Free Delivery Services: ఒకప్పుడు వైద్యం అనేది సేవగా భావించే వారు. కానీ, రాను రాను పూర్తి కమర్షియల్ గా మారిపోయింది. పేషెంట్ల నుంచి అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా కొంత మంది డాక్టర్లు వ్యవహరిస్తున్నారు. చిన్న జబ్బుతో దవాఖానాలో చేరినా, పెద్ద పెద్ద టెస్టులు చేసి జేబును గుళ్లా చేసి పంపిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, అదీ ఇదీ అంటూ రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు కూడా డాక్టర్లు ఉన్నారు. వారు ఇప్పటికీ వైద్యాన్ని సేవగానే భావిస్తున్నారు. అత్యాశకు పోకుండా న్యాయంగా వైద్యం అందిస్తున్నారు. డబ్బులు సంపాదించపోయినా, పేదలు, అభాగ్యుల ప్రాణాలు కాపాడి మంచి మనసున్న డాక్టర్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా ఓ మనసున్న డాక్టర్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అమ్మాయి పుడితే ఉచిత వైద్యం
పుణేలో ఓ దినసరి కూలీ తన భార్యను ప్రసవం కోసం ఆసుపత్రిలో చేర్పించాడు. డాక్టర్లు సిజేరియన్ చేయాలన్నారు. ఆపరేషన్ అనగానే అతడికి భయమేసింది. ఎంత ఖర్చు అవుతుందోనని టెన్షన్ పడ్డాడు. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఫీజు ఎంత అవుతుంది సార్? అని ఆందోళనగా అడిగాడు. డాక్టర్ సమాధానం చెప్పలేదు. ప్రతిగా చిన్న నవ్వు నవ్వాడు. అతడి భార్యను ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు. బిడ్డ పుట్టబోతుందనే సంతోషం ఒకవైపు, ఆపరేషన్ కు ఎంత ఖర్చు అవుతుందోననే టెన్షన్ మరోవైపు. బయటే బెంచీ మీద కూర్చున్నాడు.
కాసేపటి తర్వాత నర్సు బయటకు వచ్చింది. నీ భార్య పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది అని చెప్పింది. ఆయన ఎంతో సంతోష పడ్డాడు. కాసేపటి డాక్టర్ బయటకు వచ్చాడు. “అమ్మాయా లేక అబ్బాయా?” అని డాక్టర్‌ని అడిగాడు. “మహాలక్ష్మి” అని డాక్టర్ బదులిచ్చారు. “ఫీజు ఎంత డాక్టర్?” అని అడిగాడు. “లక్ష్మీదేవి పుడితే నేను ఎలాంటి ఫీజు వసూలు చేయను” అని డాక్టర్ అన్నాడే. ఆ వ్యక్తి “సార్, మీరు దేవుడు” అని డాక్టర్ పాదాలపై పడ్డాడు.
మనసున్న డాక్టర్ గణేష్ రాఖ్
ఆ మనసున్న డాక్టర్ మరెవరో కాదు డాక్టర్ గణేష్ రాఖ్. గత 10 సంవత్సరాలుగా ఆయన హాస్పిటల్ నడుపుతున్నాడు. దంపతులకు ఆడపిల్ల పుడితే, వారి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు. ఇప్పటి వరకు ఆయన 1,000 మందికి పైగా గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పురుడు పోశాడు. “ఆడపిల్ల అంటే మహాలక్ష్మి. నువ్వు డాక్టర్ అయ్యాక వారిని కాపాడాలి అని మా అమ్మ చెప్పింది. అందుకే నేను ఆడపిల్లకు జన్మనిచ్చి తల్లిదండ్రుల నుంచి ఫీజు తీసుకోను” అని చెప్తాడు డాక్టర్ రాఖ్. “సేవ్ ది గర్ల్ చైల్డ్” క్యాంపెయిన్ లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సేవలు చూసి భారతీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా ప్రశంసలు కురిపించారు.
Read Also: ఫుడ్ ఇవ్వడానికి.. మహిళ ఇంటికి వెళ్లిన డెలీవరీ మ్యాన్, ఆమె తలగడపై రక్తంతో రాసింది చూసి..