Kamareddy: కామారెడ్డి పట్టణంలోని అయ్యప్పనగర్ కాలనీలో నివసించే రమేష్, అర్చన దంపతుల కుమార్తె క్రితార్స (2) గత నెల 25న కుక్కకాటుకు గురైంది. చికిత్సలో భాగంగా స్థానిక ప్రభుత్వ బోధనాసుపత్రిలో ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించారు. ఆదివారం మధ్యాహ్నం మూడవ డోస్ టీకా వేయించుకుని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పల్స్ పడిపోయిందని వైద్యులు చెప్పడంతో తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మరణించిందని వైద్యులు ధృవీకరించారు.
వైద్యుడి నిర్లక్ష్యం.. చిన్నారి బలి
ఆరోగ్యంగా ఉన్న చిన్నారి ఇంజక్షన్ వేసిన రెండు గంటల్లోనే మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న వైద్యుడి నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితుల నిరసనతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
పోలీసులు కేసు..
చిన్నారి తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ నరహరి కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్‌పై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారి మరణానికి గల అసలు కారణాలను విశ్లేషించేందుకు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read: అన్యాయం చేస్తారా.. తిరగబడ్డ జన సైనికులు
వైద్యుల వివరణ
ఈ ఘటనపై బోధనాసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. సాధారణంగా కుక్కకాటు వ్యాక్సిన్ల వల్ల ప్రాణాపాయం జరగదని అభిప్రాయపడ్డారు. చిన్నారి మరణానికి గల ఖచ్చితమైన కారణాలు కేవలం శవపరీక్ష (Post-mortem), సమగ్ర విచారణ తర్వాతే తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. వైద్యుల వైపు నుంచి ఏదైనా లోపం జరిగిందా లేదా అనే విషయాన్ని నిష్పక్షపాతంగా విచారిస్తామని తెలిపారు.