Pune Crime : మహారాష్ట్రలోని అతిపెద్ద బస్టాండ్లల్లో ఒకటైన స్వర్గేట్ లోని ఆగి ఉన్న ఓ బస్సులో 26 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. తాను వెళ్లాల్సిన బస్సు గురించి అడిగిన యువతికి.. బస్సు చూపిస్తానని చెప్పి వెంట వచ్చిన వ్యక్తి.. ఆమెపై ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ లో నిలిపి ఉంచిన బస్సులోకి ఆమెను పంపించి, ఆపై అత్యాచారం చేసినట్లుగా యువతి తెలిపింది. కాగా.. పోలీసు స్టేషన్ కు 100 మీటర్ల దూరంలోనే ఈ దారుణం చోటుచేసుకోవడంతో.. రాష్ట్రంలో తీవ్ర దుమారం చెలరేగింది.
పూణేలోని రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్ ఒకటి. ఇక్కడి నుంచి నిత్యం వందలాది బస్సులు, వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి బస్టేషన్ ప్రాంగణంలో నిలిపి ఉంచిన బస్సులో.. 26 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. ఈ బస్టాండ్ నుంచి సతారా జిల్లాలోని ఫల్తాన్ అనే తన స్వగ్రామానికి ప్రయాణిస్తున్న 26 ఏళ్ల యువతి.. ఓ వ్యక్తిని తను వెళ్లాల్సి బస్సు గురించి అడిగింది. దాంతో.. సాయం చేసేందుకు వచ్చిన ఆ వ్యక్తి.. ఆమెను దీదీ/ సోదరి అంటూ సంభోదించాడు. సమీపంలోని ఉన్న ఓ బస్సును చూపించి.. అదే ఆమె ఎక్కాల్సిన బస్సు అని చెప్పి దగ్గరకు తీసుకువెళ్లాడు. ఈ ఘటన ఉదయం 5.45 నుండి 6.30 గంటల మధ్య జరిగింది. అప్పటికి బస్సులో లైట్లు లేకపోవడం, ఎవరు ప్రయాణికులు ఉన్నట్లు కనిపించకపోడంతో.. ఆమె సంకోచించగా, బస్సులోని వాళ్లు నిద్రపోతున్నారని నమ్మబలికాడు.
బస్సులోకి యువతిని ఎక్కించిన నిందితుడు.. వెంటనే బస్సులోకి దూకి, తలుపుకు తాళం వేసి ఆమెపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై అక్కడి నుంచి అతను పరారు అయ్యాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె స్నేహితురాలు ప్రయాణిస్తున్న బస్సు ఎక్కిన యువతి.. తనపై జరిగిన అత్యాచారం గురించి చెప్పింది. దాంతో.. ఆమె సహాయంతో బాధిత యువతి విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో.. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ పుటేజ్ ను యాక్సెస్ చేశారు. అందులోని నిందితుడిని దత్తాత్రేయ రాందాస్ (36) అనే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతానికి అతని ఆచూకీ లభించలేదన్న పోలీసులు.. అతన్ని గుర్తించేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడికి నేర చరిత్ర ఉందని, గతంలోనూ కొన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయినట్లు గుర్తించారు.
అత్యాచారం జరిగిన బస్ స్టాండ్ మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడిపే అతిపెద్ద బస్ స్టాండ్‌లలో ఒకటి. ఇలాంటి చోట్లే మహిళలు, యువతులకు రక్షణ లేకుంటే.. ఇంక మిగతా చోట్ల పరిస్థితి ఏంటి అంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రతిపక్ష పార్టీలు బస్టాండ్ కు చేరుకుని ఆందోళన నిర్వహించాయి, అత్యాచారాని కారణమైన బస్సును ధ్వంసం చేశారు. దీని ఆర్టీసీ అధికారులు సైతం దర్యాప్తునకు ఆదేశించారు. బస్ స్టేషన్ ప్రాంగణంలో అత్యాచారం చేసేందుకు వీలు కల్పించే అవకాశం ఎలా వచ్చిందనే విషయాలపై నివేదిక కోరారు.
Also Read :
ఈ ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ సంఘటనను చాలా దురదృష్టకరమైందని, చాలా బాధ కలిగించేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కేసు విషయమై ఎంక్వైరీ చేశారని తెలిపారు. నిందుతుల్ని వెంటనే గుర్తించి, అదుపులోకి తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులు చేసిన నేరం క్షమించరానిది, ఉరితీయడమే వారికి సరైన శిక్ష అని వ్యాఖ్యానించారు. పోలీసులకు సీఎం అవసరమైన సూచనలు చేశారన్నారు. చట్టం ప్రకారం అతనికి కఠినమైన శిక్ష పడేలా చూసేందుకు, రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.