BigTV English

CM Chandrababu: ఏపీ గేమ్ ఛేంజర్.. 80వేల కోట్లతో మరో భారీ ప్రాజెక్టు

CM Chandrababu: ఏపీ గేమ్ ఛేంజర్.. 80వేల కోట్లతో మరో భారీ ప్రాజెక్టు

CM Chandrababu: అమరావతి, పోలవరంతో పాటు సీఎం చంద్రబాబు ఈ మధ్య మరో కలల ప్రాజెక్టుపై దృష్టిపెట్టారు. అదే గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు. వృధా అవుతున్న గోదావరి నీటి కృష్ణకు తరలించి అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం నీటిని ఇవ్వడం దీని ఉద్దేశ్యం. దీనికి సంబంధించిన ప్రణాళికలపై చర్చించిన సీఎం 3 నెలల్లో టెండర్లను పిలవాలని ఫిక్స్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే అది గేమ్ ఛేంజర్ కావడం ఖాయం.


(29-12-2024 ఆదివారం) ( గోదావరి-బనకచర్లకు తొలి అడుగు)

చంద్రబాబు ఖాతాలో మరో కలల ప్రాజెక్ట్ సిద్ధమైంది. ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఆదివారం కీలక అడుగులు పడ్డాయి. గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు జలవనరులశాఖ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. వ్యాప్కోస్‌ రూపొందించిన ఆరు ప్రత్యామ్నాయాలపై ఇందులో చర్చ జరిగింది. దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల అంచనా వ్యయంతో దీని నిర్మాణం జరగనుంది. దీని కోసం మూడు నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు.


పోలవరంతో వంశధారను కనెక్ట్ చేయడం ఒకటి, అటు రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం కల్పించేలా మరో కనెక్ట్ చేయడం మరొకటి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సాగు, తాగు నీరు అందించాలని నిర్ణయించారు. ఎగువ ప్రాజెక్టుల వలన కృష్ణా నీళ్లు ఏపీ వరకు రావడం లేదు. మరోవైపు గోదావరిలో నీళ్లు ఏటా 2,000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి గోదావరి వరద నీటిని కృష్ణాకు తరలించాలని నిర్ణయించారు.ఇదే జరిగితే రాష్ట్రం మొత్తం నీటి కష్టాలు తీరుతాయి. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి దీన్ని నిర్మించడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు. కాబట్టి దీనిపై చంద్రబాబు కేంద్రంతో కూడా ఇప్పటికే మాట్లాడారు. కొంతమేర కేంద్రం సాయం చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది.

(30-12-2024 సోమవారం) ( గేమ్ ఛేంజర్‌గా గోదావరి-బనకచర్ల )

గోదావరి- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి తెలుగుతల్లికి జలహారతిగా పేరు పెట్టినట్టు ప్రకటించారు. ఇది రాష్ట్రానికి గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని చెప్పారు. ఇప్పుడు దీన్ని నిర్మించకపోతే భవిష్యత్ లో అసలు సాధ్యం కాదని సీఎం అభిప్రాయం. ప్రతి ఐదేళ్లకు ఖర్చు 40-50 శాతం పెరుగుతోంది. మరో ఐదేళ్లు ఆగితే ఈ ప్రాజెక్టు ఖర్చు లక్షా 60 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఖర్చు ఎలా ఉన్నా.. రైతుల నుంచి రూపాయి కూడా వసూలు చేయబోమని సీఎం క్లారటీ ఇచ్చారు. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ కింద ప్రభుత్వం కొంత సమకూరుస్తుందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే జీఎస్టీ, ఇతర రూపాల్లో ప్రభుత్వానికి మొదటి ఏడాది నుంచే ఆదాయం వస్తుందని అన్నారు సీఎం.

(30-12-2024 సోమవారం) ( పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ )

సోమవారం సీఎం చంద్రబాబు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక ప్రతిపాదనలకు ఆమోదం వేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక, ఇంధన రంగాల్లో లక్షా 82వేల 162 కోట్ల రూపాయల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 2లక్షల 63వేల 411 మందికి ఉపాధి లభిస్తుందని సర్కార్ అంచనా. ఈ సమావేశంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తున్న సంస్థలకు అవసరమైన భూములు, మౌలిక సదుపాయాలను వేగంగా కల్పించాలని ఆదేశించారు. మనం ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీల ద్వారా మరిన్ని పరిశ్రమలు రావాలని సీఎం ఆలోచన.

(30-12-2024 సోమవారం) ( తెలంగాణ విజ్ఞప్తిపై సానుకూల నిర్ణయం )

సోమవారం తెలంగాణ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో తిరుమలలో దర్శనానికి అనుమతించేవారు. కొంతకాలం నుంచి అనుమతించడం లేదు. ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి గత నెల 16న చంద్రబాబుకు లేఖ రాశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనం కోసం రెండు లేఖలు, ప్రత్యేక దర్శనం కోసం మరో రెండు లేఖలు తిరుమలలో అనుమతిస్తామని వివరించారు.

(31-12-2024 మంగళవారం) ( పింఛన్ల పంపిణీలో సీఎం )

పల్నాడు జిల్లాలో మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నరసరావుపేట మండలం యల్లమందలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఆయనే స్వయంగా పింఛన్ డబ్బు లు ఇచ్చారు. లబ్ధిదారు ఇంట్లో సీఎం కాఫీ తయారు చేసి వారికి అందజేశారు.

ఆ తర్వాత ఆయన సభలో మాట్లాడారు. సంపద సృష్టి ఎంత ముఖ్యమో.. పేదరికం నిర్మూలన కూడా అంతే ముఖ్యమని సీఎం అన్నారు. గ్రామాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవారు, విదేశాల్లో కొలువులు చేస్తున్నవారు ఎందరో ఉన్నా.. ఇంకా పూటగడవని.. ఇల్లులేని వాళ్లూ ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అలాంటి వారి కష్టాలు తీర్చడానికే తామున్నామని చెప్పారాయన. 64 లక్షలమందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం మనదేనని ఆయన చెప్పారు. పింఛన్లకే నెలకు 2,700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన లెక్క.

ఒకప్పుడు సీఎం వస్తున్నారంటే.. పరదాలు కట్టేవారు. హెలికాప్టర్‌లో వస్తున్నా కింద చెట్లను నరికేసేవారని జగన్ ప్రభుత్వ విధానాలను గుర్తు చేశారు. అలాంటి సంస్కృతికి చరమగీతం పాడామని అన్నారు చంద్రబాబు. గత ఐదేళ్లలో నవ్వినా కేసులు పెట్టారని విమర్శించారు. 2014-19 సమయంలో ఇంటిని మంజూరు చేసి నిధులు ఇస్తే.. వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఆపేసిందని ఆరోపించారు. అలాంటి వారికి నిధుల విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం.

ఆరు నెలల్లో ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను చంద్రబాబు గుర్తు చేశారు. పింఛన్ పెంపు, అన్నా క్యాంటీన్‌ గురించి వివరించారు. ఐదేళ్లలో జగన్‌ ఒక్క రోడ్డు కూడా వేయలేదన్నారు. 850 కోట్ల రూపాయలతో సంక్రాంతికి రహదారులను బాగు చేస్తున్నామని చెప్పారు. చెత్తపై పన్ను తొలగించామని. మత్స్యకారుల ఉపాధి దెబ్బకొట్టే 217 జీవో రద్దు చేశామని గుర్తు చేశారు.

(31-12-2024 మంగళవారం) ( మద్యం పాలసీపై సమీక్ష )

మంగళవారం ఎక్సైజ్‌ శాఖపై సమీక్ష నిర్వహించారు. గీత కార్మిక కులాలకు 10 శాతం మద్యం దుకాణాలు కేటాయించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం గీత కార్మిక కులాలకు 340 షాపులు రానున్నాయి. వారిక కేటాయించే మద్యం దుకాణాలకు సంబంధించి అధికారులు సమర్పించిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. ఒక వ్యక్తికి ఒకటే దుకాణం కేటాయించాలని నిర్ణయించారు. కొత్త మద్యం విధానంలో లైసెన్సుదారులకు 20 శాతం మార్జిన్‌ ఇవ్వాలని ఉంది. కానీ, ప్రస్తుతం 10.5 శాతం మార్జినే గిట్టుబాటవుతోంది. దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని లైసెన్సుదారులు చెబుతున్నారు. కాబట్టి తెలంగాణ తరహాలో 14 శాతం మార్జిన్‌ ఇవ్వాలని ఈ సమీక్షలో చంద్రబాబు ప్రకటించారు.

తక్కువ రేట్లకు మద్యం అమ్మకాల వల్ల ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం రావట్లేదని అధికారులు చంద్రబాబుకు చెప్పారు. అయినా సరే తక్కువ ధరకే మద్యం అందుబాటులో ఉండేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా ప్రజలకు మంచి జరగాలని అన్నారు. బెల్ట్‌షాపులు లేకుండా జాగ్రత్తపడాలని ఆదేశించారు.

(1-1-2025 బుధవారం) ( రాజధాని నిర్మాణాలకు టెండర్లు)

కొత్త సంవత్సరం మొదటి రోజే అమరావతిలో నిర్మాణ పనుల విషయంలో కీలక అడుగు పడింది. రాజధాని పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మొత్తం ఐదు పనులకు సీఆర్డీఏ, అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వేర్వేరుగా బుధవారం టెండర్లు ఆహ్వానించాయి. 2వేల 323 కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టాయి. రెండు ఎల్పీఎస్‌ జోన్లలో మౌలిక వసతుల కల్పన, ప్రజా ప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్ పనులకు సీఆర్డీఏ బిడ్లను ఆహ్వానించింది. వరద నియంత్రణ, ట్రంక్‌ ఇన్‌ఫ్రా పనుల కోసం ఏడీసీ టెండర్లు పిలిచింది. ఈ నెల 22 మధ్యాహ్నం 2 గంటల వరకు టెండర్ల దాఖలుకు అవకాశం ఉంది. అదేరోజు సాయంత్రం 4 గంటలకు బిడ్లను తెరుస్తారు.

(1-1-2025 బుధవారం) ( అమ్మవారిని దర్శించుకున్న సీఎం )

బుధవారం సీఎం చంద్రబాబు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. తొలుత ఆలయ మర్యాదలతో వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దుర్గమ్మ ఆలయానికి రావడం వల్ల అమ్మవారిని దర్శించుకోవడంతోపాటు ఆనందం, ఉత్సాహంతో ఉన్న ప్రజలను కూడా చూడగలిగానన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

(1-1-2025 బుధవారం) ( సీఎంకు శుభాకాంక్షల వెల్లువ)

సీఎం చంద్రబాబుకు న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, ప్రజలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలివెళ్లారు. సుమారు 2 వేల మందిని సీఎం పలకరించి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారితో మాట్లాడి ఫొటోలు దిగారు.
కొందరు వారి సమస్యలు చెప్పుకున్నారు. దీంతో చంద్రబాబు వారికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఆర్ధిక సాయం చేశారు. కొంత మంది పింఛన్లు, ఇళ్ల మంజూరుపై వివరించారు. వాటికి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు.

(1-1-2025 బుధవారం) ( కక్షసాధింపు లక్ష్యం కాదు )

బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సెకితో ఒప్పందం రద్దు చేస్తారా? జగన్‌పై విచారణకు ఆదేశిస్తారా? అని విలేకర్లు అడిగారు. ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాల్సి వస్తుందని.. ఈ టైంలో చర్యలు తీసుకోలేమని చెప్పారు చంద్రబాబు. పైగా జగన్ పై కక్షసాధించాలంటే ఇది తనకు అద్భుత అవకాశమని అన్నారు. కానీ, అలాంటి పని తాను చేయనని చెప్పారు. జగన్‌ను అరెస్టు చేయడమే తన లక్ష్యమైతే అధికారంలోకి రాగానే ఆ పని చేసేవాడినన్నారు. అదే చేస్తే వైసీపీ నేతలకు, తనకు తేడా ఏంటని అన్నారు సీఎం. చెడిపోయిన వ్యవస్థలను గాడినపెట్టడమే తన లక్ష్యమని అన్నారు చంద్రబాబు.

(02-01-2025 గురువారం) ( మరో 2 పథకాలకు వేళాయే )

గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. జూన్ నెలలోపే తల్లికి వందనం అమలు కానుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పథకం అమలుచేయనుంది. ఒక్కొక్కరికి 15 వేల చొప్పున ఇస్తారు. ఇక రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. కేంద్రం పీఎం కిసాన్‌ పథకం కింద గతంలో ప్రభుత్వం 6 వేల రూపాయలు ఇచ్చేది.

దాన్ని పది వేల రూపాయలకు పెంచింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా 10 వేలు ఇవ్వనుంది. పీఎం కిసాన్ ఎప్పుడైతే పడతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రైతుల ఖాతాలో వేయనున్నారు. దీని తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకంపై కూడా చర్చ జరిగింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని ఫిక్స్ చేశారు. ఇక మత్య్సకారులకు వేట విరామ సమయంలో అందించే ప్రభుత్వ సాయం 20 వేల రూపాయలను ఏప్రిల్‌లో ఇవ్వనున్నారు. వైసీపీ టైంలో జరిగిన విధ్వంసంపై చర్చ జరిగింది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల బకాయిలే లక్షా 30 వేల కోట్ల రూపాయలకు చేరాయని ఈ సమావేశంలో తేలింది. ఉద్యోగులకు పీఎఫ్‌ బకాయిలు, ఆసుపత్రుల బిల్లులు ఇలా చాలా పెండింగ్ బిల్లులు ఉన్నాయని లెక్క తేలింది.

(02-01-2025 గురువారం) ( పెట్టుబడులకు అనుకూల నిర్ణయాలు)

దీంతోపాటు కేబినెట్ కీలక ఆమోదాలు చేసింది. సౌర, పవన విద్యుత్తు బ్యాటరీ నిల్వ సమీకృత ప్రాజెక్టును గ్రీన్‌టెక్‌ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటుచేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో పవన విద్యుత్తు 119 మెగావాట్లు, సౌరవిద్యుత్తు 130 మెగావాట్లతో పాటు బ్యాటరీ నిల్వ వ్యవస్థను క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ త్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేస్తుంది. విశాఖలో టీసీఎస్‌కు మిలీనియం టవర్స్‌ ఏ, బీ బ్లాకుల్లో 2లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

(03-01-2025 శుక్రవారం) ( తెలుగులో ప్రభుత్వ జీవోలు )

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ జీవోలు ఇకపై తెలుగులోనూ అందుబాటులోకి ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో 90 శాతానికి పైగా ప్రజలు తెలుగు మాట్లాడతారు. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనేది అందరికీ అర్థం కావాలంటే జీవోలు తెలుగులో కూడా ఉండాలని ప్రభుత్వం చెప్పింది. తెలుగు భాష, సాంస్కృతిక వారసత్వాలకు సముచిత గౌరవం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. జీవోలను ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అప్‌లోడ్‌ చేసేందుకు ఐటీశాఖ తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

(03-01-2025 శుక్రవారం) ( రాష్ట్రంలో మరో 7 ఎయిర్ పోర్టులు)

రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొత్త విమానాశ్రయాల నిర్మాణం, అభివృద్ధిపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వ ఆలోచన.

కుప్పంలో రెండు దశల్లో విమానాశ్రయాన్ని నిర్మించనుంది. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ నివేదికను అధికారులు సిద్ధం చేశారు. గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం ఆకారంలో నిర్మాణం జరగనుంది. విమానాశ్రయ విస్తరణ, కొత్త టెర్మినల్‌ భవన నిర్మాణ పనులను 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

(03-01-2025 శుక్రవారం) ( పేపర్ మిల్లు కార్మికులపై చర్చ )

సీఎం చంద్రబాబుతో రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ సమావేశమయ్యారు. రాజమండ్రి ఆంధ్రా పేపరు మిల్లు కార్మికుల సమస్యపై చర్చించారు. వైసీపీ టైంలో జరిగిన వేతన ఒప్పందం గురించి వివరించారు. గతంలో పేపర్ మిల్లు కార్మికులకు 9 వేలు పెంచుతూ తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ, గత డిసెంబరు 24న జిల్లా కలెక్టర్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో 3వేల 500 మాత్రమే జీతం పెంచుతామని పేపర్‌మిల్లు యాజమాన్యం చెప్పిందని పురందేశ్వరి సీఎంకు చెప్పారు. దీంతో పాటు స్థానిక సంస్థలకు మిల్లు యాజమాన్యం పన్నులు కట్టడం లేదని కూడా వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికులకు అన్యాయం జరగకుండా చూసుకుంటానని అన్నారు చంద్రబాబు.

(04-01-2025 శనివారం) ( నౌకాదళ వేడుకల్లో సీఎం)

విశాఖ తీరంలో శనివారం నిర్వహించిన నేవీ విన్యాసాల ప్రదర్శన కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. దేశం ఆర్థికంగానే కాకుండా రక్షణ రంగంలోనూ బలంగా ఉండాలని ఆయన అన్నారు. అందుకే ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌లో భాగంగా రక్షణ రంగానికి పెద్దపీట వేశారని చెప్పారు. రక్షణరంగంలో నౌకాళం చేస్తున్న కృషి అసామాన్యమని సీఎం కొనియాడారు. నేవీని చూసి వేరే దేశాలు భయపడేలా పనిచేస్తున్నారని అన్నారు. దేశ రక్షణకే కాకుండా ఏదైనా విపత్తు వచ్చినా నౌకాదళం వేగంగా స్పందిస్తోందని చంద్రబాబు అభిప్రాయం. హుద్‌హుద్‌ తుపాను సమయంలో పది రోజుల పాటు నేవీ చూపించిన చొరవ జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×