Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ అంటేనే అందరికీ గుర్తొచ్చేది బంగారం. కానీ.. నిజానికి ఈ రోజు బంగారం కొనడం కంటే భక్తితో లక్ష్మీదేవిని పూజించడం అత్యంత ముఖ్యం. చాలా మందికి ఆఫీస్ పనులు, బిజీ లైఫ్ వల్ల పెద్ద పెద్ద వ్రతాలు చేసే టైమ్ ఉండదు. అందుకే.. ఇంట్లోనే తక్కువ సమయంలో, ఎంతో భక్తితో మహాలక్ష్మిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం కొన్ని చిన్న నియమాలు పాటిస్తూ, మనసు పెట్టి పూజ చేస్తే మీ ఇంట్లో సంపద అక్షయం అవ్వడం ఖాయం!
అక్షయ తృతీయ లక్ష్మీ పూజ:
అక్షయ తృతీయ నాడు చేసే పూజకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఏది చేసినా అది ‘అక్షయం’ (ఎప్పటికీ తరగనిది) అవుతుంది. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి కొత్త పనులు మొదలుపెడతారు.
1. పూజకు సిద్ధమవ్వడం ఎలా?
ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా సింహద్వారాన్ని (గుమ్మాన్ని) పసుపు, కుంకుమతో అలంకరించి, మామిడి ఆకుల తోరణం కట్టండి. పూజ గదిలో ఒక చిన్న పీటను వేసి, దానిపై ఎర్రటి వస్త్రం పరచి, లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచండి.
2. సులభమైన పూజా విధానం:
కలశ స్థాపన: ఒక రాగి లేదా వెండి చెంబులో నీరు పోసి, పైన కొబ్బరికాయ ఉంచి కలశాన్ని ఏర్పాటు చేయండి.
దీపారాధన: ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించండి. దీపం జ్యోతిని లక్ష్మీ స్వరూపంగా భావించండి.
అష్టోత్తరం: లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవండి. వీలైతే కనకధారా స్తోత్రం ప్లే చేయండి లేదా చదవండి.
నైవేద్యం: అమ్మవారికి పాయసం లేదా ఏదైనా స్వీట్ నైవేద్యంగా పెట్టండి. ఏమీ లేకపోతే బెల్లం ముక్క పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారు.
3. బంగారం కొనలేకపోతే ఏం చేయాలి?
చాలా మంది బంగారం కొనలేదని ఫీల్ అవుతుంటారు. కానీ అక్షయ తృతీయ నాడు ‘ఉప్పు’ లేదా ‘పసుపు కొమ్ములు’ కొన్నా కూడా బంగారంతో సమానమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతోంది. పూజలో మహాలక్ష్మికి కొన్ని గోమతి చక్రాలు లేదా గవ్వలు సమర్పించడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది.
Also Read: అక్షయ తృతీయ ఏ రోజు? బంగారం ఎప్పుడు కొనాలి? పూర్తి వివరాలు మీకోసం
4. చేయకూడని పొరపాట్లు:
పూజలో ఫలితం దక్కాలంటే ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి.
ఇల్లు చిమ్మడం: పూజ పూర్తయ్యే వరకు ఇంటిని చీపురుతో ఊడ్వకండి. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే సమయంలో చీపురును కంటికి కనిపించకుండా ఉంచాలి.
కోపం/గొడవలు: ఈ రోజు ఎవరి మీద కోప్పడకూడదు. ఇంట్లో గొడవలు జరిగితే లక్ష్మీదేవి ఉండదు.
అప్పు ఇవ్వడం: అక్షయ తృతీయ నాడు ఎవరికీ అప్పు ఇవ్వకండి. మీ చేతిలోని లక్ష్మిని ఇతరులకు ఇచ్చినట్టే అవుతుంది.
తమసం: మాంసాహారం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.
5. దానానికి ప్రాముఖ్యత:
అక్షయ తృతీయ అంటే కేవలం తీసుకోవడం కాదు.. ఇవ్వడం కూడా. ఈ రోజు చలివేంద్రాలకు నీటిని దానం చేయడం, పేదలకు అన్నదానం చేయడం వల్ల మీ ఇంట్లో సంతోషం రెట్టింపు అవుతుంది.