Sarpanch Election: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.
వివరాల్లోకి వెళ్తే.. లింగంపల్లిలో గత కొన్నిరోజులుగా పంచాయతీ ఎన్నికల ప్రచారం ఉత్కంఠగా సాగుతోంది. రెండు ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుచరులు గ్రామంలో ప్రచారం పేరుతో పదే పదే తగువులు పెట్టుకుంటున్నట్లు సమాచారం.
నిన్న రాత్రి బీఆర్ఎస్ కార్యకర్తలపై పెద్ద సమూహంగా వచ్చి.. సుమారు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆకస్మికంగా దాడి చేసినట్లు చెబుతున్నారు. కర్రలు, రాళ్లు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య మృతి చెందగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్ తోపాటు 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున మొహరించారు.
Also Read: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో ముగ్గురు మృతి
కాగా సూర్యాపేట జిల్లాలో తొలి విడతలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యాపేట, ఆత్మకూరు, నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి ఈ ఎనిమిది మండలాలలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికల ప్రచార సమయం ముగిసింది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ నర్సింహ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడాది ఇదే గ్రామంలో మాజీ సర్పంచ్ హత్యకు గురైన తరుణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయినా మరో హత్య జరగడం తీవ్ర కలకలం రేపింది. మొదటి విడత ఎన్నికల జరగనున్న మండలాల్లో 1500 మంది పోలీస్ సిబ్బందితో ఎన్నికలకు ఐదు అంచల పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.