గ్రూప్ ఏలో అమెరికా వర్సెస్ ఐర్లాండ్ మధ్య ఫ్లోరిడాలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. అయితే వర్షం తగ్గినా అవుట్ ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా అంపైర్లు మ్యాచ్ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఆటగాళ్లు ఫీల్డింగ్ చేసేటప్పుడు గాయపడే అవకాశాలుండటంతో ఆ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా-ఐర్లాండ్ రెండు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. దీంతో ఆల్రడీ 4 పాయింట్లతో ఉన్న అమెరికా ఇప్పుడు వచ్చిన ఒక్క పాయింట్ తో కలిపి 5 పాయింట్లతో సూపర్ 8 కి వెళ్లిపోయింది. పాకిస్తాన్ ఒకవేళ ఐర్లాండ్ తో గెలిచినా సరే, తనకి 4 పాయింట్లే వస్తాయి. అందువల్ల లీగ్ దశ నుంచి పాకిస్తాన్ ఇంటికి తిరుగు ముఖం పట్టనుంది.
పాకిస్తాన్ దురదృష్టం ఏమిటంటే.. అమెరికాతో జరిగిన మ్యాచ్.. సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. అక్కడ అదృష్టం కలిసి రాలేదు. అలాగే ఇండియాతో జరిగిన మ్యాచ్ కూడా గెలవాల్సింది బుమ్రా కారణంగా ఓడిపోయింది. ఇవే పాకిస్తాన్ కు శాపంగా మారాయి. ఇక ఐర్లాండ్ 1 పాయింట్ తో సంత్రప్తి పడనుంది. లేదంటే తర్వాత మ్యాచ్ లో పాక్ ను ఓడించి 3 పాయింట్లతో ముందడుగు వేస్తుందా? చూడాలి.
ఈ క్రమంలో అమెరికా సూపర్ 8కి చేరుతుందని ఎవరూ ఊహించలేదు.నిజంగా పాకిస్తాన్ ను ఓడించడమే కాదు, ఇండియాను ఒక దశలో వణికించింది. టీమ్ఇండియాలో వరల్డ్ బెస్ట్ బ్యాటర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ వికెట్లను మొదటి మూడు ఓవర్లలోనే తీసే మొనగాడు ఆ జట్టులో ఉన్నాడంటే, ఆశ్చర్యంగా ఉందని సీనియర్లు అంటున్నారు. తను కూడా మరెవరో కాదు ప్రవాస భారతీయుడు నేత్రావల్కర్ కావడం విశేషం.