Couples Fights: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి కారణంగా దంపతుల మధ్య చిన్నచిన్న గొడవలు రావడం సహజం. అయితే.. ఈ గొడవలు ముదిరి మనస్పర్థలకు దారితీయకుండా ఉండాలంటే ఇంట్లో సానుకూల వాతావరణం ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. మన చుట్టూ ఉండే వస్తువులు, ముఖ్యంగా మనం పడుకునే గదిలో ఉండే ఫోటోలు మన మనస్తత్వంపై , సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. బెడ్‌రూమ్‌లో సరైన ఫోటోలు ఉంచడం ద్వారా దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
1. రాధాకృష్ణుల పటం: హిందూ సంప్రదాయంలో రాధాకృష్ణులు నిరంతర ప్రేమకు, అంకితభావానికి చిహ్నం. దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నప్పుడు, బెడ్‌రూమ్‌లో రాధాకృష్ణులు కలిసి ఉన్న ఫోటోను పెట్టడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇది భార్యాభర్తల మధ్య విడదీయలేని బంధాన్ని ప్రోత్సహిస్తుంది. అయితే.. ఈ ఫోటోను నైరుతి దిశలో ఉంచడం శ్రేయస్కరం.
2. జంట పక్షుల ఫోటోలు: వాస్తు, ఫెంగ్ షూయి ప్రకారం.. జంటగా ఉన్న పక్షుల ఫోటోలు ప్రేమను పెంపొందిస్తాయి. ముఖ్యంగా ‘మాండరిన్ బాతులు’ లేదా ‘హంసల జంట’ నీటిలో కలిసి ఈదుతున్నట్లు ఉన్న ఫోటోలను బెడ్‌రూమ్‌లో పెట్టుకోవాలి. పక్షులు ఎప్పుడూ జంటగానే ఉండాలి. ఒంటరిగా ఉన్న పక్షి ఫోటోను అస్సలు ఉంచకూడదు. ఇది ఒంటరితనాన్ని సూచిస్తుంది.
3. దంపతులు నవ్వుతున్న ఫోటో: చాలా మంది పెళ్లి ఫోటోలను బీరువాలోనో లేదా హాల్‌లోనే పెడతారు. కానీ.. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంతోషంగా నవ్వుతున్న ఒక ఫోటోను బెడ్‌రూమ్‌లో నైరుతి దిశ గోడకు తగిలించాలి. మీరు సంతోషంగా ఉన్న క్షణాలను పదే పదే చూడటం వల్ల మీ మధ్య ఉన్న పాత గొడవలు తగ్గి, మళ్ళీ ఆ సంతోషకరమైన రోజులు గుర్తుకు వస్తాయి.
4. ప్రకృతి, పూల ఫోటోలు: ఎరుపు లేదా పింక్ రంగు పూలు ఉన్న ప్రకృతి దృశ్యాలు ప్రేమకు సంకేతం. గులాబీ పూల బొమ్మలు లేదా అందమైన తోటల ఫోటోలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఇది బెడ్‌రూమ్‌లో రొమాంటిక్ వైబ్స్‌ను క్రియేట్ చేస్తుంది. గదిలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే.. కోపం వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
5. హిమాలయాలు లేదా పర్వతాల ఫోటోలు : మీరు పడుకునే మంచం వెనక గోడపై పర్వతాల ఫోటోలు (నీరు లేనివి) ఉంచడం వల్ల బంధం బలంగా మారుతుంది. పర్వతం స్థిరత్వానికి చిహ్నం. ఇది దంపతుల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని, స్థిరమైన బంధాన్ని ఇస్తుంది.
Also Read: భోళాశంకరుడికి అత్యంత ప్రీతిపాత్రులు వీరే.. ఆ 5 లక్షణాలు మీలో ఉన్నాయా?
6. బెడ్‌రూమ్‌లో ఇవి అస్సలు ఉండకూడదు:
యుద్ధం లేదా హింస: యుద్ధం, ఏడుపు, లేదా గొడవలను సూచించే ఫోటోలు అస్సలు ఉండకూడదు.
నీటి ఫోటోలు: బెడ్‌రూమ్‌లో జలపాతాలు లేదా పొంగిపొర్లే నదుల ఫోటోలు ఉండకూడదు. వాస్తు ప్రకారం బెడ్‌రూమ్‌లో నీటి అంశం ఉంటే దంపతుల మధ్య అస్థిరత ఏర్పడుతుంది.
పూర్వీకుల ఫోటోలు: చాలామంది గౌరవార్థం పితృదేవతల ఫోటోలు బెడ్‌రూమ్‌లో పెడతారు. కానీ వాస్తు ప్రకారం వీటిని పూజ గదిలో లేదా హాల్‌లోనే ఉంచాలి. బెడ్‌రూమ్‌లో ఉంచడం వల్ల వైవాహిక జీవితంపై ప్రభావం పడవచ్చు.
ముళ్ళ మొక్కలు: కాక్టస్ వంటి ముళ్ళ మొక్కల ఫోటోలు లేదా విగ్రహాలు చిరాకును, గొడవలను పెంచుతాయి.