Bhogi 2025: చుట్ట పొగ మంచుల్లో.. చుట్టాల పిలుపుల్లో.. మాటలే కలిపేస్తూ.. మనసారా మమతల్ని పండించి.. ఒక్కటి చేసేదే సంక్రాంతి. తెలుగు వారి జీవితాలలో సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. దాని ముందురోజు వచ్చే భోగి పండుగకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి.. వారి మీద పోసే రేగుపళ్లే గుర్తుకు వస్తాయి. ఆ రోజున రేగిపళ్లు కాస్తా భోగిపళ్లగా మారిపోతాయి. సాయంత్రం సమయంలో చుట్టు ప్రక్కల ఉన్న వారందరిని పిలిచి, వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా రేగుపళ్లు, చిల్లర డబ్బులు, చామంతి లేదా బంతిపూలరెక్కలు, నానబెట్టిన శెనగలు, చెరుకు ముక్కలని తీసుకుని.. మూడు సార్లు తిప్పి వారి తల మీద పోస్తారు. భోగి పండుగ రోజు రేగుపళ్లను ఇంతలా తలుచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.
భోగి పండుగ విశిష్టత..
ఈ ఏడాది జనవరి 13వ తేదీనా సోమవారం నాడు భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ రోజున సహజంగా ఇంట్లో ఉన్నపాత వస్తువులు, చెక్కలన్ని ఇంటి ముందర పెట్టి మంటలు వేస్తారు. ఎందుకంటే చలి వాతావరణాన్ని తగ్గించడానికి ఒక ప్రయోజనకరమైంది. అక్కడి నుంచి ఉత్తరాయణం ఉంటుంది. ఈ ఉత్తరాయణంలో కొంత వేడి పుట్టించే శక్తి ఉంటుంది. కాబట్టి వచ్చే ఆ వేడికి ముందుగా మనం తయారుగా ఉండటానికి, మనల్ని సంశిద్ధులుగా చేసే పండుగే భోగి పండుగ. రాబోయే అగ్నికి సంబంధించిన సూర్యశక్తిని మన శరీరం గుర్తించేందుకు ఈ భోగి పండుగ రోజున భోగి మంటలు వేయడంలో ఉన్న గొప్ప అంతరార్ధం. రెండువది ఏంటంటే.. ఈ చలిని తట్టుకునేందుకు ఆవు పిడకలు, ఇంట్లో పనికిరాని వస్తువులు, విరిగిపోయిన వస్తువులను భోగి మంటల్లో వేస్తారు.
ఎందుకంటే అవి నెగిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయని ప్రజల నమ్మకం. అందుకే వాటిని భోగి మంటల్లో వేయడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతుంటారు. ఇక మరిసటి రోజు వచ్చేది సంక్రాంతి. క్రాంతి అంటే.. వెలుగు. సో కొత్త వెలుగులు నింపుకోవడానికి మొదటి రోజునే పాతదాన్ని తీసివెయ్యాలని శాస్త్రం చెబుతోంది. ఇక భోగి రోజున ఇల్లును శుద్ధి చేసి.. మరిసటి రోజు అంటే సంక్రాంతి రోజు పెద్దలకు సమర్పణ చేసి.. ఆపై మరిసటి రోజున చాలా మంది వారివారి ఇష్టమైన ఆహారాన్ని భుజించే పండుగ కనుమ పండుగ. ఇలా మూడు దినాలు కలిపి సంక్రాంతి పండుగ చేసుకుంటారు.
బదరీ వనంలో..
సంస్కృతంలో రేగుపళ్లని బదరీ ఫలాలు అంటారు. పూర్వం నరనారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ.. వాళ్లు రోజూ చుట్టు ప్రక్కల ఉన్న చెట్ల నుంచి రేగుపళ్లను ఆహారంగా తీసుకునేవాళ్లు. సాక్ష్యాత్తు నారాయణుడు అక్కడ తిరుగుతూ రేగుపళ్లను తింటూ.. ఆ ప్రదేశాల్ని, వృక్షాలను, వనాన్ని స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం. బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్ష్యాత్తు ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాయి గనుక.. ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదులు, భోగ భాగ్యాలు కలుగుతాయంటారు.
Also Read: సంక్రాంతి పండుగ వెనుక దాగిన విశేషాలివే.. ఆహా ఏమి వైభోగం!
భోగినాడు పెద్దవారు పిల్లలకు బోగిపళ్లు పోసి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతో పాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా అందుతాయని చాలా మంది నమ్ముతుంటారు. భోగి పండ్లు అంటే..రేగి పళ్లే కదా.. అందువల్లనా ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు గలిగిన రేగిపండ్లతో నాణాలను కలపి పిల్లల తలపై పోస్తే.. సూర్య భగవానుడి అనుగ్రహం పిల్లలపై ప్రసరించి, వారు ఆరోగ్యంగా జీవిస్తారని పెద్దవాళ్లు చెబుతుంటారు.