VNR College Student Assault Case: స్వేచ్ఛ బ్యూరో: ఇన్ స్టాగ్రాం ద్వారా తాను చదువుతున్న కాలేజీ విద్యార్థినిని ఉచ్ఛులోకి లాగిన యువకుడు కొన్ని నెలలపాటు ఆమెపై అత్యాచారం జరిపిన ఉదంతమిది. ప్రతిఘటించిన ప్రతీసారి పర్సనల్ ఫోటోలను నీ కుటుంబ సభ్యులకు పంపించటంతోపాటు వైరల్ చేస్తానని బెదిరిస్తూ వచ్చిన నిందితుడు ఈ దాష్టికాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. విషయం తెలిసి నిందితుని స్నేహితుడు కూడా బాధితురాలిపై లైంగిక దాడి జరిపాడు. ఈ ఇద్దరు పెడుతున్న హింస అంతకంతకూ పెరిగి పోతుండటంతో భరించలేక పోయిన బాధితురాలు చివరకు విషయాన్ని తల్లికి తెలియచేసింది.
ఈ క్రమంలో ఆమె బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజాంపేట ప్రాంతానికి చెందిన 20ఏళ్ల యువతి బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కాలేజీలో మూడో సంవత్సరం విద్యార్థిని. కాగా, ఇదే కాలేజీలో బీటెక్ మెకానికల్ బ్రాంచ్ లో చదువుతున్న సిర్రా ఆశిష్ తనయ్ (20) ఇన్ స్టాగ్రాం ద్వారా ఆ యువతితో మొదట పరిచయం ఏర్పరుచుకున్నాడు. కొన్నిరోజులు చాటింగులు చేసిన ఆశిష్ ఆ తరువాత యువతి ఫోన్ నెంబర్ తీసుకుని నేరుగా మాట్లాడటం కొనసాగించాడు. 2024, ఆగస్టు 23న ప్రేమిస్తున్నానని ఆమెతో చెప్పాడు. దానికి యువతి అంగీకరించక పోవటంతో ఆమెను ఎమోషనల్ ఒత్తిడికి గురి చేశాడు. నువ్వు లేనిది నేను బతకలేనంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. దాంతో యువతి అదే నెల 29న తప్పనిసరి పరిస్థితుల్లో అతని ప్రేమను అంగీకరించింది.
Also Read: GHMC CRMP-2: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్.. జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం
2024, అక్టోబర్ నెలలో యువతిని కాలేజీలోని వీఎన్ఆర్ వీఐఈటీ (డీ బ్లాక్, రూం నెంబర్ 303)కు తీసుకెళ్లిన ఆశిష్ అక్కడ బలవంతంగా తన కోరిక తీర్చుకున్నాడు. ఆ సమయంలో కాలేజీ సిబ్బంది అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం మెకానికల్ డిపార్ట్ మెంట్ హెడ్ ఆశిష్ ను తన క్యాబిన్ కు పిలిపించుకుని విచారణ కూడా చేశారు. అయితే, ఆశిష్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో మరింతగా రెచ్చిపోయిన ఆశిష్ కాలేజీలో తాళాలు వేసి ఉండే గదుల్లోకి పలుమార్లు యువతిని తీసుకెళ్లి తన వాంఛలు తీర్చుకుంటూ వచ్చాడు. దాంతోపాటు జేఎన్టీయూ మెట్రో స్టేషన్ పరిసరాల్లోని వేర్వేరు హోటళ్లకు తీసుకెళ్లి లైంగిక దాడులు జరిపాడు. గర్భం దాల్చకుండా ఐ పిల్స్ ఇస్తూ వచ్చాడు.
బ్లాక్ మెయిలింగ్ చేయటంతోపాటు డార్క్ వెబ్ నుంచి మత్తు కలిగించే చాక్లెట్లు తెప్పించుకుని వాటిని యువతితో తినిపించి ఆశిష్ అత్యాచారాలకు పాల్పడటం గమనార్హం. చాక్లెట్లు తినగానే రెండు మూడు గంటలపాటు మత్తులో ఉండిపోయేదాన్నని, దానిని అవకాశంగా తీసుకుని ఆశిష్ తనపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. విడిపోవటానికి ప్రయత్నించిన ప్రతీసారి అభ్యంతరకరంగా తీసిన ఫోటోలు, వీడియోలు చూపించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తానని భయపెట్టేవాడని తెలియచేసింది. ఇంటర్న్ షిప్ ఇప్పిస్తానని కడపలోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లిన ఆశిష్ అక్కడ కూడా లైంగిక దాడి చేసినట్టుగా పేర్కొంది.
ఇలా బాధితురాలికి నరకం చూపించిన ఆశిష్ గత ఏడాది ఫిబ్రవరిలో తన స్నేహితుడు ప్రవీణ్ కు ఆమెను పరిచయం చేశాడు. ఆ తరువాత తన హాల్ టిక్కెట్, ఆధార్ కార్డు తీసుకున్న ప్రవీణ్ కూడా తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టుగా బాధితురాలు తెలిపింది. అదే నెల 16న తనను గండిమైసమ్మ ప్రాంతంలోని ఓ హోటల్ కు తీసుకెళ్లిన ప్రవీణ్ తనపై అత్యాచారం జరపటానికి యత్నించినట్టుగా పేర్కొంది. అతి కష్టం మీద అక్కడి నుంచి తాను తప్పించుకున్నానని తెలియచేసింది. ఈ ఇద్దరి వేధింపులు అంతకంతకూ పెరిగిపోవటంతో చివరకు విషయాన్ని తన తల్లికి చెప్పానంది. తన తల్లి విషయాన్ని కాలేజీ ప్రిన్సిపల్ చెన్నకేశవరావుతోపాటు మెకానికల్ డిపార్ట్ మెంట్ హెడ్ కు చెప్పినా వాళ్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించింది. ఫిర్యాదుపై బీఎన్ఎస్ సెక్షన్ 64, 75, 351(2) ప్రకారం కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
Also Read: MP Chamal Kiran Kumar Reddy: రాహుల్ ను విమర్శిస్తే తోలు తీస్తాం.. కేటీఆర్ ఎంపీ చామల ఫైర్