యమలోకంలో రింగ్ కొట్టేసిన ఆరు వెంటనే తనను భూలోకం తీసుకెళ్లమని కోరుకుంటుంది. వెంటనే ఆరు అక్కడి నుంచి మాయమై మేఘాల మీద భూలోకం వెళ్తుంది. మేఘాలలో వెళ్తూ.. ఆహా గాలిలో తేలిపోవడం ఇంత హాయిగా ఉంటుందా..? చిత్రగుప్తుల కళ్లు గప్పి వెంటనే భూలోకం వెళ్లి రావాలి. ఎంతయినా సొంత ఇంటిని మించిన స్వర్గం లేదు. కాసేపట్లో మా ఆయన్ని , పిల్లలని అందరినీ చూడబోతున్నాను.. ఎంత హాయిగా ఉందో.. అని సంబరపడుతుంటే.. ఇంతలో గుప్త, యముడు వస్తారు. వాళ్లను చూసిన ఆరు భయంతో గుప్త గారు.. అయ్యయ్యో రాజు గారు అంటుంది. యముడు మంత్రం చదవగానే.. ముగ్గురు మళ్లీ యమలోకం వెళ్లిపోతారు.
యముడు కోపంగా విచిత్రగుప్త తనని జాగ్రత్తగా చూసుకోమని చెబితే నీవు ఏమి చేయుచున్నావు అని కోపంగా అడగ్గానే.. గుప్త భయంతో క్షమించండి ప్రభు ఈ బాలిక మా కళ్లుగప్పి పారిపోయినది అని చెప్తాడు. దీంతో యముడు ఏమిటి బాలిక నువ్వు ఏమైనా చిన్న పిల్లవి అనుకుంటివా..? నలుగురు పిల్లల తల్లివి యమలోకం విడిచి ఎచ్చటకు వెళ్లొద్దని చెప్పినా నీకు అర్థం కాదా..? ఎందులకు మాకు పదే పదే ఆగ్రహం తెప్పించుచుంటివి ఇచ్చట నీకే ఏమి తక్కువ అయినది బాలిక. ధరించుటకు దేవతా వస్త్రాలు, భుజించుటకు పంచభక్ష్య పరమాణాలు.. నిద్రించుటకు హంసతూలికా పాన్పులు విహరించుటకు మా ఉద్యాన వనములు.. ఇలా అన్ని వసతులు సమకూర్చితిమి కదా..? ఈ నరకమునే మేము నీకు స్వర్గము చేసితిమి కదా..? మమ్మల్ని ఎందుకు ప్రయాసపెడుతున్నావు అని యముడు అడగ్గానే..
ఇవన్నీ నేను మిమ్మల్ని అడిగానా..? ఈ ఫైవ్ స్టార్ ఫెసిలిటీలు కావాలని నేను మిమ్మల్ని అడిగానా..? నన్ను స్పెషల్ గా ట్రీట్ చేయండని మిమ్మల్ని అడిగానా..? నలుగురు పిల్లల తల్లిని అండి నేను నా పిల్లలకు దూరం అయి నేను ఎంత యాతన అనుభవిస్తున్నానో మీకు తెలియదా..? అంటూ ఎమోషనల్ అవుతుంటే.. గుప్త బాలిక అంటాడు.. దీంతో మీరు ఉండండి గుప్త గారు.. ప్రాణంగా చూసుకునే భర్త, ప్రేమగా పెంచుకున్న పిల్లలు, ఇష్టంగా కట్టుకున్న ఇల్లు, నీడగా మెలిగిన నా చెల్లి ఇది కదా నాకు కావాలి. వీటన్నింటి నుంచి నన్ను దూరం చేసి ఇక్కడ ఇన్ని భోగాలు ఇచ్చారు అంటున్నారే ఆ స్వర్గానికి మించిందా..? ఇంద్రజ స్వర్గం.. మా ప్రాణాలు తీసి మేము చేసిన పాపాలకు శిక్ష వేసి అదే మీ ధర్మంగా ఆనందించే మీకు మా బంధాలు, ప్రేమానురాగాలు తెలియవు రాజు గారు తెలియవు.. విధి ఆడే చదరంగంలో మేము పావులం.. మీ దృష్టిలో పాపులం.. అంతకు మించి మాకే విలువ లేదు. మా ఇష్టాలకు బంధాలకు ప్రేమలకు ఏ అర్తము లేదు.. నా వాళ్లకు దూరంగా నేను ఉండలేకపోతున్నాను.. నేను తప్పులు చేసి ఉంటే మీ నరకంలోని శిక్షలన్నీ నాకు వేయండి.. అంతే కానీ నన్ను శిక్షించకుండా..? మా ఇంటికి పంపించకుండా నన్ను ఈ నకరంలో ఉంచకండి అంటూ ఏడుస్తూంది ఆరు..
యముడు కోపంగా విచిత్రగుప్త ఆ బాలికను ఓదార్చుము.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెనకే వెళ్లిన గుప్త ప్రభు ఆ బాలికను ఎటుల ఓదార్చేదను ప్రభు ఎటుల సముదాయించమందురు ప్రభు ఆ బాలిక అడుగు ఏ ప్రశ్నకు మా దగ్గర సమాధానము లేదు.. అంటూ గుప్త ఎమోషనల్ అవుతాడు. యముడు కూడా నా సమస్య కూడా అదే గుప్త మేము చేసిన అపరాధము ఎటుల సరిదిద్దుకోవలెనో తెలియుట లేదు.. అనాలోచితంగా తన ప్రాణము తీసితిని.. పునర్జన్మ ఉందని నమ్మించి పైకి రప్పించాను.. దేవకన్య అని అసత్యం ఆడి ఈ నరకంలో ఉంచితిమి.. అందరి పాపులకు శిక్ష వేసే మాకు ఈ తప్పులకు ప్రాయశ్చితం ఏమిటో బోధ పడటం లేదు అంటూ యముడు వెళ్లిపోతాడు.
కింద రామ్మూర్తిని పిలిచిన మిస్సమ్మ.. లాన్‌లో నిలబడి ఉండగా రామ్మూర్తి వస్తాడు. మిస్సమ్మను చూసి అమ్మా భాగీ ఏమైంది తల్లి ఎందుకలా డల్లుగా ఉన్నావు.. అని అడుగుతాడు. దీంతో వెంటనే మిస్సమ్మ మొన్న మనోహరిని షూట్ చేసింది మీరే కదా నాన్న అని అడగ్గానే.. రామ్మూర్తి షాక్ అవుతాడు. అలాగే చూస్తుండిపోతాడు. మరోవైపు అమర్ రామ్మూర్తి వేలి ముద్రలు లాబ్‌లో టెస్ట్ చేయిస్తుంటాడు. ఇక మనోహరిని కాల్చడానికి వచ్చి గోడ దూకి పారిపోయింది కూడా మీరే అంటూ రామ్మూర్తి పర్స్ తీసి చూపిస్తుంది మిస్సమ్మ దీంతో రామ్మూర్తి షాక్ అవుతాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.