Shamli News: అక్రమ సంబంధాలు పచ్చని కాపురంలో చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా భర్తలను ప్లాన్ చేసి మరీ చంపేస్తున్నారు భార్యలు. తాజాగా యూపీలోని అలాంటి ఘటన ఒకటి జరిగింది. భర్తకు దగ్గరి బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి సరదాలకు అడ్డు వస్తున్నాడని భావించి పక్కాగా ప్లాన్ చేసి చంపేసింది. ఈ కేసులో బాధితుడి వైఫ్ పరారీలో ఉంది. అసలేం జరిగింది?
హర్యానాలోని సోనిపట్‌కు చెందిన ఫర్నిచర్ తయారీదారు షహనవాజ్ యూపీలో నివాసం ఉంటున్నాడు. భార్య మైఫ్రీన్‌తో కలిసి కైరానా ప్రాంతంలో జీవిస్తున్నాడు. షహనవాజ్-మైఫ్రీన్ దంపతులు చూడముచ్చటగా ఉండేవారు. ఒకర్ని విడిచి మరొకరు ఉండేవారు కాదు.
కాకపోతే షహనవాజ్ దగ్గరకు అతడి బంధువు తసవ్వర్ వచ్చేవాడు. వరుసకు తమ్ముడు అవుతాడు. ఆ తర్వాత తసవ్వర్ క్లోజ్ అవ్వడం మొదలైంది. ఒకసారి ఇద్దరు ఏకంతంగా ఉండడం గమనించాడు భర్త షహనవాజ్. ఆ తర్వాత ఇద్దర్నీ మందలించాడు. కానీ మైఫ్రీన్ వెనక్కి తగ్గలేదు. ఏదో విధంగా భర్తను అడ్డు తొలగించుకోవాలని రకరకాలుగా ప్లాన్ వేసేది. ఆమె అనుకున్నది ఒకటైతే మరొకటి జరిగేది.
ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలో షామ్లి జిల్లాలో బావమరిది పెళ్లి కబురు వచ్చింది. ఇందుకోసం ప్లాన్ చేసుకున్నాడు షహనవాజ్. ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకుంది భార్య మైఫ్రీన్. ప్రియుడు తసవ్వర్ కలిసి భర్తను చంపే ప్లాన్ చేసింది.
ALSO READ: టిఫిక్ బాక్స్ తో చిన్నారిపై టీచర్ దాడి, తలకు మూడు కుట్లు పడేలా..
గురువారం ఉదయం భార్యతో కలిసి వాహనంపై వెళ్తున్న షహనవాజ్‌ని అడ్డగించారు కొందరు వ్యక్తులు. ఈలోగా తసవ్వర్ ఎంటరై, షహనవాజ్ కత్తితో పొడిచి చంపేశాడు. లాఠీలతో కొట్టి కత్తితో పలుమార్లు పొడిచారు. నిందితుల్లో ఒకడు తుపాకితో కాల్చినట్టు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి వారంతా పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన షహనవాజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు చెప్పారు.
ఈ ఘటనపై మైఫ్రీన్ కైరానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి కోసం వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దారి కాసి చంపేశారని కొత్త స్కెచ్ వేసింది. లక్షన్నర కరెన్సీ నోట్లతో చేసిన దండ కనిపించ లేదని ఫిర్యాదు చేసింది. ఆ ప్రాంతంలో బైక్ కనిపించకపోవడంతో దోపిడీ కోసం జరిగిన హత్యగా పోలీసులు భావించారు. జాగ్రత్తగా వెతుకుతుండగా సమీపంలో బైక్‌ను గుర్తించారు. దోపిడీ కాదని డిసైడ్ అయ్యారు.
చివరకు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. షహనవాజ్ భార్య మైఫ్రీన్, ఆమె ప్రియుడు తసవ్వర్ కలిసి హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో తసవ్వర్, మరొక నిందితుడ్ని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. షహనవాజ్ భార్య మైఫ్రీన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.