ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేయని రంగమంటూ ఏదీ ఉండదని తేలిపోయింది. తాజాగా అంతరిక్ష పరిశోధనల్లో కూడా ఏఐ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. నాసా, ఐబీఎం సంయుక్తంగా రూపొందించిన ఒక కొత్త ఏఐ సూర్యుడి గురించిన మరింత సమాచారాన్ని మనకి అందిస్తోంది. దాదాపు 9 ఏళ్ల డేటాని మ్యాపింగ్ చేయడం ద్వారా ఈ ఏఐ పనిచేస్తుంది. దీనికి సూర్య అనే పేరు పెట్టారు. సూర్యుడికి ఇది కవల సోదరుడు అని అంటున్నారు. అంటే సూర్యుడి శక్తి విస్ఫోటనం గురించి సరైన సమాచారాన్ని ఈ ఏఐ ద్వారా మనం పొందవచ్చు.
సూర్య ఏఐ
సూర్యుడు మనకు శక్తిప్రదాత. సూర్యుడు లేకపోతే భూమిపై వాతావరణం ఉండదు, అసలు సృష్టే ఉండదు. అయితే సూర్యుడి వల్ల మంచే కాదు, అప్పుడప్పుడు మనం ఊహించని చెడు కూడా జరుగుతుంది. సౌర తుపానుల రూపంలో వచ్చే తరంగాలు మనల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. సూర్యుని ఉపరితలం నుండి పేలుడు రూపంలో బయటకు వచ్చే కణాలు, శక్తి, అయస్కాంత క్షేత్రాలు, పదార్థాల ఆకస్మిక విస్ఫోటనాన్ని మనం సౌరతుపానుగా భావిస్తాం. ఈ తుపాను భూమి వైపు ప్రయాణించి భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వలన అంతరిక్ష వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. దీని ప్రభావంతో GPS, ఇంటర్నెట్, విద్యుత్ గ్రిడ్‌లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటి వరకు వీటిని కేవలం అంచనా వేయడంతోనే శాస్త్రవేత్తలు సరిపెట్టారు. కానీ తొలిసారి నాసా-ఐబీఎం తయారు చేసిన సూర్య అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో దాని గుట్టు మట్లన్నీ తెలిసిపోతున్నాయి. అచ్చం సూర్యుడిలాగే ఈ సూర్య ఏఐ ప్రవర్తించడం విశేషం.
సౌర తుపానుల రహస్య ఛేదనకోసం..
సౌర తుపానుల వల్ల కమ్యూనికేషన్ శాటిలైట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. అక్కడ్నుంచి మనకు వచ్చే సమాచారం ఒక్కసారిగా విచ్ఛిన్నం అవుతుంది. జీపీఎస్, ఇంటర్నెట్ సర్వీసులకు కూడా అడ్డంకి ఎదురవుతుంది. అందుకే ఈ సౌర తుపానుల గురించి సమర్థవంతమైన సమాచారం తెలుసుకుని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ దిశగా సూర్య ఏఐ ఓ పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు.
9 సంవత్సరాల పరిశోధనల ఫలితం
నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ నుండి 9 సంవత్సరాల పరిశీలనలపై పూర్తిగా పట్టు సాధించిన AI మోడల్ సూర్య హీలియోఫిజిక్స్ ఫౌండేషన్ మోడల్. విస్తారమైన సౌర డేటాను విశ్లేషించి, శాస్త్రవేత్తలు సౌర విస్ఫోటనాలను బాగా అర్థం చేసుకోవడానికి ఇది సాయపడుతుంది. ఉపగ్రహాలు, పవర్ గ్రిడ్‌లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను ఇబ్బంది పెట్టే అంతరిక్ష వాతావరణాన్ని అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది. ఉపగ్రహ నిర్వాహకులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాలు భూమిపై ఉన్న వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇది మరింత క్లారిటీగా వివరిస్తుంది. ఈ మోడల్ విజయం సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ దీర్ఘకాలిక డేటాబేస్‌పై ఆధారపడి ఉంటుంది. 2010లో ప్రారంభించబడిన NASA యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ, ప్రతి 12 సెకన్లకు మల్టిపుల్ వేవ్ లెంగ్త్స్ తో చిత్రాలను తీస్తుంది. ఖచ్చితమైన అయస్కాంత క్షేత్ర కొలతలతో దాదాపు 15 సంవత్సరాలుగా అధిక-రిజల్యూషన్ తో తీసిన చిత్రాలను కూడా ఏఐకి అనుసంధానించారు. దీంతో ఏఐ పని మరింత సులభం అవుతోంది.