ఈ రోజుల్లో చాలా మంది టాక్సీ డ్రైవర్లు డ్యూటీలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ, యూట్యూబ్ వీడియోలు చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. కొంత మంది ఏకంగా సోషల్ మీడియాలో రీల్స్ ట్యాప్ చేస్తూ వెళ్తున్నారు. సెల్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక చర్యలు చేపడుతున్నారు. ఇకపై మోబైల్ యూజ్ చేస్తూ వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
రోడ్డు మీద వాహనాలు నడిపే సమయంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఇందుకు సంబంధించి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు తమతో పాటు తోటి ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమైనదని గుర్తించాలన్నారు. “ఆటో రిక్షా, క్యాబ్/బైక్ టాక్సీ డ్రైవర్లతో సహా చాలా మంది డ్రైవింగ్ చేస్తూ తరచుగా వీడియోలు చూడటం, ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం అత్యంత ప్రమాదకరం. శిక్షార్హమైన నేరం. ఇకపై ఇలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. తమతో పాటు రోడ్డు మీద వెళ్లే వాహనదారుల భద్రత కూడా చాలా ముఖ్యమైనది భావించాలి. పరధ్యానంలో ఉండి వాహనాలు నడపకూడదు. ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని వాహనదారులు గుర్తించాలి. ఇకపై ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా ఉండాలి” అని పోస్టు పెట్టారు.
🚦 Many drivers, including auto-rickshaw and cab/bike taxi drivers, are often seen watching videos or using earphones while driving. This is dangerous and a punishable offence. Hyderabad Traffic Police will take strict action against such violators.
Safety of self, passengers,… pic.twitter.com/n87ZCbu3Ip
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 7, 2025
చాలా మంది ఆటో డ్రైవర్లు, బైక్ టాక్సీ రైడర్లు ప్రయాణీకులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్లేటప్పుడు రీల్స్, యూట్యూబ్ కంటెంట్ చూడటానికి తమ మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం సర్వసాధారణంగా మారింది. కొంతమంది డ్రైవర్లు నిరంతరం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. మరికొందరు కాల్స్ కు సమాధానం చెప్తూ ఒంటి చేత్తో డ్రైవ్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణీకులు తమ భద్రత విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. అయినప్పటికీ, అలాంటి డ్రైవర్లపై ఎటువంటి కచ్చితమైన చర్యలు తీసుకోవడం లేదు. అక్టోబర్ 4న లక్డీకా పుల్ నుంచి బంజారా హిల్స్ కు బైక్ రైడ్ బుక్ చేసుకున్న ఒక వ్యక్తి రైడ్ సమయంలో బైక్ రైడర్ తన మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూస్తున్నట్లు గమనించాడు. సదరు ప్రయాణీకుడు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, రైడర్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సీపీ తాజా హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించేలా అవసరం అయితే కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకాడబోరని సజ్జనార్ హెచ్చరించారు.
Read Also: టికెట్ లేదు, పైగా దబాయింపు.. నెట్టింట టీచర్ వీడియో వైరల్!