Vastu For Staircase: ఇంటి నిర్మాణంలో మెట్లు కేవలం పై అంతస్తుకు చేరడానికి మాత్రమే కాక.. ఇంట్లోని శక్తి ప్రవాహం (ఎనర్జీ ఫ్లో)పై కూడా కీలక ప్రభావాన్ని చూపుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లను సరైన దిశలో.. అంతే కాకుండా సరైన ఆకృతిలో నిర్మించడం ద్వారా ఇంట్లో శ్రేయస్సు, శాంతి, పురోగతి కలుగుతాయని నమ్ముతారు. తప్పుడు దిశలో మెట్ల నిర్మాణం వాస్తు దోషాలను సృష్టించి, ఆర్థిక ఇబ్బందులకు , ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇంటి లోపల మెట్ల నిర్మాణానికి పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు:
1. సరైన దిశను ఎంచుకోవడం:
మెట్లను నిర్మించడానికి అత్యంత అనుకూలమైన దిశలు ఇవి..
నైరుతి (South-West): మెట్ల నిర్మాణానికి ఇది అత్యంత ఉత్తమమైన దిశ. ఈ భాగంలో మెట్లు ఉంటే ఇంటి యజమానికి స్థిరత్వం, ఆర్థిక వృద్ధి లభిస్తుంది.
దక్షిణం (South): ఇంటి దక్షిణ భాగంలో గోడకు ఆనుకుని మెట్లను నిర్మించవచ్చు.
పశ్చిమం (West): పశ్చిమ భాగంలో కూడా మెట్ల నిర్మాణం శుభప్రదమే.
నివారించాల్సిన దిశలు:
ఈశాన్యం (North-East): ఈ దిశలో మెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు. ఈశాన్యం మెట్లకు తగని స్థలం. ఇది ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తుంది.
బ్రహ్మస్థానం (ఇంటి మధ్య భాగం): ఇంటి మధ్య భాగంలో (బ్రహ్మస్థానంలో) మెట్లను నిర్మించకూడదు. ఇది ఇంటి శక్తి ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలిగిస్తుంది.
2. మెట్లు తిరిగే విధానం:
మెట్లు ఎప్పుడూ సవ్యదిశలో.. పైకి తిరిగేలా ఉండాలి. అంటే..
మెట్లు తూర్పు నుంచి పడమర వైపు ఎక్కే విధంగా ఉండాలి.
లేదా ఉత్తరం నుంచి దక్షిణం వైపు ఎక్కే విధంగా ఉండాలి.
అపసవ్య దిశలో తిరిగే మెట్లు ఇంట్లో నివసించే వారి వృత్తిపరమైన ఎదుగుదలకు, ఆర్థిక విషయాలకు హానికరమని వాస్తు నిపుణులు చెబుతారు.
3. మెట్ల సంఖ్య :
వాస్తు ప్రకారం.. మెట్ల సంఖ్య ఎప్పుడూ బేసి సంఖ్యలో.. ఉండాలి. అంటే.. 5, 7, 9, 11, 13, 15, 17… ఇలా ఉండాలి. ఒక వ్యక్తి పై అంతస్తుకు చేరుకున్నప్పుడు.. అతని కుడి లేదా ఎడమ కాలు కాకుండా మొదటి మెట్టుపై పెట్టిన అదే కాలు చివరి మెట్టుపై ఉంచాలి. అందుకే ‘బేసి’ సంఖ్య శుభప్రదంగా పరిగణిస్తారు.
4. మెట్ల కింద స్థలం వినియోగం:
మెట్ల కింద ఉన్న స్థలాన్ని ఉపయోగించడం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
నివారించాల్సినవి: మెట్ల కింద వంటగది, బాత్రూమ్, పూజా గది లేదా పడుకునే గదిని నిర్మించకూడదు.
పెట్టకూడనివి: షూ స్టాండ్‌లు, డబ్బు లేదా ఆభరణాలు నిల్వ ఉంచే లాకర్లు, విస్మరించిన వస్తువులు లేదా చెత్తను ఈ స్థలంలో ఉంచకూడదు.
ఉపయోగించే విధానం: వాస్తు ప్రకారం.. మెట్ల కింద ఉన్న స్థలాన్ని సాధారణ స్టోరేజ్ (సాధారణ గృహ వస్తువులు) కోసం మాత్రమే ఉపయోగించాలి.
Also Read: కార్తీక మాసం, ఏ రోజు నుంచి ప్రారంభం ? పూర్తి వివరాలివిగో..
5. మెట్ల ఆకారం, రంగులు, మరమ్మతులు:
ఆకృతి: మెట్లు చదరంగా లేదా దీర్ఘ చతురస్రాకారంలో.. ఉండాలి. స్పైరల్ (గుండ్రంగా) ఉండే మెట్లను వాస్తు శాస్త్రం సిఫారసు చేయదు. ఎందుకంటే అవి ఇంట్లో నివసించే వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
రంగు: మెట్లకు లేత రంగులను ఉపయోగించడం మంచిది. ముదురు రంగులు, ముఖ్యంగా నలుపు రంగును నివారించాలి.
మరమ్మతులు: మెట్ల మార్గంలో లేదా వాటి ప్రహరీ గోడపై ఎటువంటి పగుళ్లు ఉండకూడదు. పగుళ్లు కనిపిస్తే వెంటనే మరమ్మతులు చేయించాలి.
వాస్తు నియమాలు పాటించడం ద్వారా.. మీ ఇల్లు, కుటుంబంలో సానుకూలత, సంపద, శాంతిని ఆకర్షించవచ్చు. మీ ఇంటి మెట్ల నిర్మాణం వాస్తు ప్రకారం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.