UP Boy Incident: రుచికి బానిసైన అమాయకత్వం.. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడవ తరగతి చదువుతున్న ఒక బాలుడికి ‘మోమోస్’ అంటే విపరీతమైన ఇష్టం. ఆ పిల్లాడికున్న ఈ బలహీనతను ఆసరాగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు, అతడిని ఒక ప్రమాదకరమైన ఉచ్చులోకి లాగారు. కేవలం కొన్ని ప్లేట్ల మోమోల కోసం ఆ పిల్లాడు తన ఇంట్లోని విలువైన సంపదను పణంగా పెట్టాల్సి వస్తుందని ఊహించలేకపోయాడు.
కేటుగాళ్ల కుట్ర.. ఉచిత మోమోల ఆశ
స్థానిక మోమోస్ దుకాణానికి తరచూ వచ్చే ఆ బాలుడి జిహ్వచాపల్యాన్ని గమనించిన ముగ్గురు వ్యక్తులు ఒక దుర్మార్గపు పథకం వేశారు. “నీకు ఎన్ని మోమోస్ కావాలన్నా ఉచితంగా ఇస్తాం, కానీ ప్రతిఫలంగా మీ ఇంట్లో ఉన్న బంగారు నగలను మాకు తెచ్చివ్వాలి” అని ఆ పిల్లాడిని నమ్మబలికారు. తిండిపై ఉన్న మక్కువతో ఆ బాలుడు ఆ దొంగల మాయమాటలకు లోబడి, ఇంట్లో ఎవరికీ తెలియకుండా నగలను చేరవేయడం మొదలుపెట్టాడు.
గుట్టురట్టైన వైనం..
చాలా కాలంగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగింది. అయితే, ఇటీవల ఆ బాలుడి అత్తా ఇంటికి వచ్చింద.. ఒక శుభకార్యం కోసం నగలు అవసరం పడటంతో అసలు విషయం బయటపడింది. కుటుంబ సభ్యులు బీరువా తెరిచి చూడగా, దాదాపు రూ. 85 లక్షల విలువైన ఆభరణాలు కనిపించకుండా పోవడంతో వారు షాక్‌కు గురయ్యారు. ఆందోళనతో పిల్లాడిని నిలదీయగా, మోమోస్ కోసం తాను చేసిన పనిని నిదానంగా బయటపెట్టాడు.
పోలీసుల రంగప్రవేశం
అరెస్టులు వారణాసిలోని ఒక ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న బాలుడి తండ్రి విమ్లేష్ మిశ్రా వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారీ దోపిడీకి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి, ఈ దోపిడీకి పాల్పడిన ఒక యువతితో పాటు మరో యువకుడిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కొంత సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Also Read: విషాదం.. అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి పడి బాలిక మృతి..
తల్లిదండ్రులకు హెచ్చరిక
ప్రస్తుతం ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కేవలం ఒక చిరుతిండి కోసం ఇంత భారీ మొత్తంలో ఆస్తిని పోగొట్టుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పిల్లల ఆహారపు అలవాట్లు, వారి స్నేహాలు, ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని, ముఖ్యంగా ఖరీదైన వస్తువుల పట్ల వారికి అవగాహన కల్పించాలని సామాజిక నిపుణులు ఈ ఘటన ద్వారా హెచ్చరిస్తున్నారు.