ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి పాక్ పై భారత్ జాలి చూపించింది. పాక్ ని ఓ పెద్ద విపత్తనుంచి బయటపడేసేందుకు ముందస్తు సమాచారం అందించింది. బద్ధ శత్రువు పాకిస్తాన్ కి భారత్ మంచి చేయడమేంటి? అలా చేయడం వల్ల భారత్ కి వచ్చిన లాభమేంటి? భారత్ ఎందుకిలా చేసింది?
ముందస్తు హెచ్చరిక..
జమ్మూకాశ్మీర్ లో భారీ వరదలకు ఇటీవల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగాయి. అయితే అలాంటి నష్టం పాకిస్తాన్ కి కూడా జరిగే అవకాశముంది. భారీ వరదలతో పొంగి ప్రవహిస్తున్న తావి నది పాకిస్తాన్ ని కూడా అతలాకుతలం చేసేందుకు పరుగులు పెడుతోంది. దీంతో ఈ విషయాన్ని పాక్ కి చేరవేసింది భారత్ ప్రభుత్వం. తావి నదీ ప్రవాహం ఉధృతంగా ఉందని అప్రమత్తంగా ఉండాలని, భారత అధికారులు పాక్ ని హెచ్చరించారు. దీంతో పాక్ అలర్ట్ అయింది. తావి నది పరిసర ప్రాంత వాసుల్ని అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పింది. ఈ హెచ్చరికలతో చాలామంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తావి వరద ప్రవాహం చేరుకుంది. అయితే ప్రభుత్వ ముందస్తు హెచ్చరికలతో ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు.
తావి నది వరదల గురించిన సమాచారాన్ని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. ఇండియా సమాచారం ఇచ్చిన తర్వాతే పాక్ అప్రమత్తమైంది. భారత హైకమిషన్ ద్వారా ఇలాంటి సమాచారాన్ని పంచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. సహజంగా వరదలు, ఉత్పాతాలకు సంబంధించిన సమాచారాన్ని సింధూ జలాల ఒప్పందం ప్రకారం ఇరు దేశాల కమిషనర్లు తెలియజేసుకుంటారు. కానీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత అలాంటి పరిస్థితులు లేవు. సింధు ఒప్పందాన్ని భారత్ పక్కనపెట్టింది. సింధూ నది జలాలను పాక్ కి వెళ్లకుండా అడ్డుకుంది. అయితే మానవతా ధృక్పదంతో భారత్ జమ్మూ కాశ్మీర్ వరదల విషయాన్ని పాకిస్తాన్ కి తెలియజేసింది.
కృతజ్ఞత ఉంటుందా..?
తావి నది వరదల విషయంలో భారత్ అందించిన సమాచారం వల్ల పాకిస్తాన్ కి పెను ముప్పు తప్పింది. అక్కడక్కడ ఆస్తి నష్టం జరిగిందే కానీ, ప్రాణ నష్టం లేదు. అయితే ఇంత సహాయం చేసిన భారత్ పట్ల పాకిస్తాన్ కృతజ్ఞతతో ఉంటుందా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది. పహల్గాం దాడి తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఆపరేషన్ సిందూర్ తో ఆల్రడీ భారత్, పాక్ కి గట్టిగానే బుద్ధి చెప్పింది. అయినా కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధి మార్చుకోలేదు. భారత్ నుంచి వచ్చే విమానాలను తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతివ్వలేదు. మరోవైపు అమెరికాతో చేతులు కలిపి భారత్ ని ఒంటరిని చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో భారత్ మానవతా దృక్పథంతో స్పందించడం విశేషం. కనీసం ఈ కృతజ్ఞత అయినా పాకిస్తాన్ కి ఉంటుందో లేదో ముందు ముందు తెలుస్తుంది.