Stray Dogs: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు మరోసారి పంజా విసిరాయి. బుధవారం సాయంత్రం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ముగ్గురు చిన్నారులు రక్తసిక్తమయ్యారు. తారకరామ్‌నగర్‌కు చెందిన సందెల రాహుల్‌కుమార్, శ్రావణి దంపతుల నాలుగేళ్ల కుమారుడు ప్రియాన్ష్ ఇంటి ముందు ఆడుకుంటుండగా, రెండు వీధి కుక్కలు ఒక్కసారిగా అతడిపై విరుచుకుపడ్డాయి. ఈ దాడి ఎంత భీభత్సంగా సాగిందంటే, ఒక కుక్క బాలుడి ముఖంపై దాడి చేసి ఏకంగా కనుగుడ్డును బయటకు పీకేసింది. చిన్నారి ఆర్తనాదాలు విని కుటుంబ సభ్యులు వచ్చేలోపే జరగకూడని నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం ఆ చిన్నారి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.
అదే సమయంలో పట్టణంలోని ఆర్‌బీ నగర్‌లోనూ కుక్కలు భయోత్పాతాన్ని సృష్టించాయి. రోడ్డుపై వెళ్తున్న అగర్వాల్, తన్విష్ అనే ఆరేళ్ల ఇద్దరు బాలురను వెంబడించి మరీ వేటాడాయి. తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా వారి కాళ్లపై తీవ్రంగా కరిచి గాయపరిచాయి. గాయపడిన చిన్నారులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం వారు కూడా హైదరాబాద్‌కు తరలివెళ్లాల్సి వచ్చింది. ఒకే రోజు వరుసగా జరిగిన ఈ దాడులతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ ఘోర కలికాలంపై స్థానికులు పురపాలక అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నా, అవి చిన్నారుల ప్రాణాల మీదకు వస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా శాశ్వత పరిష్కారం చూపకపోవడం వల్లే నేడు ఒక చిన్నారి కంటి చూపు కోల్పోయే పరిస్థితి వచ్చిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బెడద నుండి తమ పిల్లలను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: భార్యని నడి రోడ్డుపై చావబాదాడు.. కారు నుంచి బయటకు తోసి, ఆ తర్వాత
జనావాసాల్లో కుక్కల నియంత్రణకు యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టెరిలైజేషన్ (సంతానోత్పత్తి నియంత్రణ) ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, ప్రమాదకరంగా మారిన కుక్కలను గుర్తించి వాటిని జనావాసాలకు దూరంగా తరలించాలని బాధితుల కుటుంబాలు కోరుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.