School Detention: పాలకొల్లులోని రంగమ్మన్నార్ పేటలో ఉన్న సన్‌షైన్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం తీరు ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది. కేవలం స్కూల్ ఫీజు బకాయి ఉందన్న కారణంతో, కనీసం కనికరం లేకుండా ఒక ఎల్కేజీ (LKG) చదువుతున్న చిన్నారిని పాఠశాలలోనే నిర్బంధించడం తీవ్ర కలకలం రేపింది. అభం శుభం తెలియని పసిపాప పట్ల విద్యాసంస్థ ప్రదర్శించిన ఈ అమానుష వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకే పాఠశాల ముగిసినప్పటికీ, ఫీజు చెల్లించలేదనే సాకుతో పి. మౌనిక అనే చిన్నారిని ఇంటికి పంపకుండా యాజమాన్యం అడ్డుకుంది. పాపను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులను లోపలికి రానివ్వకుండా, గంటల తరబడి చిన్నారిని స్కూల్‌లోనే ఉంచారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంటే దాదాపు నాలుగున్నర గంటల పాటు ఆ చిన్నారిని నిర్బంధంలోనే ఉంచడం గమనార్హం. తమ బిడ్డను పంపమని తల్లిదండ్రులు ప్రాధేయపడినా యాజమాన్యం కనికరించకపోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
విద్యార్థి సంఘాల ఆగ్రహం..
ఈ విషయం తెలుసుకున్న AISF నాయకులు వెంటనే పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఒక చిన్నారిని ఫీజు కోసం నిర్బంధించడం చట్టరీత్యా నేరమని, విద్యాసంస్థలు వ్యాపార దాహంతో ఇంతలా దిగజారడం దారుణమని వారు మండిపడ్డారు. విద్యార్థి సంఘాల ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు సాయంత్రం 5 గంటల సమయంలో పాఠశాల యాజమాన్యం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించింది.
అధికారులు చర్యలు తీసుకోవాలి..
ఈ ఘటనపై AISF జిల్లా కార్యదర్శి సుందర్ , మహిళా అధ్యక్షురాలు యామిని ఘాటుగా స్పందించారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ పరాకాష్టకు చేరిందని, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపించారు. ఐదు రోజుల్లోగా సదరు పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే స్కూల్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అటు పాప తండ్రి నాగరాజు తన బిడ్డ పట్ల స్కూల్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై కన్నీరుమున్నీరయ్యారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట ఇలాంటి అమానుష చర్యలు చోటుచేసుకోవడం విద్యావ్యవస్థకే మచ్చ అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: 180 మంది బాలికలపై అఘాయిత్యం.. కామాంధుడిని వీధుల్లో ఊరేగించిన పోలీసులు