Uber Auto Fare Viral News: వర్షం పడితే చాలు నగర వాసుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణీకులు, వాహనదారులు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. ఇక వర్షం సమయంలో క్యాబ్ లో బుక్ చేసుకుందామంటే రేట్లు చుక్కల్లో ఉంటాయి. సాధారణ రోజులతో పోల్చితే వర్షం పడే సమయంలో రేట్లు సుమారు డబుల్ ఉంటాయి. కానీ, తాజాగా బెంగళూరులో వర్షం పడే సమయంల ఆటో బుక్ చేసుకుని కిలో మీటర్ ప్రయాణించాడు ఓ వ్యక్తి. ఆటో డ్రైవర్ ఇచ్చిన ఛార్జీని చూసి షాకయ్యాడు. ఇంతకీ అతడు ఎంత చెప్పాడంటే..
కిలో మీటర్ ఆటో ప్రయాణానికి రూ.425 ఛార్జీ
ఆదివారం నాడు బెంగళూరులో వర్షం పడింది. సాధారణంగా బస్సులో వెళ్లే ఓ వ్యక్తి త్వరగా వెళ్లాలనే ఆలోచలనతో ఉబెర్ ఆటో బుక్ చేసుకున్నాడు. వర్ష కారణంగా సుమారు కిలో మీటర్ ప్రయాణించడానికి పావుగంట సమయం పట్టింది. రోడ్ల మీద వరద పారుతున్నప్పటికీ నెమ్మదిగా సదరు వ్యక్తిని అనుకున్న చోట దింపాడు. దిగాక ఆటో ఛార్జీ చూసి సదరు వ్యక్తి షాకయ్యాడు. కిలో మీటర్ ప్రయాణానికి ఏకంగా రూ. 425 బిల్లు వచ్చింది. చచ్చుకుంటూ అంతడబ్బు చెల్లించి నోరుమూసుకుని వెళ్లిపోయా అంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ప్రస్తుతం అతడు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also: రైలు ఎన్ని గంటలు ఆలస్యమైతే ఫుల్ రీఫండ్ ఇస్తారు? ఈ కొత్త రూల్ గురించి తెలుసా?
క్రేజీ కామెంట్స్ పెడుతున్న నెటిజన్లు
ఉబెర్ ఆటో ఛార్జీ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు క్రేజీగా స్పందిస్తున్నారు. భారీ వర్షం, ట్రాఫిక్ జామ్ ఏర్పడితే బెంగళూరులో నరకమే అని కొంత మంది కామెంట్స్ పెడుతుంటే, వర్షం వచ్చిన సమయంలో ఆటో నడుపుకోవడం బెస్ట్ అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. “ఆటో కొనడానికి ఇదే సరైన సమయం. వర్షం వచ్చిన ఒక్కరోజు ఆటో నడిపితే, నెలంతా హాయిగా ఇంట్లో కూర్చొని తినొచ్చు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కంటే ఆటో నడపడమే బెటర్ అనిపిస్తుంది” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “వర్షం వచ్చిందంటే బెంగళూరులో రెయిన్ కోట్, గొడుగుతో పాటు ఈత కూడా వచ్చి ఉండాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “మన ఆటో ఛార్జీ జర్మనీలో బెంజ్ టాక్సీ ప్రయాణాల్లో కూడా ఉండకపోవచ్చు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ప్రభుత్వం ఇప్పటికైనా క్యాబ్ ధరల విషయంలో నియంత్రణ అనేది తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేదంటే వాళ్లు ఇష్టారీతిన ప్రయాణీకులను పీల్చి పిప్పి చేసే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ఈ విషయంలో సిద్ధరామయ్య సర్కారు నిర్ణయం తీసుకోవాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
Read Also: ఫుడ్ ఇవ్వడానికి.. మహిళ ఇంటికి వెళ్లిన డెలీవరీ మ్యాన్, ఆమె తలగడపై రక్తంతో రాసింది చూసి..