ఒకప్పుడు 1000 mAh బ్యాటరీ అంటే అబ్బో అనేవారు. అది కాస్తా 2000, 3000 కి పెరిగింది. కేవలం వాట్సప్ మాత్రమే ఉపయోగించే రోజుల్లో బ్యాటరీకి ఆ పవర్ సరిపోయేది. కానీ ఇప్పుడు ఇన్ స్టా సహా సోషల్ మీడియా వాడకం బాగా ఎక్కువైంది. ఇక గేమింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అందుకే ఎంత పవర్ ఫుల్ బ్యాటరీ ఉన్నా కుర్రకారుకి సరిపోవడం లేదు. రోజుకోసారి అయినా సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టాల్సి వస్తుందని విసుక్కునేవారు కూడా ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ సెల్ ఫోన్. రోజంతా సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టకపోయినా పని చేస్తుంది. ఆ మాటకొస్తే 50 గంటల నాన్-స్టాప్ స్ట్రీమింగ్ ని కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
15,000 mAh బ్యాటరీ
ఇప్పటి వరకు టాప్ మోస్ట్ బ్యాటరీ అంటే 7,000 mAh అని చెప్పుకోవాలి. పోకో, రియల్ మి ఈ తరహా మారథాన్ బ్యాటరీలను పరిచయం చేశాయి. పోకో F7 లో 7,500 mAh యూనిట్, రియల్ మి GT7 లో 7,000 mAh బ్యాటరీ లు ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు కూడా భారీ బ్యాటరీలతో సిద్దమయ్యాయి. ఈ ఏడాది రియల్ మి 10,000 mAh ని కూడా పరిచయం చేసింది. అయితే వాటన్నిటినీ వెనక్కు నెడుతూ రియల్ మి కంపెనీయే సరికొత్త బ్యాటరీని తెస్తోంది. దాని పవర్ 15,000 mAh. ఇప్పటి వరకు వచ్చిన సెల్ ఫోన్లలో ఇదే అత్యథిక బ్యాటరీ పవర్. అయితే రియల్ మి కంపెనీ అధికారికంగా దీన్ని పరిచయం చేయలేదు. ఒక స్మార్ట్ ఫోన్ మోడల్ ని పరిచయం చేసే క్రమంలో దాని వెనక 15,000 mAh బ్యాటరీ ఉన్నట్టుగా స్టిక్కర్ ఉంది. దాన్ని బట్టి రియల్ మి తాజా మోడల్ 15,000 mAh బ్యాటరీతో నడుస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు గేమింగ్ మొబైల్స్ కి ఈ ఫెసిలిటీ ఇచ్చాయి కానీ, అధికారికంగా అందరికీ అందుబాటులో ఉండే ఫోన్ ని విడుదల చేయాలనుకోవడం మాత్రం ఇదే తొలిసారి.
కొత్తగా విడుదల చేసే స్మార్ట్ ఫోన్ టీజర్‌లో, రియల్ మి 50 గంటల నాన్-స్టాప్ స్ట్రీమింగ్‌ను కూడా పేర్కొనడం విశేషం. 50 గంటల నాన్ స్టాప్ స్ట్రీమింగ్ అంటే మాటలు కాదు. ఇప్పటి వరకు ఇదే హయ్యస్ట్ స్ట్రీమింగ్. ఈ ఫీచర్స్ అన్నీ అందుబాటులోకి వస్తే ఇక దీన్ని కొట్టే ఫోన్ ఇప్పటి వరకు లేదనే చెప్పాలి. టెక్నాలజీలో మార్పు వచ్చేకొద్దీ కొత్త ఫీచర్లు వచ్చేస్తున్నాయి. అయితే ఈ ఫీచర్లకోసం మనం అధిక ధర చెల్లించాల్సిందే. ఎక్కువసేపు వచ్చే బ్యాటరీ కోసం న్యూ జనరేషన్ ఆ మాత్రం ఇన్వెస్ట్ మెంట్ పెట్టేందుకు రెడీగానే ఉంది. అందుకే సెల్ ఫోన్ కంపెనీలు కొత్త ఫీచర్లతో వచ్చేస్తున్నాయి.
మారథాన్ బ్యాటరీ అంటే దానికి తగ్గ సపోర్టింగ్ చార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉండాలి. 15,000 mAh బ్యాటరీకోసం 320W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని అందుబాటులోకి తెస్తోంది రియల్ మి. ఈ కంపెనీ ఇప్పటికే 320W “సూపర్సోనిక్ ఛార్జర్”ని విడుదల చేసింది. ఇది నాలుగు నిమిషాల్లో 0 నుండి 100 శాతం వరకు 4,420 mAh బ్యాటరీకి చార్జింగ్ ఇస్తుంది. 15,000 mAh కంటే పెద్ద బ్యాటరీని అనుకున్న టైమ్ కి రీఛార్జ్ చేయాలంటే ఇలాంటి ఛార్జింగ్ టెక్నాలజీయే ఉండాలి.