Bhadrachalam : వసంతోత్సవం సందర్భంగా పుష్కర సామ్రాజ పట్టాభిషేక మహోత్సవానికి నది సముద్ర పుష్కరణీ జలాలను సేకరించేందుకు వైదిక సిబ్బందిని దేశంలోని వివిధ ప్రాంతాలకు వైదిక కమిటీ పెద్దలు పంపారు. సదరు జలాలను స్వీకరించేందుకు వెళ్లిన వైదిక, అర్చక బృందం కేరళ , తమిళనాడు ,మధ్యప్రదేశ్ ,మహారాష్ట్ర , ఛత్తీస్ ఘడ్ , తదితర రాష్ట్రాలలో నర్మదా చంద్రభాగ, తుంగభద్ర తదితర నదుల తీర్థ జలాలను సేకరించారు. మరికొన్ని పవిత్ర నదులలో తీర్థ జలాలను సేకరించి భద్రాద్రికి తీసుకొచ్చారు. ఏడాది పూర్తి సాంప్రదాయ బద్ధంగా జరగబోయే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అందుకే దేశంలోని ప్రముఖ నదులు, సముద్రాలు, పుష్కరణీల నుంచి పవిత్ర జలాలను శాస్త్రోక్తంగా సేకరించారు. .
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మధ్యలో ఉన్న అమరకంఠక్ నర్మదానది జన్మస్థలంలో సౌమిత్రి శ్రీనివాసాచార్యులు తీర్ధ సేకరణ చేశారు. పశ్చిమదిక్కులోని మహారాష్ట్రలోని చంద్రబాగా నది వద్ద అమరవాది మురళీకృష్ణమాచార్యులు, కలకోట పవనకుమారాచార్యులు, మేల్కొట దివ్యక్షేత్రంలో కల్యాణి పుష్కరిణి తీర్ధాన్ని పొడిచేటి రామభద్రాచార్యులు, పొడిచేటి సీతారామాచార్యులు సేకరించారు. ఇప్పటికే మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో తీర్థ జలాలను సేకరించారు.
భద్రాద్రి పట్టణంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి ముందుగా చేరిన ఈ పవిత్ర పుణ్యతీర్ధ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన భద్రాద్రి దేవస్థాన అర్చకులు అనంతరం శేష వాహనంపై తీర్థ జలాలను ఉంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాలు వేదమంత్రోత్సవాల నడుమ భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రధాన ఆలయానికి తీసుకువచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉగాది నాటి నుంచి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.