Shirt clue Reveals Murderer | సినిమాల్లో ఒక చిన్న గుండీనో, షర్ట్ మీద ఉండే ట్యాగ్‌నో పట్టుకొని మర్డర్ కేసు సాల్వ్ చెయ్యడం చూసి అందరం నవ్వుకునేవాళ్లం. అలా ఎక్కడైనా జరుగుతుందా? అని జోకులు వేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు సరిగా ఇదే జరిగింది. నిజంగా ఇలాగే జరిగిందని తెలిస్తే ఏం చేస్తారు? ఒడిషాలో సరిగ్గా ఇలాంటి సీనే కనిపించింది.
కటక్‌లోని కథ్‌జోడి నదీతీరంలో డిసెంబరు 13న ఒక మహిళ శవం కనిపించింది. ఆమె వయసు 35 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అంతకుమించి ఎలాంటి విషయాలూ గుర్తించడానికి కుదరలేదు. పోలీసుల దగ్గర ఉన్న మిస్సింగ్ కేసుల్లో కూడా ఏదీ ఆమెకు సరిపోవడం లేదు. దాంతో ఏం చెయ్యాలో పోలీసులకు అర్థంకాలేదు.
ఆ మహిళ శరీరంలో రెండు చేతులపై టాట్టూస్ వేసి ఉన్నాయి. వాటిని కూడా ఎవరూ గుర్తుపట్టలేదు. అయితే ఆ శవానికి కొంతదూరంలోనే రక్తంతో తడిసి ఉన్న ఒక షర్ట్, ప్యాంటు కనిపించాయి. అవి కూడా చాలా కీలకమైన సాక్ష్యాలు కాబట్టి వాటిని పోలీసులు చాలా జాగ్రత్తగా సేకరించారు. వాటిని టెస్ట్ చెయ్యడానికి ల్యాబ్‌కు పంపారు.
అయితే ఆ రెండింటి మీద ‘న్యూ స్టార్ టైలర్స్’ అనే ట్యాగ్ ఉండటం పోలీసులు గమనించారు. ఆ దుస్తులను ల్యాబ్‌కు పంపేసి, ఈ టైలరింగ్ షాపుపై వాళ్లు ఫోకస్ పెట్టారు. ఈ పేరుతో ఆ స్పాట్‌కు దగ్గరలో ఉన్న టైలరింగ్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కునే పనిలో పడ్డారు.
అదే పేరుతో ఒడిషా మొత్తంలో పది షాపులు ఉన్నట్లు వాళ్లు తెలుసుకున్నారు. ఆ షాపుల్లో వేస్తున్న ట్యాగ్ డిజైన్లను కూడా చెక్ చేశారు. అప్పుడే గంజాం జిల్లాలో ఉన్న ఒక టైలర్.. ఈ ట్యాగ్ చూసి, ఇలాంటివి గుజరాత్‌లో వేస్తారని, లోకల్‌గా వెయ్యరని చెప్పాడు. దాంతో పోలీసులు గుజరాత్ పోలీసుల సాయం అడిగారు.
సూరత్‌కు చెందిన ఒక టైలర్.. ఒడిషాలో డెడ్‌బాడీ దగ్గర దొరికిన దుస్తులపై ఉన్న ట్యాగ్‌ను గుర్తించాడు. ఆ డ్రెస్‌ను కూడా గుర్తుపట్టి, ‘బాబు’ అనే వ్యక్తికి ఆ దుస్తులు కుట్టినట్లు చెప్పాడు. ఆ బాబు గురించి పెద్దగా వివరాలు తెలియకపోయినా.. తన దగ్గర చిల్లర లేకపోతే వంద రూపాయలను ఆ కస్టమర్‌కు యూపీఐ ద్వారా పంపినట్లు ఆ టైలర్ చెప్పాడు. అలాగే తను డబ్బులు పంపిన మొబైల్ నెంబర్ కూడా పోలీసులకు తెలియజేశాడు.
ఆ నెంబర్ సాయంతో ‘బాబు’ అసలు పేరు జగన్నాథ్ దుహురి (27) అని పోలీసులు గుర్తించారు. మళ్లీ సూరత్ వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. చనిపోయిన యువతి.. బాబుకు వదిన అవుతుందని విచారణలో తేలింది. తన అన్న బలరాం, కజిన్ హాపీ సాయంతో బాబు.. ఆమెను చంపినట్లు వెల్లడైంది. బలరాం దంపతుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని, ఆ గొడవల కారణంగానే ముగ్గురు వ్యక్తులు కలిసి ఆ యువతి రాణాలు తీశారని పోలీసులు తెలిపారు. అక్కడ దొరికిన దుస్తులపై ఉన్న ట్యాగ్ వల్లే కేసే ఛేదించగలిగామని పేర్కొన్నారు.