ఎన్నో ఆశలు రేకెత్తించింది..
కలిసి బతుకుదామన్నది..
నమ్మించింది.. నీతోనే జీవితమన్నది..
కానీ పెళ్లైన నెల రోజులకే భర్త శవమయ్యాడు..
గద్వాల దారుణ ఘటన వెనుక జరిగిందేంటి?
తేజేశ్వర్ భార్య 2 వేల సార్లు ఎవరికి ఫోన్ చేసింది?
ఈ షాకింగ్ క్రైమ్ స్టోరీ వెనుకున్న మ్యాటర్ ఏంటి?
ప్రతి 32 గంటలకు భర్తను చంపుతున్న భార్య
ప్రతి 32 గంటలకు ఒక భార్య తన భర్తను చంపుతోంది. మనదేశంలోనే ఇది జరుగుతోంది. నమ్మలేకపోయినా ఇదే నిజం. 2025లో ఈ హనీమూన్ మర్డర్స్ మరింతగా పెరిగాయి. భర్తల్ని నమ్మించి నట్టేట ముంచేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. వివాహ బంధాన్నే ప్రశ్నిస్తున్నాయి. ఒక హనీమూన్, ఒక సీక్రెట్ లవర్, ఒక ప్లాన్డ్ మర్డర్.. ఇవి సినిమాలు కాదు. నిజ జీవితంలో జరిగిన యదార్థ ఘటనలు. ఇందులో ఒకటి గద్వాలలో జరిగింది.
ప్రేమ మరణాన్ని ఎందుకు కోరుకుంది?
ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరి పేర్లు తేజేశ్వర్, ఐశ్వర్య. అబ్బాయి ఊరు గద్వాల. అమ్మాయిది కర్నూల్. తేజేశ్వర్ ప్రైవేట్ లైసెన్డ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి కర్నూల్‌లోని కల్లూరు ఎస్టేట్‌కు చెందిన ఐశ్వర్యతో గతంలోనే పెళ్లి కుదిరింది. ఫిబ్రవరి 13న మ్యారేజ్ జరగాల్సి ఉండగా.. సరిగ్గా ముహూర్తం టైమ్ లో ఐశ్వర్య కనిపించలేదు. దీంతో అప్పట్లో పెళ్లి ఆగిపోయింది. సీన్ కట్ చేస్తే కొన్ని రోజులకు మళ్లీ ఐశ్వర్య సీన్ లోకి వచ్చింది. తేజేశ్వర్ కు ఫోన్ చేసింది. మళ్లీ నమ్మించింది. ఈ సారి పక్కాగా పెళ్లి చేసుకుంటానన్నది. కానీ ఈసారి తేజేశ్వర్ కుటుంబీకులు ఈ పెళ్లికి అడ్డు చెప్పారు. అయినా వినకుండా మే 17న బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. గద్వాలలో కాపురం పెట్టారు. అంతా బాగుందనుకున్న టైంలో కథలో ట్విస్ట్.
గద్వాల దారుణ ఘటన వెనుక జరిగిందేంటి?
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 17న తేజేశ్వర్‌కు ఫోన్ చేసి పొలం సర్వే చేసే పని ఉందని చెప్పు కారులో తీసుకెళ్లారు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తేజేశ్వర్ బ్రదర్ ఈనెల 17న గద్వాల పోలీసులకు కంప్లైంట్ చేశాడు. విచారణలో భాగంగా పోలీసులు తేజేశ్వర్ భార్య ఐశ్వర్య కాల్‌డేటాను పరిశీలించారు. దీంతో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. తిరుమలరావు అనే వ్యక్తికి ఏకంగా 2 వేల సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు. తేజేశ్వర్ ను తీసుకెళ్లిన వారు పూడూరు, అనంతపురం, ఎర్రవల్లి, బీచుపల్లి ప్రాంతాల్లో తిప్పి, ఎర్రవల్లి చౌరస్తాకు రాగానే ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసి పాణ్యంకు తీసుకెళ్లారు. అక్కడి సుగాలిమెట్టు ప్రాంతంలో తేజేశ్వర్‌ను హత్య చేసి డెడ్‌బాడీని పిన్నాపురం చెరువులో పడేశారు. ఈనెల 21న డెడ్ బాడీ గుర్తించారు. తేజేశ్వర్ ను చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఐశ్వర్య ఏం చేసిందన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కచ్చితంగా ఈ హత్య ఐశ్వర్య, ఆమె తల్లి, తిరుమలరావు అనే బ్యాంక్ మేనేజర్ చేయించారని తేజేశ్వర్ కుటుంబీకులు అంటున్నారు.
ఒక నమ్మకం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివాహేతర సంబంధం ఉంటే ఎందుకు పెళ్లి చేసుకుందని, ఎందుకు చంపించడం అని తేజేశ్వర్ కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు.
రాజా రఘువంశీ, సోనమ్ చూడముచ్చటైన జంట
ఇక్కడ కనిపిస్తున్న ఈ జంట రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ. చూడముచ్చటైన జంట. ఊరు ఇండోర్. ఈ ఏడాది మే 11న పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్ని రోజులకే మేఘాలయలోని సోహ్రాకు హనీమూన్ కోసం వెళ్లారు. జూన్ 2న రాజా డెడ్ బాడీ వెయ్ సావ్‌డాంగ్ వాటర్ ఫాల్స్ సమీపంలోని లోయలో కనిపించింది. శరీరంపై కత్తితో పొడిచిన గాయాలున్నాయి. దర్యాప్తు ఎంతకీ తెగలేదు. ఎవరు మర్డర్ చేశారు.. ఎందుకు చేశారు పోలీసులైతే తలలు పట్టుకున్నారు. వీరి సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్. మర్డర్ జరిగింది మేఘాలయలో. సో ఎంక్వైరీకి చాలా టైం పట్టింది. కానీ చివరకు సోన్ దొరికిపోయింది. తన లవర్ రాజ్ కుశ్వాహాతో కలిసి ఈ హత్యను ప్లాన్ చేసిందని గుర్తించారు. ముగ్గురికి సుపారీ ఇచ్చి మర్డర్ చేయించినట్లు తేల్చారు. మరొకరితో సంబంధం ఉంటే, ఎందుకు పెళ్లి చేసుకున్నారు? రాజాను ఎందుకు పొట్టనపెట్టుకున్నారని అతడి సోదరి ప్రశ్నించింది.
మీరట్ లో ముస్కాన్, సౌరభ్ రాజ్ పుత్ పెళ్లి
ఇది సోనమ్ ఒక్క కేసుతోనే ముగియలేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇప్పుడైతే మరింతగా పెరుగుతున్నాయి కూడా. యూపీ మీరట్ లో ముస్కాన్ చేసిన పనైతే సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు ముస్కాన్, సౌరభ్ రాజ్ పుత్. సౌరభ్ నేవల్ ఆఫీసర్. కానీ ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి ముస్కాన్.. ఏకంగా కట్టుకున్న భర్తను కడతేర్చింది. సిమెంట్ నింపిన డ్రమ్‌లో డెడ్ బాడీని కుక్కేశారంటే ఎంత దారుణంగా చంపారో అర్థం చేసుకోవచ్చు. ముస్కాన్, సాహిల్ ఇద్దరూ గతంలో క్లాస్ మేట్స్. పూర్వ విద్యార్థులంతా పెళ్లికి ముందు కలుసుకున్నారు. అప్పుడే ముస్కాన్, సాహిల్ దగ్గరయ్యారు. పెళ్లయ్యాక కూడా ఆ బంధాన్ని కంటిన్యూ చేశారు. సౌరభ్ ను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. చంపేశారంతే.
సాంగ్లీలో భర్తను చంపిన 27 ఏళ్ల రాధికా ఇంగ్లే
మహారాష్ట్ర సాంగ్లీలో 27 ఏళ్ల రాధికా ఇంగ్లే, తన 54 ఏళ్ల భర్త అనిల్ తనాజీని వివాహం జరిగిన మూడు వారాల్లోనే గొడ్డలితో చంపింది. బిహార్ బెగుసరాయ్ లో 25 ఏళ్ల రాణి, తన భర్త మహేశ్వర్ రాయ్‌ను చంపింది. భివానీలో యూట్యూబర్ రవీనా, తన భర్త ప్రవీణ్‌ను, లవర్ సురేశ్ తో చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. పై రెండు కేసుల్లో భార్యలు సోషల్ మీడియాలో రీల్స్ పెట్టొద్దు అన్నందుకు చంపేశారు. బిజ్నోర్‌లో శివానీ అనే వివాహిత తన భర్త మరణాన్ని గుండెపోటుగా సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించినా, పోలీసులు గొంతుపై గాయాలను గుర్తించారు. హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. సో ఈ కేసులన్నీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వివాహ సంబంధాలపై పెద్ద చర్చను తెరపైకి తెచ్చాయి. 2022లో ఒక రిపోర్ట్ ప్రకారం ప్రతి 32 గంటలకు ఒక భార్య తన భర్తను చంపిన కేసు నమోదైంది. మొత్తం 271 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఇందులో 218 కేసులు వివాహేతర సంబంధాలతో జరిగినవే.
తాగివచ్చి శారీరకంగా హింసించడంతో మరికొందరి హత్య
వివాహేతర సంబంధాలతోనే చాలా కేసుల్లో భార్యలు తమ లవర్స్ తో కలిసి హత్యలు చేశారు. ఇంకొన్ని సందర్భాల్లోభర్తలు శారీరకంగా లేదా మానసికంగా ఇబ్బందులు పెట్టడం, రోజూ తాగి వచ్చి కొట్టడం, తిట్టడం, కుటుంబాన్ని, పిల్లలను పట్టించుకోకపోవడం వంటి ఘటనలతో విసిగిపోయి భార్యలు హత్యలు చేశారు. సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా ఇలాంటి జాడ్యాలు పెరగడానికి కారణమవుతోంది. రాణి, రవీనా కేసుల్లో రీల్స్ పిచ్చి భర్తలను చంపేదాకా దారి తీశాయి. కొన్ని కేసుల్లో బీమా, డబ్బులు లేదా ఆస్తి కోసం హత్యలు జరిగాయి.
వివాహేతర సంబంధాలు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి
వివాహేతర సంబంధాలు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. టెంపరరీ బంధాల కోసం శాశ్వత సంబంధాలను దూరం చేసుకుంటున్నారు. లవర్స్ తోనే జీవితం గడపాలనుకుంటున్న వాళ్లు పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటున్నారు.. ఎందుకు భర్తలను చంపుతున్నారు అన్న ప్రశ్నలకు సరైన జవాబు ఉండట్లేదు. తాత్కాలిక నిర్ణయాలా.. లేదంటే వ్యామోహమా.. పరిణతితో ఆలోచించకపోవడమా.. ఇవే తేలాల్సిన విషయం. సోనమ్-రాజా రఘువంశీ దగ్గర్నుంచి గద్వాలలో లేటెస్ట్ గా ఐశ్వర్య-తేజేశ్వర్ ఘటన దాకా ఇలాంటివే రిపీట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ టాపిక్ పై చాలానే చర్చ జరిగింది. ఇలాంటి వాళ్లు చేసిన నమ్మకద్రోహంతో వివాహ బంధం, భార్యా భర్తల మధ్య విశ్వాసం కూడా పోతుందన్నారు.
ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా కీలకం
సమాజంలో ఇలాంటి ధోరణలు పెరగొద్దంటే ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా కీలకం అంటున్నారు. ఏదైనా విషయం చూడగానే, పాత స్నేహితులను కలవగానే ఓవర్ రియాక్ట్ కావడం, అతిగా ఊహించుకోవడం, అనైతిక బంధానికి దగ్గరవడం, ఇవన్నీ కీలకంగా ఉంటాయి. సో భావోద్వేగాల్ని నియంత్రించుకోవాలంటున్నారు సైకియాట్రిస్టులు. సమాజంలో ఎలా ఉండాలి.. ఎలా ఉండొద్దు.. ఆరోగ్యకర సత్సంబంధాలు ఎలా మెయింటేన్ చేయాలి ఇలాంటి వాటిపై అవగాహన కల్పించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఎలా చిన్నాభిన్నం చేస్తాయో తెలిపేలా, అందరికీ కనువిప్పు కలిగేలా షార్ట్ ఫిల్మ్స్ ను సోషల్ మీడియాల్లో, థియేటర్లలో ప్రదర్శించాలన్న సూచనలు వస్తున్నాయి.
సో బీ అలర్ట్, బీ అవేర్. బీ ఎడ్యుకేట్.
ఈ వరుస ఎపిసోడ్ లలో భర్తల్ని చంపిన భార్యలు ఏం సాధించారు? ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుని ఏం బాగుపడ్డారు? అసలు వేరే సంబంధాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకునేదాకా ఎందుకు వెళ్లారు..? పోనీ చేసుకున్నాక ఎందుకు మారలేదు? మారకపోయినా సరే భర్తను చంపి సమాజంలో ఎలా బతకొచ్చు అనుకున్నారు? భర్తను సుపారీ ఇచ్చి చంపితే గుర్తు పట్టలేరు అనుకున్నారా? తాత్కాలికంగా వెంట వచ్చే వ్యక్తులతో శాశ్వతంగా జీవితం సాధ్యమని నమ్మారా? విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకుంటే సమాజంలో గౌరవప్రదం. అదే చంపితే హంతకులు అవుతారు. ఇది పురుషుడికైనా, మహిళకైనా వర్తించే విషయం. సో బీ అలర్ట్, బీ అవేర్. బీ ఎడ్యుకేట్.