Jagtial Crime: జగిత్యాల జిల్లాలో దారుణ విషాదం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం పది నెలల క్రితం బహ్రెయిన్ కు వలస వెళ్లిన జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు తన పుట్టినరోజు నాడే మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అనుమాండ్ల కల్యాణ్ (26) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా అతని రూమ్‌మేట్స్ తల్లిదండ్రులకు సమాచారం అందించగా.. ఈ మృతిపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల ప్రాంతానికి చెందిన కల్యాణ్ మెరుగైన జీవితం కోసం దాదాపు 10 నెలల క్రితం గల్ఫ్ దేశమైన బెహరాన్‌కు వెళ్ళాడు. అక్కడ అతను కార్ వాష్ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, వచ్చే జీతం సరిపోకపోవడంతో మెరుగైన ఉద్యోగం కోసం వీసా మార్పు నిమిత్తం ఏజెంట్‌కు డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది. దురదృష్టవశాత్తూ.. వీసా ఇవ్వకుండా మోసం చేయడంతో కల్యాణ్ గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు అతని తల్లి వెల్లడించారు. ఈ ఆర్థిక ఇబ్బందులు, మోసంతో కలిగిన ఒత్తిడి కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని రూమ్‌మేట్స్ చెబుతున్నారు.
అయితే, ఈ సంఘటనపై కల్యాణ్ కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం తన జన్మదినం సందర్భంగా కల్యాణ్ తన కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా మాట్లాడాడని.. ఎలాంటి దిగులు తమకు కనిపించలేదని వారు వాపోతున్నారు. ఆనందంగా మాట్లాడిన మరుసటి రోజే ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త అబద్ధం కావొచ్చని.. దీని వెనుక ఏదైనా కుట్ర ఉండి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ రోజు ఉదయం కల్యాణ్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పుట్టినరోజు మరుసటి రోజే ఆత్మహత్య చేసుకోవడంతో తమ కొడుకు మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం బెహరాన్‌లో ఉన్న కల్యాణ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి.. అలాగే అతని మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు. ఆర్థిక మోసం, వలస కష్టాల కారణంగానే కల్యాణ్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడా లేక దీని వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
ALSO READ: Leopard Attack on Police: పరిగెత్తించి.. కిందపడేసి పోలీసుపై చిరుత దాడి.. చివరికి ఏం జరిగిందంటే!