BigTV English

Antarvedi Temple : ఆర్త జన రక్షకుడు.. అంతర్వేది నారసింహుడు..

Antarvedi Temple : ఆర్త జన రక్షకుడు.. అంతర్వేది నారసింహుడు..

Sri Lakshmi Narasimha Swamy Rathotsavam : లోకపాలకుడు, భక్త జన రక్షకుడైన శ్రీమహా విష్ణువు అవతారాల్లో నరసింహావతారం ఒకటి. తెలుగు నేలమీద 9 చోట్ల నరసింహుడు అవతరించాడు. వాటినే మనం నవ నారసింహ క్షేత్రాలుగా పిలుచుకుంటున్నాం. వాటిలో అంతర్వేది ఒకటి. కోనసీమ వాసుల కొంగు బంగారంగా, నమ్మి ఆశ్రయించిన భక్తుల రక్షకుడిగా కొలువైన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి రథయాత్ర సందర్భంగా ఆ దివ్యక్షేత్ర విశేషాలను ఓసారి తెలుసుకుందాం.


పావన గోదావరి పాయ అయిన వశిష్టా నది, సముద్రంలో కలిసే సంగమ ప్రదేశంలో అంతర్వేది క్షేత్రం ఉంది. సాధారణంగా నది, సాగరంలో కలిసే చోట శివాలయాలే ఉంటాయి. కానీ.. ఇది వైష్ణవ క్షేత్రం కావటం విశేషం. బ్రహ్మ దేవుడు ఇక్కడ లోక కల్యాణం కోసం మహరుద్ర యాగం చేసి, శివుడినే క్షేత్ర పాలకుడిగా చేయటం ఈ క్షేత్రపు మరో విశేషం. నాడు బ్రహ్మయాగం చేసిన వేదిక నేటి గ్రామంలోనిదే కావటంతో.. ఈ గ్రామానికి ‘అంతర్వేది’ అనే పేరు వచ్చింది. దక్షిణ కాశిగానూ పేరొందిన ఈ మహిమాన్విత దివ్యక్షేత్రం కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి మండలంలో ఉంది. వశిష్ఠుడు, శ్రీరామచంద్రుడు, అర్జునుడు వంటి వారందరో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు స్థల పురాణం చెబుతోంది.

స్థల పురాణం
పూర్వం వశిష్ఠ మహర్షి ఇక్కడి గోదావరీ తీరాన ఆశ్రమాన్ని నిర్మించుకుని పలు యజ్ఞయాగాదులు చేసేవాడు. ఆ సమయంలో శివుడి వరాలను పొందిన హిరణ్యాక్షుడి కుమారుడైన రత్నలోచనుడు అనే రాక్షకుడు ఈ ఆశ్రమాన్ని పాడు చేసి బ్రహ్మర్షి వశిష్ఠుడి యాగాలకు అంతరాయం కలిగించాడు. అంతటితో ఆగకుండా వశిష్టుని అర్ధాంగి అరుంధతిని హింసించటం, ముని కాంతలను చెరపట్టటం, ముని బాలకులను చంపటంతో వశిష్ఠుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా, స్వామి నరసింహుడి అవతారంలో వచ్చి ఆ రాక్షసుడితో యుద్ధం చేశాడు.


Read more: ప్రణతోస్మి.. దివాకరమ్..!

కానీ.. ఆ రత్నలోచనుడు శివుడి నుంచి పొందిన వరం ప్రకారం.. వాడి రక్తం నేల మీద పడగానే మరో వెయ్యిమంది రాక్షసులు పుట్టుకొచ్చే వరం ఉండటంతో.. నారసింహుడు ఆ రాక్షసుడిని జయించలేకపోయాడు. ఆ సమయంలో ఆది పరాశక్తి.. ‘అశ్వరూఢాంబిక’ అనే రూపంలో అన్నకు తోడు యుద్ధానికి వచ్చి, తన నాలుకను భూమి అంతా పరచి, రాక్షసుడి రక్తం నేల మీద పడకుండా చేస్తుంది. దీంతో విష్ణువు రత్నలోచనుని వధించి, అతడి కళేబరాన్ని అంతర్వేదిలో విసిరివేశాడు. నాడు అమ్మవారి నాలుక మీద పారిన రాక్షసుడి రక్తధారయే నేడు రక్తకుల్యగా అంతర్వేది సమీపంలో ఒక ప్రవాహంగా నేటికీ ఉంది. నాడు అశ్వరూఢాంబికగా వచ్చిన ఆది పరాశక్తినే ఇక్కడి స్థానికులు ‘గుర్రాలక్క’ పేరుతో పూజిస్తున్నారు. నాడు బ్రహ్మర్షి వశిష్ఠుడు నివసించిన కారణంగా గోదావరి ఇక్కడి పాయకు వశిష్ఠ అనే పేరు వచ్చింది.

ఆలయ చరిత్ర
కలియుగం ఇక రాబోతోందనగా, వశిష్ఠుడు అంతర్వేదీ క్షేత్రాన్ని వదిలి వెళ్లిపోవటంతో కాలక్రమంలో అప్పటి వరకు ఆయనచే పూజింపబడిన నారసింహుడి మూలమూర్తి నేలలో కలిసిపోయింది. ఆ సమయంలో కేశవదాసు అనే వ్యక్తి.. అడవిలో ఆవులను మేపుకుంటూ అక్కడికి రాగా..ఒక ఆవు అక్కడి పుట్టలో నిత్యం క్షీరాన్ని వదలటం గమనించాడట. ఆ రాత్రే ఆయనకు నారసింహుడు కలలో కనిపించి ఆ పుట్టలో ఉన్న తనను తీయమని సూచించగా, మర్నాడే అక్కడి పుట్టలోని నారసింహుడి మూలమూర్తిని తీసి ఒక చిన్న పందిరి వేసి ప్రతిష్ఠించి పూజలు చేశాడు.

అదే సమయంలో అంతర్వేదికి సమీపంలోని ఓడలరేవు అనే గ్రామంలో కొపనాతి ఆదినారాయణ అనే వ్యాపారి నౌకల ద్వారా సరుకు రవాణా చేసేవాడు. ఒకసారి సముద్రంలో తుఫాను వచ్చి ఆయన నౌకలు తప్పిపోగా.. వాటిని వెతికే ప్రయత్నంలో అంతర్వేదికి వచ్చి తన నౌకలు క్షేమంగా వస్తే ఇక్కడ ఆలయాన్ని నిర్మిస్తానని స్వామికి మొక్కుకున్నాడు. ఆ మర్నాడే నౌకలు రావటంతో ఆయన ఇక్కడ ఆలయం కట్టేపనికి పూనుకుని మండపాల నిర్మాణం చేసి కన్నుమూశాడు. తర్వాత ఆయన కుమారుడు కోపనాతి కృష్ణమ్మ 1822 ఆలయ నిర్మాణం పూర్తి చేశాడని ఆలయ శిలా శాసనం ద్వారా తెలుస్తోంది. కాగా.. 1844లో బ్రిటిష్ పాలకులు ఈ ఆలయం నిర్వహణను మొగల్తూరుకు రాజా కలిదిండి కుమార లక్ష్మీనర్సింహరాజు బహదూర్ వారికి అప్పగించగా, వారు స్వామి వారి కైంకర్యానికి వందలాది ఎకరాల భూములు, భారీగా నగదును సమకూర్చారు. నాటి నుంచి నేటి వరకు ఆ వంశీకులే ఆలయ ధర్మకర్తలుగా వ్వవహరిస్తున్నారు.

స్వామి మహిమ
పూర్వం స్వామి ఆలయం వెనుక ఉన్న నదిలో ఒక జాలరి చేపలు పట్టుకునేవాడట. ఒక రోజు అతని వలతో రెండు శిలలు పడగా అవి పనికిరాని రాళ్లు అనుకుని వాటిని నీటిలో విసిరేశాడట. కానీ.. మళ్లీ మళ్లీ అవే రాళ్లు వలలో పడటంతో కోపమొచ్చిన జాలరి వాటిని ఒడ్డుమీద ఓ రాయిమీద విసరగా.. ఈ రెండు రాళ్ల నుంచి రక్తం స్రవించిందట. దాంతో భయపడిన జాలరి.. ఆ రాళ్లను ఆలయ పూజారులకు చూపించగా వాటిని అరుదైన నారసింహ సాలగ్రామాలుగా వారు గుర్తించారట. నాటి నుంచి నేటి వరకు స్వామి మూల మూర్తి పాదాల చెంత ఆ సాలగ్రామాలు ఆలయంలో నిత్యపూజలు అందుకుంటున్నాయి.

Read more: రాశిని బట్టి దర్శించాల్సిన జ్యోతిర్లింగాలు.. వీటితో అంతా మంచే జరుగుతుంది!

ఏటా మాఘశుద్ధ దశమి నాటి రాత్రి స్వామి వారి కల్యాణం, మరునాడు (భీష్మ ఏకాదశి) నాడు లక్షలాది భక్తుల సందడి నడుమ కన్నుల పండువగా స్వామి వారి రథోత్సవం జరుగుతాయి. శోభాయ మానంగా సిద్ధమైన ఆ ఎత్తైన రథానికి కట్టే అరటి గెలలు, గుమ్మడికాయలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక.. స్వామి కల్యాణం సందర్భంగా తన సోదరి గుర్రాలక్క వద్దకు వెళ్లి ఆహ్వానం ఇచ్చేందుకు వెళ్లగా, ‘ఏటే పెళ్లి ఏమిట్రా వెర్రి నాగన్నా’ అంటూనే తమ్ముడి ఉత్సాహాన్ని ఆమోదించిందనీ, దీనికి రుజువుగా ఏటా వివాహానికి ముందు స్వామి సోదరి ఆలయం వరకు రథం మీద ఊరేగింపుగా వెళ్లి ఆమెకు చీరె సారెలు ఇచ్చి రావడం ఆనవాయితీగా వస్తోంది.

నారసింహుడు ప్రణవ స్వరూపుడిగా ఇక్కడి సముద్రతీరం వెంబడి సంచరిస్తూ ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను కాపాడతారని ఇక్కడి ప్రజల అపార విశ్వాసం. ఎన్నో ఉప్పెనలు, తుపానులు వచ్చినా తమను ఆ నరసింహుడే రక్షించాడనేది ఇక్కడి ప్రజల విశ్వాసం. భీష్మ ఏకాదశి మొదలు పౌర్ణమి లోపు ఏదో ఒక రోజున సూర్యోదయ కాలంలో భానుడి కిరణాలు ఇక్కడి స్వామివారి పాదాలను తాకుతాయి. ఈ విశేష క్షణాలను చూసేందుకు భక్తులు ఇక్కడికి తరలివస్తారు.

అంతర్వేది ఒక గొప్ప పుణ్యక్షేత్రమే గాక ఎంతో అందమైన సందర్శనీయ ప్రదేశం కూడా. ఇక్కడి ప్రశాంతమైన ప్రకృతి, గంభీరమైన సముద్రం ఒడ్డున అంతులేని మార్మికతతో దర్శనమిచ్చే ఆలయం చూసేవారి మనసులకు ఒక అనంతమైన ఆనందాన్ని, పారవశ్యాన్ని కలిగిస్తాయి.వశిష్ఠా నది, సముద్రంలో కలిసే సాగర సంగమ దృశ్యం ఓ అద్భుత అనుభూతినిస్తుంది. దీనికి కాస్త దూరాన ఉన్న లైట్ హౌస్, అంతర్వేది కాలవగట్లు, వాటి వెంట నిలిచిన వేలాది కొబ్బరి చెట్లు చూసిన వారికి ఈ యాత్ర పదికాలాల పాటు గుర్తుండిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి లాంచీ మీదుగా అంతిర్వేది చేరుకోవచ్చు. అలాగే.. తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చేవారు రాజోలు, మలికిపురం, మోరి గ్రామాల మీదుగా ఈ క్షేత్రానికి రావచ్చు.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×