BigTV English

Abirami Temple : దీర్ఘాయుష్షును ప్రసాదించే.. అభిరామి మందిరం..!

Abirami Temple : దీర్ఘాయుష్షును ప్రసాదించే.. అభిరామి మందిరం..!
Abirami Temple

Abirami Temple : భగవంతుడిన పూజించే వారంతా ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యాలనే మూడు కోరికలు కోరుకుంటుంటారు. అయితే.. తమిళనాడులోని అమృత ఘటేశ్వరుడిని దర్శించుకుంటే.. ఈ మూడింటిలోని మొదటిదైన ఆయుర్దాయం తప్పక పెరుగుతుందని భక్తుల విశ్వాసం. యముడి మరణస్థలంగా పేరున్న ఈ గుడిలో రోజూ కనీసం 50 నుంచి 60 షష్టి పూర్తి వేడుకలు, భీమార్థ శాంతి (70 ఏళ్లు నిండిన వారు చేసే పూజ), శతాభిషేకం(80 ఏళ్లు నిండినవారు చేసే పూజ) వంటివి జరుగుతుంటాయి. నాగపట్నం జిల్లాలోని తిరుక్కడయూర్ పట్టణం మైలదుత్తురై కి 22కిమి దూరం, పోరయార్ నుంచి 8కిమి దూరంలో ఉంటుంది. ఈ కోవెలలో పరమేశ్వరుడు ‘అమృత ఘటేశ్వరుడు’ అనే పేరుతో పూజలందుకుంటున్నాడు.


స్థల పురాణం
పాల సముద్రాన్ని చిలికే ముందుగా గణాధిపతి అయిన తనను దేవతలు ఎవరూ పూజించలేదని వినాయకుడికి కోపం వస్తుంది. దీంతో.. అలిగిన వినాయకుడు పాల సముద్రంలోంచి అమృతం పుట్టగానే దానిని దొంగిలించి ఇప్పుడు మూలవిరాట్టు ఉన్న చోట దాచేస్తాడు. దీంతో దేవతలు తమ తప్పును తెలుసుకొని వినాయకుడికి పూజలు చేసి కుడుములు నివేదించగా సంతుష్టుడైన వినాయకుడు అమృత భాండాన్ని దేవతలకు తిరిగిచ్చేస్తాడు. నాడు.. గణపతి అమృత భాండం పెట్టిన చోటనే పరమశివుడు.. స్వయంభువుగా అవతరించాడని, అందుకే ఆయనకు అమృత ఘటేశ్వరుడు అనే పేరొచ్చిందని స్థల పురాణం చెబుతోంది. నాడు అమృతాన్ని కాజేసిన కారణంగా ఈ ఆలయంలోని వినాయకుడిని ‘కల్ల వినాయకర్’ (దొంగ వినాయకుడు) అని పిలుస్తారు.

ఇక.. ప్రధాన శివలింగానికి ఎడమవైపున శివుడి పాదాలను చుట్టుకుని ఉన్న మార్కండేయుడు ఉండగా, శివుని యముడిని శిక్షిస్తున్నట్లు ఉండే ఒక విగ్రహం ఉంటుంది. దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. మృకండు అనే మహర్షి, ఆయన భార్య సంతానం కోసం శివుని గురించి కఠోర తపస్సు చేస్తారు. వీరి తపస్సుకు మెచ్చుకున్న శివుడు.. ‘మీకు పూర్ణాయుష్కుడైన దుష్టుడు కావాలా? లేక సర్వోత్తముడైన 16 ఏళ్లు మాత్రమే ఆయుర్దాయం గల కుమారుడు కావాలా?’ అని అడగగా, వారు 16 ఏళ్లు మాత్రమే జీవించే ఉత్తమ కుమారుడిని ఇవ్వమని కోరతారు.


వారి కోరిక మేరకు వారికి ఒక కుమారుడు కలుగుతాడు. అతడే.. ‘మార్కండేయుడు’. ఆ బాలుడు దినదినాభివృద్ధి చెందుతూ సకల విద్యాపారంగతుడై తల్లితండ్రులకు పేరుతెస్తాడు. కానీ.. అతడికి 16 ఏళ్లు రాగానే.. తండ్రి కుమారుడికి శివుని వరం గురించి చెప్పేస్తాడు. దీంతో మిగిలిన కొద్దిపాటి సమయాన్ని శివ ధ్యానంలో గడపాలని మార్కండేయడు నిర్ణయించుకుని, అందుకు తగిన స్థలం కోసం వెతుకుతూ.. నేటి అమృత ఘటేస్వరుని ఆలయానికి వచ్చి.. అక్కడే మహా మృతుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉండిపోతాడు. ఖచ్చితంగా బాలుడికి 16 ఏళ్లు నిండగానే.. యముడు మార్కండేయుడిని తీసుకుని పోయేందుకు పాశాన్ని చేతబూని అక్కడికి రాగా.. భయపడిన బాల మార్కండేయుడు అక్కడి శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు. దీంతో ఆ పాశం శివలింగం పై పడటంతో క్రోధించిన శివుడు.. తన త్రిశూలంతో యముడిని వధించుతాడు. యముని మరణం తో ముల్లోకాలు అల్లకల్లోలం కాగా, దేవతల కోరికపై శివుడు.. యముడిని తిరిగి బతికించటమే గాక మార్కండేయుడికి చిరంజీవిగా ఉండే వరమిస్తాడు.

పురాణ గాథలు
ఒకనాడు పార్వతీదేవి పరమ భక్తుడైన అభిరామ భట్టారకుడు అనే భక్తుడు.. అమ్మవారి ధ్యానంలో ఉండటం చేత.. తన పక్కనే నిలబడిన మహారాజును పట్టించుకోడు. అందుకు ఆగ్రహించిన మహారాజు అభిరామ భట్టారకుడిని ‘ఈ రోజు తిథి ఏమిటి?’ అని అడగగా, ధ్యానంలో ఉన్న అభిరాముడు.. అమావాస్యకు బదులుగా పున్నమి అని పొరబాటున జవాబిస్తాడు. దానికి ఆగ్రహించిన రాజు అభిరాముడిని ఒక చెక్కకు కట్టి.. భగభగమని మండే లోతైన అగ్నిగుండంలోకి మెల్లమెల్లగా దించమని ఆదేశిస్తాడు. వేడి, మంటలకు ధ్యానం నుంచి బయటికి వచ్చిన భట్టారకుడు.. అమ్మవారిని ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటూ అష్టోత్తరం చదవడం మెదలు పెడతాడు. ఈ అష్టోత్తరంలో ప్రత్యేకత ఏమిటంటే మొదటి నామం యొక్క చివరి అక్షరంతో.. తర్వాతి నామం మొదలవుతుంది. ఇలా.. ఆర్తిగా కన్నీటితో అభిరామ భట్టారకుడు 70వ నామం చదువుతుండగా, అమ్మవారు.. తన చెవి కుండలాన్ని ఆకాశంలోకి విసురుతుంది. ఆ ఆభరణం పూర్ణచంద్రుడిలా మెరుస్తూ కనిపించటంతో దాన్ని చూసిన మహారాజు.. అభిరామ భట్టారకుని క్షమించమని వేడుకొని అప్పటి నుండి అమ్మవారి పేరు అభిరామిగా మార్చి అమ్మవారి సేవ చేసుకొని అక్కడే శివైక్యం చెందుతాడు. తర్వాతి రోజుల్లో అభిరామ భట్టారకుడు కుడా అమ్మవారి ధ్యానంలోనే జీవన్ముక్తిని పొందుతాడు.

తిరుక్కడయూర్‌లోని అమృతఘటేస్వర్ ఆలయానికి వెళ్లాలనుకునేవారు.. కుంభకోణం లేదా చిదంబరం చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు. మార్కండేయుడు చిరంజీవిగా మారిన ఈ ఆలయంలో ఆయుష్ హోమం చేయించుకుంటే.. అకాలమృత్యు దోషం పోతుందని భక్తుల నమ్మకం.

Related News

Eclipse: గ్రహణం రోజు ఏం చేయాలి ? ఏం చేయకూడదో తెలుసా ?

Peepal Tree: ఇంటి గోడపై రావి చెట్టు పెరగడం శుభమా ? అశుభమా ?

Tulsi Plant: వాస్తు ప్రకారం.. తులసి మొక్కను ఏ దిశలో నాటాలి ?

Ganesh Immersion: మీరు ఇంట్లోనే వినాయకుడి నిమజ్జనం చేస్తున్నారా ? ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి

Cats Scarified: 4 ఆలయాలు.. 4 పిల్లులు బలి.. ఆ గ్రామానికి అరిష్టమా?

Vastu Tips: వ్యాపారంలో లాభాలు రావాలంటే.. ?

Big Stories

×