క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కొన్నిసార్లు చిన్న క్లూ కూడా పెద్ద కేసుని ఛేదించేందుకు ఉపయోగపడుతుంది. చిన్న దొంగని అరెస్ట్ చేశామని పోలీసులు అనుకున్నా.. కొన్నిసార్లు అతి పెద్ద దోపిడీకి సంబంధించి అతని వద్దే ఏదో ఒక ఆధారం లభిస్తుంది. సరిగ్గా థానే పోలీసులకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఒక మోసగాడ్ని పట్టుకున్నామని థానే పోలీసులు అనుకున్నారు. కానీ వారు పట్టుకుంది పెద్ద గజదొంగని, అనుకోకుండా అతడి డెన్ కి పోలీసులు వెళ్లడంతో అక్కడ 246 కార్లు, ఇతర వాహనాలు కనపడ్డాయి. అవి కూడా దొంగ సొత్తే. వాటన్నిటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
థానే ప్రాంతానికి చెందిన కాశ్మీరా పోలీస్ స్టేషన్లో ఇటీవలే ఓ కేసు నమోదైంది. రత్నగిరి జిల్లాకు చెందిన భవేష్ అంబవానే పోలీసులకు ఓ కంప్లయింట్ ఇచ్చారు. అధిక డబ్బు ఆశ చూపి తన కారుని ఓ మోసగాడు తీసుకెళ్లాడని, నెలవారీ అద్ద చెల్లించడం లేదు సరికదా, కనీసం తన కారు కూడా తనకు చూపించడం లేదని చెప్పారు. ఈ కారుదొంగని పట్టుకోడానికి పోలీసులు ఓ పథకం పన్నారు. ఎట్టకేలకు మోసగాడు కందాల్కర్ ని పట్టుకున్నారు. కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మోసం చేసి తీసుకెళ్లిన కారుని చూడడానికి అతడి డెన్ కి వెళ్లారు. ఇంకేముంది, అక్కడ ఏకంగా ఓ పార్కింగ్ స్టేషన్ కనపడింది. ఒకటా రెండా 246 వాహనాలను అప్పటికే దొంగిలించాడు కందాల్కర్. వాటన్నిటినీ సెకండ్ హ్యాండ్ కింద అమ్మేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. చివరకు ఓ కారు మోసం కేసులో పోలీసులకు చిక్కాడు. ఆ 246 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కార్లు, టెంపోలు, ట్రక్కులు కూడా ఉన్నాయి. వాటి విలువ రూ.20కోట్లు కావడం గమనార్హం. పోలీసులు ఆ వాహనాలను సీజ్ చేశారు.
కందాల్కర్ పై అప్పటికే 1375 కంప్లయింట్లు ఉన్నాయి. అయితే అతను తన పూర్తి పేరు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో మోసపోయిన వారు అతడిని ట్రేస్ చేయలేకపోయారు. చివరకు భవేష్ అంబవానే ఇచ్చిన ఫిర్యాదు కందాల్కర్ ని పట్టించింది. ఈ ముఠాలో మరో ఏడుగురు కూడా ఉన్నారు. వీరంతా కందాల్కర్ కోసం పనిచేసేవారు.
డబ్బు ఆశ చూపించి..
తమకు పెద్ద ట్రావెల్ ఏజెన్సీ ఉందని, కారు అద్దెకు ఇస్తే నెలవారీ డబ్బులు చెల్లిస్తామంటూ కందాల్కర్ కార్ యజమానులతో డీల్ కుదుర్చుకునేవాడు. మిగతా ట్రావెల్ ఏజెన్సీలకంటే ఎక్కువ డబ్బు ఇస్తామంటూ ఆశపెట్టి మధ్యతరగతి వారిని బురిడీ కొట్టించేవాడు. డీల్ చేసుకున్నట్టుగా స్టాంప్ పేపర్లపై సంతకాలు చేసేవాడు. చివరకు కార్లు తీసుకుని ఉడాయించేవాడు. ఆ తర్వాత ఎవరికీ దొరికేవాడు కాదు. కార్లన్నిటినీ ఓ చోట చేర్చి.. వాటిని ఎలాగోలా అమ్మేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో రీసెంట్ గా చేసిన మోసం బయటపడటంతో.. మొత్తం 246వాహనాల గుట్టు బయటపడింది. ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే అత్యాశకు పోవద్దని చెబుతున్నారు పోలీసులు. ఈ కేసులో కందాల్కర్ మోసం తోపాటు.. అత్యధిక డబ్బులు వస్తాయనే ఆశతో వాహన యజమానులు అతడిని పూర్తిగా నమ్మడం వల్లే తప్పు జరిగింది. ఎవరైనా కార్లు అద్దెకు ఇవ్వాలంటే సదరు కంపెనీ లేదా వ్యక్తి పూర్తి వివరాలు, వారి ట్రాక్ రికార్డ్ తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నారు థానే పోలీసులు.