Jatadhara Movie Review : సుధీర్ బాబు సినిమాలు వస్తున్నాయి…పోతున్నాయి తప్ప ఏదీ ఆడటం లేదు. ఈరోజు ‘జటాధర’ వచ్చింది. ఈ సినిమా వస్తుందని చాలా మందికి తెలీదు అంటే ప్రమోషన్స్ ఎంత వీక్ గా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. సుధీర్ బాబు పాల్గొన్న ఇంటర్వ్యూల్లో కూడా.. ఈ సినిమాపై ఇంట్రెస్ట్ లేనట్టే కనిపించాడు. మరి ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుందా? లేదా? అన్నది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..
శివ(సుధీర్ బాబు) ఓ ఘోస్ట్ హంటర్. దెయ్యాలు లేవు అనే భ్రమలో ఉన్న జనాలను మార్చాలనే ఉద్దేశంతో.. పాడుబడ్డ బంగ్లాలు, మర్రిచెట్లు వంటి ప్రదేశాలకి వెళుతూ ఉంటాడు. అయితే రుద్రాయ నగరం అనే ఊరు. అక్కడ ఉన్న పాడుబడ్డ బంగ్లాలో ధనపిశాచి(సోనాక్షి సిన్హా) ఉంటుంది. ధనంపై ఉన్న వ్యామోహంతో శోభా(శిల్పా శిరోద్కర్) ఆమె భర్త బాల్రాజ్(రోహిత్ పతక్) ఎప్పుడో పూర్వీకులు చేసిన ధనపిశాచి బందనాన్ని తొలగించి.. ధనపిశాచి బయటకు వచ్చేలా చేస్తారు. ఆమె రక్తదాహం తీర్చేందుకు వాళ్ళు ప్రాణాలు విడుస్తారు.
అయితే ఆ ధనపిశాచి శివని బలికోరుతుంది. పంచభూతాలను ప్రేరేపించి అతను రుద్రాయ నగరం వచ్చేలా చేస్తుంది. కానీ ఆ ఊరికి వెళ్లకుండా శివ తల్లిదండ్రులు అడ్డుకుంటారు. అది ఎందుకు? ఓ చిన్న పిల్లాడిని చంపినట్టు ప్రతిసారి శివకి ఎందుకు కల వస్తుంది? ఆ పిల్లాడిని సొంత తల్లిదండ్రులే ఎందుకు చంపాలి అనుకుంటారు? మధ్యలో శివని పెళ్లి చేసుకోవాలనుకునే సితార(దివ్య కోస్లా) జీవితం ఏమైంది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
అభిషేక్ జైస్వాల్, వెంకట్ కళ్యాణ్ ఈ చిత్రానికి దర్శకులు. బహుశా తెలుగు వెర్షన్ ని వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేసి ఉండొచ్చు. ‘జటాధర’ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి కచ్చితంగా సుధీర్ బాబు ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడేమో అని అంతా అనుకున్నారు. పోస్టర్స్ డిజైన్ కూడా బాగుండడమే అందుకు కారణం. కానీ ఎప్పుడైతే ట్రైలర్ బయటకు వచ్చిందో.. అప్పుడే ఆడియన్స్ కి ఈ సినిమాపై ఒక అవగాహన వచ్చేస్తుంది. సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో ట్రైలర్ విఫలం అయితే.. దీనికి బజ్ రాదు. ‘జటాధర’ విషయంలో అదే జరిగింది.అందుకు తగ్గట్టే సినిమాకి నెగిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా స్టార్టింగ్ బాగుంది. ఇంట్రెస్టింగ్ సెటప్ ఉంది. కానీ ఇంతకీ మెయిన్ ప్లాట్ రాదు.
ఇంటర్వెల్ వరకు సాగదీయడానికి ఏవేవో సన్నివేశాలు పెట్టారు. అవి ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తాయి. ఇంటర్వెల్ మెయిన్ పాయింట్ కి రావడంతో సెకండాఫ్ పై భారం వేసి కూర్చోవాలి. తర్వాత సెకండాఫ్ పరిస్థితి కూడా అంతే. హీరో బ్యాక్ స్టోరీ కూడా ఆసక్తిగా ఉండదు. క్లైమాక్స్ అయినా ఫాస్ట్ గా ముగించారా? అంటే అదీ లేదు. అయితే అరుణాచలం గుడి.. దాని ప్రాముఖ్యత గురించి చెప్పిన తీరు బాగుంది. అలాగే కేరళలో ఉన్న ఓ గుడి గురించి వచ్చిన వార్తలను కూడా హైలెట్ చేస్తూ కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేయాలని ప్రయత్నించారు. కానీ అది కూడా సైడ్ ట్రాక్ అయిపోయింది.
క్లైమాక్స్ లో శివుడిని కూడా దింపి పాస్ మార్కులు వేయించుకోవాలని ప్రయత్నించారు. అది కూడా బెడిసి కొట్టింది. ఏ దశలోనూ ప్రేక్షకుడు పెట్టిన టికెట్ డబ్బులకి ‘జటాధర’ న్యాయం చేసే విధంగా లేదు. టెక్నికల్ గా కూడా అంతే. సరిగ్గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకుండానే సినిమాని రిలీజ్ చేసినట్టు ఉన్నారు. కొన్ని చోట్లా వీ.ఎఫ్.ఎక్స్ కూడా పెట్టకుండా డైలాగులతో మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా సాంకేతికంగా కూడా ‘జటాధర’ ఫెయిల్ అయ్యింది.
నటీనటుల విషయానికి వస్తే.. సుధీర్ బాబు ఎప్పటిలానే నీరసపు యాక్టింగ్ తో ప్రేక్షకులకి కూడా నీరసం తెప్పించాడు. క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ చూపించాడు. శివుడి ముందు డాన్స్ వేశాడు. హీరోయిన్ దివ్య కోస్లా సుధీర్ బాబు కంటే వయసు ముదిరిన ఆంటీగా కనిపించింది. హీరోయిన్ అనే ఫీలింగ్ ఎక్కడా కలగదు. అన్నట్టు ఈ సినిమాతో మహేష్ బాబు మరదలు, నమ్రత చెల్లెలు అయినటువంటి శిల్పా శిరోద్కర్ రీ ఎంట్రీ ఇచ్చింది. నెగిటివ్ రోల్లో బాగానే చేసింది. ఇక ధనపిశాచిగా చేసిన సోనాక్షి సిన్హాకి ఒక్క డైలాగ్ కూడా లేదు. పళ్ళుకొరకడం, గట్టిగా అరవడం తప్ప ఆమె చేసింది ఏమీ లేదు. రాజీవ్ కనకాల పాత్ర ఈ సినిమాలో బ్రతికుంటుంది అంతే..! ఝాన్సీ తల్లి పాత్రలో బాగానే చేసింది.
మొదటి 15 నిమిషాలు
మిగతావన్నీ
మొత్తానికి ‘జటాధర’ మొదటి షోకే సుధీర్ బాబు కెరీర్లో మరో డిజాస్టర్ గా మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతో ఓపిక ఉంటే తప్ప సినిమాని థియేటర్లో చూడలేం.