ఉంటుందని అంచనా వేస్తున్నాయి రాజకీయ పార్టీలు.