Akshaya Tritiya 2026: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజులలో ‘అక్షయ తృతీయ’ ఒకటి. ‘అక్షయ’ అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. ఈ రోజున చేసే దాన ధర్మాలు, పూజలు లేదా కొనుగోలు చేసే వస్తువుల వల్ల కలిగే పుణ్యం, ఫలితం అక్షయంగా ఉంటుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా.. ఈ రోజున బంగారం కొంటే.. లక్ష్మీదేవి మన ఇంట్లోనే కొలువై ఉంటుందని అందరూ భావిస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడు వస్తోంది? బంగారం కొనడానికి సరైన ముహూర్తం ఏది? వంటి విషయాలను గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అక్షయ తృతీయ 2026: తేదీ , తిథి సమయాలు:
వైశాఖ మాసం శుక్ల పక్షం తదియ నాడే అక్షయ తృతీయ లేదా ‘అఖా తీజ్’ జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 19.. ఆదివారం నాడు వస్తోంది.
తృతీయ తిథి ప్రారంభం: ఏప్రిల్ 19 ఉదయం 10:49 గంటలకు ప్రారంభం అవుతుంది.
తృతీయ తిథి ముగింపు: ఏప్రిల్ 20 ఉదయం 07:27 గంటలకు ముగుస్తుంది.
శాస్త్రాల ప్రకారం ‘ఉదయ తిథి’ని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి.. ఏప్రిల్ 19వ తేదీనే ప్రధానంగా పండుగ జరుపుకోవాలి.
బంగారం కొనడానికి శుభ ముహూర్తం:
అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం అనేది ఒక సెంటిమెంట్‌గా మారిపోయింది. ఈ ఏడాది బంగారం లేదా వెండి కొనడానికి దాదాపు 19 గంటల సమయం అందుబాటులో ఉంది.
బంగారం కొనాల్సిన సమయం: ఏప్రిల్ 19 ఉదయం 10:49 నుంచి ఏప్రిల్ 20 తెల్లవారుజామున 05:51 వరకు బంగారం కొనవచ్చు.
అత్యంత శుభప్రదమైన సమయాలు (చోఘడియా ముహూర్తం):
ఉదయం (అమృత కాలం): 10:49 AM – 12:20 PM
మధ్యాహ్నం (శుభ సమయం): 01:58 PM – 03:35 PM
సాయంత్రం: 06:49 PM – 10:57 PM
అక్షయ తృతీయ విశిష్టత ఏమిటి?
పురాణాల ప్రకారం ఈ రోజుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
యుగాది: కృతయుగం ఈ రోజే ప్రారంభమైందని చెబుతారు.
పరశురామ జయంతి: విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు ఈ రోజే జన్మించారు.
గంగావతరణం: గంగానది భూమికి దిగివచ్చిన రోజు కూడా ఇదే.
అక్షయ పాత్ర: పాండవులకు సూర్యభగవానుడు అక్షయ పాత్రను ప్రసాదించిన రోజు ఇది. దీని వల్ల వనవాసంలో వారికి ఆహార లోటు లేకుండా పోయింది.
ఈ రోజున ఏం చేయాలి?
అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడమే కాదు.. ఆధ్యాత్మికంగా కూడా ఇది ఎంతో గొప్ప రోజు.
లక్ష్మీ-నారాయణ పూజ: ఉదయాన్నే స్నానం చేసి, విష్ణుమూర్తిని , లక్ష్మీదేవిని పూజించాలి. శ్రీ సూక్తం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.
దానాలు: ఈ రోజు చేసే దానం అఖండమైన పుణ్యాన్ని ఇస్తుంది. పేదలకు అన్నదానం చేయడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, వస్త్ర దానం చేయడం వంటివి చాలా మంచిది. ముఖ్యంగా ఎండకాలం కాబట్టి నీటి పాత్రలు, గొడుగులు దానం చేయడం విశేష ఫలితాన్నిస్తుంది.
Also Read; మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తోందా? బాత్‌రూమ్ తలుపులే కారణం కావొచ్చు!
కొత్త ప్రారంభాలు: కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, గృహప్రవేశాలు చేయడానికి లేదా కొత్త ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఈ రోజు అత్యంత అనువైనది.
బంగారం ఎందుకు కొనాలి?
బంగారాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు కొనే బంగారం ద్వారా ఐశ్వర్యం నిరంతరం పెరుగుతూనే ఉంటుందని నమ్మకం. అయితే అందరూ బంగారం కొనలేకపోవచ్చు. అలాంటి వారు కనీసం కొత్త మట్టి కుండ లేదా కొన్ని అక్షింతలైనా కొని పూజలో పెట్టుకోవచ్చు. భక్తితో చేసే ఏ చిన్న పనైనా ఈ రోజు అక్షయ ఫలితాన్ని ఇస్తుంది.