Ministers Whats App: తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులు వరుసగా హ్యాక్ అయ్యాయి. సైబర్ నేరగాళ్లు పలువురి మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపుల్లో ఎస్‌బీఐ కేవైసీ పేరిట ఏపీకే ఫైల్స్‌ను సైబర్ నేరగాళ్లు షేర్ చేస్తున్నారు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తూ మంత్రులకు ఎస్బీఐ పేరిట మెసేజ్‌లు పంపుతున్నారు. ఆ ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
ఇటీవల కాలంలో హ్యాకింగ్ ఘటనలు ఎక్కువయ్యాయి. రాజకీయ నేతలు, పార్టీలను లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ కు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రులకు సంబంధించిన మీడియా వాట్సాప్ గ్రూపులు హ్యాక్ చేశారు. వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డీపీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగోతో అప్డేట్ చేశారు. గ్రూప్ పేరుతో పాటు ఆ వ్యక్తుల పర్సనల్ వాట్సాప్ అకౌంట్ పేరు వివరాలను ఎస్బీఐ వివరాలుగా మార్చి గ్రూప్ సభ్యులను ఏమార్చే ప్రయత్నం చేస్తు్న్నారు.
మంత్రుల వాట్సాప్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు స్టేట్ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ అప్డేట్ చేయలేదని, ఈ-కేవైసీ పూర్తి చేయలేదని, మీ బ్యాంక్ అకౌంట్ ఈరోజు రాత్రి నుంచి పర్మినెంట్ గా బ్లాక్ అవుతుందని మెసేజ్ లు పంపుతున్నారు. ఈ ఏపీకే ఫైల్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చని నమ్మిస్తున్నారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయగానే వ్యక్తిగత సమాచారం సేకరించి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్ లలో వచ్చిన లింక్స్, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దని, డౌన్ లోడ్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: APK File Scam: మీకు ఈ మెసేజ్ వచ్చిందా? వెంటనే 15531కు కాల్ చేయండి
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే నెంబర్లు, బ్యాంకు నుంచి చేస్తున్నట్లుగా వచ్చే మెసేజ్ లను పూర్తిగా గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. తొందరపడి అలాంటి లింక్స్ క్లిక్ చేయవద్దని కోరారు. ఏపీకే ఫైల్స్ ను పొరపాటున క్లిక్ చేస్తే ఆ సమయంలో బ్యాంక్ అకౌంట్లు, యూపీఐ యాప్స్ లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం అసలు చేయవద్దని సూచించా రు. ఇటీవల డిజిటల్ అరెస్టులు, ఆధార్, పాన్ అప్డేట్, ఈ కేవైసీల పేరుతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.