Kamareddy Incident: మహిళా దినోత్సవం వేళ సభ్య సమాజం తలదించుకునేలా కామారెడ్డి పట్టణంలో ఒక ఘోరం చోటుచేసుకుంది. ఆర్బీ నగర్‌కు చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి తన ముగ్గురు ఆడపిల్లలను అత్యంత క్రూరంగా హతమార్చాడు. తినుబండారాలు కొనిస్తానని నమ్మబలికి, ఆటోలో బయటకు తీసుకెళ్లిన తండ్రి.. వారిని తిరిగి రాని లోకాలకు పంపాడు. పట్టణంలోని పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లి, కనికరం లేకుండా ముగ్గురు చిన్నారులను నీటిలోకి తోసి ఊపిరి తీశాడు.
అనుమానాస్పద నాటకం..
అయితే పిల్లలను హత్య చేసిన అనంతరం ఏమీ తెలియనట్లుగా ఇస్మాయిల్ ఇంటికి చేరుకున్నాడు. తన పిల్లలు కనిపించడం లేదంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఒక కట్టుకథ అల్లాడు. దీంతో పిల్లల అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన అధికారులు, ప్రాథమిక విచారణలో తండ్రి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా, ఇస్మాయిల్ చేసిన పాపం బయటపడింది. తానే స్వయంగా పిల్లలను చెరువులో తోసి చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
వెలికి తీసిన మృతదేహాలు..
నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. అయాత్ (7), మరియం (5), సీఫల్ (8) అనే ముగ్గురు చిన్నారుల మృతదేహాలను చెరువు నుంచి వెలికి తీశారు. అల్లారుముద్దుగా పెరగాల్సిన పసిపిల్లలు విగతజీవులుగా పడి ఉండటం చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల దర్యాప్తు..
ఈ దారుణానికి గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలా లేక ఆర్థిక ఇబ్బందులా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఆడపిల్లలనే కారణంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: గోదావరి జిల్లాలో దారుణం.. ముస్తాబవ్వాల్సిన పెళ్లి కూతురు శవమై కనిపించింది, అసలు మేటరేంటి?
మరో ఇద్దరు చిన్నారుల అదృశ్యం..
ఇదే సమయంలో గోసంగి కాలనీలో మరో ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకే రోజు పట్టణంలో ఇన్ని విషాదాలు చోటుచేసుకోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మిస్ అయిన ఆ ఇద్దరు పిల్లల ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
చిన్నారుల మిస్సింగ్ కేసులో విషాదం
కామారెడ్డి పెద్ద చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యం
సొంత తండ్రి ఇస్మాయిల్ తన కుమార్తెలను చెరువులో పడేసినట్లు గుర్తింపు
Three children’s bodies were found in the Pedda Cheruvu in Kamareddy. https://t.co/lr3jMXxMVm pic.twitter.com/C52FKXItc6
— BIG TV Breaking News (@bigtvtelugu) March 7, 2026