Mystery Revealed in Narsapur Double Murder Case : నర్సాపూర్‌లో కలకలం రేపిన డబుల్ మర్డర్ కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఘటన జరిగిన 25 రోజుల తర్వాత.. పోలీసులు కేసును చేధించారు. మే 22న నర్సాపూర్ రాయరావు చెరువు వద్ద దంపతుల మృతదేహాలు లభ్యమవ్వగా.. మృతులను సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుళ్లనగర్ కు చెందిన కిష్టయ్య, నర్సమ్మలుగా గుర్తించారు. బంగారం కోసం తల్లిదండ్రులను కన్నకొడుకే హతమార్చినట్లు పోలీసులు తేల్చారు.
దుండిగల్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోన్న లక్ష్మణ్.. చెడు వ్యసనాలకు బానిసై, జల్సాలకు అలవాటుపడి అప్పులపాలయ్యాడు. ఆ అప్పులు తీర్చడానికి తల్లి బంగారంపై కన్నేశాడు. ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారాన్ని ఎలాగైనా కాజేయాలనుకున్నాడు. ఈ క్రమంలో తల్ల,తండ్రిని ఇంటికి పిలిచాడు. భోజనం పెట్టాడు. అందరూ పడుకున్నాక.. తల్లిగొంతును నులిమి చంపేశాడు. కొద్దిసేపటికి తండ్రి లేవడంతో.. ఆయన్ను కూడా హతమార్చాడు ఆ కసాయి కొడుకు.
Also Read : ఓ రైలులో తల, మొండెం.. ఇంకో రైలులో కాళ్లు, చేతులు.. బిగ్ ఆఫర్ చేసిన పోలీసులు
విషయం భార్యకు చెప్పిన లక్ష్మణ్.. ఆమె సహాయంతోనే కారులో నర్సాపూర్ అడవుల్లో మృతదేహాలను తీసుకొచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయారు. అటువైపుగా వెళ్తున్నవారు చూసి.. పోలీసులకు సమాచారమివ్వడంతో.. మిస్టరీ మర్డర్స్ గా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ఒక్కొక్కరినీ విచారిస్తూ వచ్చిన పోలీసులు.. లక్ష్మణ్ ను కూడా తమదైన శైలిలో ప్రశ్నించారు. అసలు హంతకుడు లక్ష్మణ్ అని గుర్తించి.. అతనితోపాటు అతనికి సహకరించిన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు.